ఆర్టీసీ కార్మికులు సమ్మెకు స్వస్తి పలకాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం అవునో కాదో పక్కనబెడితే.. దసరా పండుగకు ముందు సమ్మె ప్రారంభించి ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ నెల 5 నుంచి సమ్మె మొదలైతే ఇప్పటివరకు చర్చలు జరిపేందుకు ఎందుకు చొరవ చూపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరేమైనా బ్రిటిష్ పాలనలో ఉన్నారా.. మీ ఇద్దరి మధ్య ఏమైనా టగ్ ఆఫ్ వార్ ఆట జరుగుతోందా అంటూ ధర్మాసనం ఇరు పక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.