కరోనా కాటేస్తోంది కాపాడరూ..! | Watch Video,Indian Crew Members On Board Cruise Ship Diamond Princess Off Japanese Coast Appealed For Help | Sakshi
Sakshi News home page

కరోనా కాటేస్తోంది కాపాడరూ..!

Published Thu, Feb 13 2020 9:16 AM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

టోక్యో : కరోనా వైరస్‌ కలకలం నేపథ్యంలో జపాన్‌ తీరంలో డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో చిక్కుకున్న భారత సిబ్బంది తమను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ నౌకలో ఇప్పటికే 135 కరోనా పాజిటివ్‌ కేసులను నిర్ధారించడంతో వారు ఆందోళనకు లోనవుతున్నారు. నౌకలో చిక్కుకున్న తమిళనాడులోని మధురైకి చెందిన అంబలగన్‌ తమను కాపాడాలని వేడుకుంటూ వీడియోలను షేర్‌ చేయడం వైరల్‌గా మారింది. ప్రయాణీకులను ఎక్కడికీ కదలకుండా ఉంచారని, వారు ఉన్న గదులకే ఆహారాన్ని పంపుతున్నారని వీడియోలో ఆయన చెప్పారు. తమకూ కరోనా వైరస్‌ సోకే ప్రమాదం పొంచిఉందని, తమను భారత ప్రభుత్వం కాపాడాలని సిబ్బంది తరపున అంబలగన్‌ వేడుకున్నారు.

నౌక సిబ్బందిలో పది మందికి వైరస్‌ సోకడంతో తాము ప్లేట్లను పంచుకుంటామని, సిబ్బందికి కేటాయించిన మెస్‌లో భోజనం చేస్తామని దీంతో తమకు సులభంగా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, తమను ఇక్కడ నుంచి భారత్‌కు తీసుకువెళ్లాలని అంబలగన్‌ అభ్యర్థించారు. మరో భారత సిబ్బంది వినయ్‌ కుమార్‌ సర్కార్‌ కూడా డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో చిక్కుకున్న భారత సిబ్బందిని వెనక్కిపిలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ఓ వీడియో రూపొందించారు. గతంలో పాక్‌ సేనల నుంచి ఐఏఎఫ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను కాపాడినట్లే తమనూ ఇక్కడి నుంచి రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నౌకకు సంబంధించిన ప్రోటోకాల్స్ తమను వీడియో షేర్‌ చేసేందుకు అనుమతించకపోయినా అసలు తాము అప్పటివరకూ బతికిఉంటమనే నమ్మకం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సెస్ క్రూయిస్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్‌లో 2,500 మందికి పైగా ప్రయాణికులు   1,000 మంది సిబ్బంది ఉన్నారు. ఫిబ్రవరి 4 నుంచి క్రూయిజ్ షిప్ జపాన్‌లోని యోకోహామా నౌకాశ్రయంలో నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement