గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అజ్ఞాత దళ నాయకుడు లింగన్న బలి కావటం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు భూటకపు ఎన్‌కౌంటర్‌లో లింగన్నను హతమార్చారంటూ ఆదివాసీ గిరిజనులు ఆందోళనకు దిగారు. ఆగ్రహావేశాలకు గురై పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దాదాపు 300 మంది అటవీ ప్రాంతానికి చేరుకుని అక్కడి పోలీసులపై విరుచుకుపడ్డారు. ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను పట్టుకుని కర్రలతో చితకబాదారు. అయితే, తన వద్ద ఆయుధం ఉన్నా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కానిస్టేబుల్ పారిపోవటం హృదయ విదారకరం.
కాగా, గత కొంత కాలంగా దేవలగూడెం అటవీ ప్రాంతంలో లింగన్న దళం సంచరిస్తోందన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో బుధవారం ఉదయం నుంచి అజ్ఞాత దళాన్ని టార్గెట్‌గా చేసుకుని పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో తుపాకుల మోతతో దేవలగూడెం,గుండాల అటవీప్రాంతం దద్దరిల్లింది.