Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Polavaram Project Authority gives clear message to Ministry of Jal Shakti1
‘బనకచర్ల’ అసాధ్యం!

సాక్షి, అమరావతి: ‘‘పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. దీనివల్ల పోలవరం ఆయకట్టుకు నీళ్లందించడమే సా­ధ్యం కాదు. పోలవరం–­బనకచర్ల అనుసంధాన ప్రా­జెక్టు (పీబీఎల్‌పీ)కు నీరి­వ్వడం అసాధ్యం’’ అని పోలవరం ప్రాజెక్టు అథా­రిటీ (పీపీఏ) తెగేసి చెప్పింది. ఈ మేరకు పీపీఏ డైరెక్టర్‌ మన్నూజీ ఉపాధ్యాయ కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తి చేశాకే పీబీఎల్‌పీపై ఏదైనా ఆలోచన చేయవచ్చునని స్పష్టం చేశారు. పీబీఎల్‌పీకి సంబంధించి డీపీఆర్‌ రూ­పకల్పనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌ మే 22న కేంద్ర జల సంఘం (సీ­డబ్ల్యూ­సీ)కు ప్రాథమిక నివేదిక (పీ­ఎఫ్‌­ఆర్‌)ను సమర్పించారు. సీడబ్ల్యూసీ... ఈ ప్రాథ­మిక నివేదికపై పీపీఏ అభి­ప్రాయం కోరింది. దీనిని సమగ్రంగా అధ్యయనం చేసిన పీపీఏ తన అభిప్రా­యాన్ని తెలిపింది. పోలవరం జలాశ­యంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చే­సేలా... ఆ ప్రాజె­క్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా గత ఏడాది ఆగస్టు 28న కేంద్రం ఆమోదించిందని, మిగిలిన పను­లకు రూ.­12,157.53 కోట్లకు మించి ఇచ్చేది లే­దని తేల్చిచెప్పిందని పేర్కొంది. దీని ప్రకారమే ప్రస్తుతం పనులు జరుగు­తున్నాయని లేఖలో వివరించింది. పీబీఎల్‌­పీ... పోలవరంలో భా­గం కాదని, ఈ నేపథ్యంలో పో­ల­­వరం నుంచి అదనంగా నీటి తరలింపుపై కేంద్రం సమగ్రంగా అధ్యయనం చేయాలని పీపీఏ పేర్కొంది. అందుబాటులో ఉన్న జ­లా­లు, అంత­ర్రాష్ట్ర వివాదా­లు, ట్రిబ్యునల్‌ అవా­ర్డు­లను పరిగణ­నలోకి తీసుకో­వాలని స్పష్టం చేసింది. పీబీ­ఎల్‌పీలో తాడిపూడి ఎత్తి­పో­తల కాలువను ఉప­యో­గించుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంద­ని­కానీ, పోలవరం పూర్తయ్యాక ఈ ఎత్తిపోతల ఆ­య­కట్టు కూడా పోలవరంలో భాగం అవుతుందని తె­లిపింది. పోలవరం కుడి కాలువ, డి­స్ట్రిబ్యూటరీ­లపై అధ్యయనం చేయాలని సూచించింది. 1980 ఏప్రిల్‌ 2న అంతర్రాష్ట్ర గోదావరి జలాల ఒప్పందం ఆధారంగా పోలవరం నిర్వహణ షెడ్యూ­ల్‌ను రూపొందించారని, పోలవరం నుంచి పీబీఎల్‌­పీ ద్వారా 200 టీఎంసీలను మళ్లించే క్రమంలో నాటి షెడ్యూల్‌ను పునఃపరిశీలించాలని తేల్చిచెప్పింది. పోలవరం కుడి కాలువ ద్వారా 200 టీఎంసీల గోదా­వరి జలాలను బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (బీసీ­ఆర్‌)కు తరలించేలా పీబీఎల్‌పీని రాష్ట్ర ప్రభు­త్వం రూపొందించింది. 80 లక్షల మందికి తాగు, 7.41 లక్షల ఎకరాలకు సాగు నీరు, నాగార్జున సాగర్‌ కుడి కాలువ, వెలిగొండ, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ కింద 22.58 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు... పారిశ్రామిక అవస­రాల కోసం 20 టీఎంసీలను సరఫరా చేస్తామని చెబు­తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.81,900 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది.కేవలం కమీషన్ల కోసమే బాబు సర్కారు బనకచర్ల రాగం...!రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే చేపడుతున్నట్లు స్పష్టం అవుతోందని సాగునీటి రంగ నిపుణులు, విమర్శకులు పేర్కొంటున్నారు. గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రూ.45 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వీటికి కేంద్రం ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించారని చెబుతున్నారు. అంతేగాక సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసే వరద 22.93 శాతం ఉంటుందని వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు చేరేది ఎప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ కీలక విషయాలపై మాట్లాడకుండా బాబు సర్కారు హడావుడి చేస్తోందని విమర్శిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై మౌనంగా ఉండి బనకచర్ల చేపట్టడమా? అని నిలదీస్తున్నారు. నీళ్లు రాని సంగతి తెలుస్తున్నా.. ఎర్త్‌ వర్క్‌ చేసి కమీషన్లు కొట్టేసే ఎత్తుగడతో పోలవరం–బనకచర్ల చేపట్టారని ఆరోపిస్తున్నారు.జనవరిలోనే ‘సాక్షి’ కథనం.. అక్షర సత్యంపీబీఎల్‌పీకి ఆర్థిక సాయం కోరుతూ కేంద్ర జల్‌ శక్తి శాఖకు చంద్రబాబు ప్రభుత్వం జనవరి 24న ప్రతిపాదనలు పంపింది. అప్పుడే ‘‘పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?’’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపింది. ఇప్పుడు పీపీఏ డైరెక్టర్‌ మన్నూజీ ఉపాధ్యాయ కూడా ‘సాక్షి’ కథనం అక్షర సత్యమని నిరూపించేలా కేంద్ర జల్‌ శక్తి శాఖకు లేఖ రాయడం గమనార్హం.జీవనాడికి ఉరేసి ఊపిరి తీయడం వల్లే..పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతిచ్చింది. ఆ మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎ­త్తుతో స్పిల్‌వేను 2021 జూన్‌ 11 నాటికే వైఎ­స్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ, గతేడాది ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ­తో పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఆ­మోదించింది. దీనిని ఆ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, టీడీపీకి చెందిన రామ్మోహన్‌­నాయు­డు వ్యతిరేకించలేదు. అంటే... పోలవరంలో 41.15 మీ­టర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభు­త్వం అంగీకరించిందన్న మాట. పోలవరం రిజర్వా­యర్‌ను బ్యారేజ్‌గా మార్చేందన్నది కూడా స్పష్టమ­వు­తోంది. పోలవరం కనీస నీటి మట్టం 41.15 మీట­ర్లు. ఈ స్థాయిలో 115.4 టీఎంసీలనే నిల్వ చేయొ­చ్చు. కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకు నీటిని తరలించవచ్చు. 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 ల­క్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపు­ణులు స్పష్టం చే­స్తున్నారు. 42 మీటర్ల ఎత్తు నుంచి పోలవరం కుడి కా­లువ ద్వారా బనకచర్లకు గోదా­వ­రి జలాలను తరలించడం ఎలా సాధ్యమ­న్నది రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి. పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి, జీవనాడికి ఉరేసి ఊపిరి తీయ­డం వల్లే పీబీఎల్‌పీకి శాపంగా మారిందని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నా­రు. ఇదే అంశా­న్ని ప్రస్తావిస్తూ జనవరి 24న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. పీ­బీఎల్‌పీకే కాదు... పోల­వరంలో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజ­ల స్రవంతి ప్రాజెక్టుకు నీళ్లందించడమూ సాధ్యం కాదని నిపు­ణు­లు చెబుతున్నా­రు. సీఎం చంద్రబా­బు పీబీఎల్‌పీని రాయలసీమకు గోదావరి జలాలు అందించాలన్న చి­త్తశుద్ధితో కాదు.. కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని పీపీఏ లేఖతో బట్టబయలైంది.

Telangana Govt Letter to Ministry Of Jalshakti On Banakacharla2
బనకచర్ల వద్దు.. తెలంగాణ సర్కారు లేఖ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండాలో గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రాసిన ఈ లేఖలో బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలన్నింటినీ సీఎస్‌ ప్రస్తావించారు. బనకచర్లే సింగిల్‌ ఎజెండాగా ఏపీ ప్రతిపాదన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ సింగిల్‌ (ఏకైక) ఎజెండాగా బనకచర్లపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. తెలంగాణ చేసిన పలు ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చాలని కోరింది. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ పెండింగ్‌ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు అంశాన్ని ఎజెండాలో చేర్చి చర్చించాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ పథకం కింద సాయం, గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిధుల కేటాయింపు వంటి అంశాలను చేర్చాలని విజ్ఞప్తి చేసింంది. తాజాగా ఇప్పుడు కూడా ఈ అంశాలపైనే చర్చించాలని సీఎస్‌ స్పష్టం చేశారు. ఆ సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుంది.. బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర పర్యావరణ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ తీవ్ర అభ్యంతరాలు తెలపడాన్ని సీఎస్‌ గుర్తు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, చట్టాలను, ట్రిబ్యునల్‌ తీర్పులన్నింటినీ ఉల్లంఘిస్తూ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనేలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. సీడబ్ల్యూసీ కూడా ఈ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. డీపీఆర్‌ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు ఇవే.. ⇒ పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా, అంగీకారం తీసుకోకుండా, గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రాలకు ట్రిబ్యునల్‌ జరిపిన నీటి కేటాయింపుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాజెక్టుల నిర్వహణలో సైతం మార్పులు చోటుచేసుకుంటాయి. ఏకపక్షంగా 200 టీఎంసీలను తరలించాలని చేసిన ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్‌ షెడ్యూల్‌లో మార్పులు జరగడంతో పాటు తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలుగుతుంది. ⇒ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అనుమతుల జారీకి సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి క్లియరెన్స్‌లు అవసరం కాగా, బనకచర్ల ప్రాజెక్టుకు ఇవేమీ లేవు. ⇒ ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టులో కీలకమైన సమాచార లోపాలున్నాయి. నీటి లభ్యత, సాంకేతిక సమాచారం లోపించింది. ⇒ పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడే ముంపుపై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రాజెక్టును ఎలా చేపడతారు? ⇒ ఈ ప్రాజెక్టు తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాలను హరిస్తుంది. ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాలపై దుష్ప్రభావం చూపుతుంది. అన్ని ప్రక్రియలూ పూర్తైన తర్వాతే చర్చించాలి ⇒ చట్టబద్ధంగా రావాల్సిన అన్ని అనుమతులు, అంతర్రాష్ట్ర సంప్రదింపులు, అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రక్రియలు పూర్తైన తర్వాతే ఈ ప్రాజెక్టుపై అయినా, ఏ సమావేశంలోనైనా చర్చ జరగాలి. ఆ తర్వాతే ప్రాజెక్టును ఆమోదించాలి. ⇒ బనకచర్ల ద్వారా తరలించనున్న 200 టీఎంసీల గురించి పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌లో ప్రస్తావన లేదు. నీటి లభ్యత, అంతర్రాష్ట్ర ప్రభావాలపై సమగ్ర అధ్యయనంతో పాటు ట్రిబ్యునల్‌ తీర్పులను నికచ్చిగా అమలు చేస్తేనే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది. ⇒ బనకచర్ల ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్‌ షెడ్యూల్, గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు, 1980 ఏప్రిల్‌ 2న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు తీరులో మార్పులు చోటుచేసుకుంటాయని గోదావరి బోర్డు అభ్యంతరం తెలిపింది. ఎలాంటి మార్పులకైనా పరీవాహకంలోని అన్ని రాష్ట్రాల నుంచి తప్పనిసరిగా రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరి జలాల బట్వాడా విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని కూడా తెలిపింది. 80 టీఎంసీలకు మించి జలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాలని కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ⇒ గోదావరి ట్రిబ్యునల్‌ పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాల కోటాలను పూర్తిగా వాడుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టులను నిర్మించిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించిన 200 టీఎంసీల లభ్యతపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. ⇒ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పుకు విరుద్ధమని పేర్కొంటూ బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిన విషయాన్ని సైతం లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాతే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని కోరిందని తెలిపింది. చర్చకు పెడితే బాయ్‌కాట్‌! కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి వారు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ సమావేశానికి హాజరైనప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లపై చర్చకు ఒప్పుకునేది లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బనకచర్లను ఎజెండాలో పెట్టి చర్చ ప్రారంభిస్తే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్‌కాట్‌ చేస్తారని తెలుస్తోంది. కాగా, వీలును బట్టి సీఎం బుధవారం రాత్రికి, లేదా గురువారం నగరానికి వస్తారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Sakshi Editorial On China3
ఇకనైనా చైనా మారేనా?

గల్వాన్‌ లోయలో భారత, చైనాల మధ్య ఘర్షణలు జరిగిన అయిదేళ్లకు మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఇతర దేశాల విదేశాంగమంత్రులతోపాటు కలవటమేకాక, చైనా ఉపాధ్యక్షుడు హాన్‌ జెంగ్‌తో ముందు రోజు భేటీ అయ్యారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో కూడా విడిగా భేటీ అయ్యారు. ఇరుగుపొరుగన్నాక సమస్యలు రావటం సహజం. అందునా చైనా వంటి దేశం పొరుగున వుంటే ఇవి మరింత క్లిష్టం కావటం, అవి ఘర్షణలుగా రూపాంతరం చెందటంలో ఆశ్చర్యం లేదు. సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకూ వుందన్న అంశంలో మాత్రమే కాదు... పాకిస్తాన్‌తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకోవటం చైనాకు అలవాటైంది. ఉగ్రవాద దాడులకు కారణమైన సంస్థల్ని, ఉగ్రవాదుల్ని నిషేధ జాబితాలో చేర్చాలని భద్రతా మండలిలో కోరినప్పుడల్లా చైనా మోకాలడ్డుతోంది. ఇలాంటి సమస్యలెన్ని వున్నా సామర స్య వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవటమే విజ్ఞత. అందుకే అయిదేళ్ల జాప్యం తర్వాతైనా ఈ పరిణామం చోటుచేసుకోవటం హర్షించదగ్గది. నిరుడు అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కలుసుకున్నారు. ఉభయ దేశాల సంబంధాలనూ మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించు కున్నారు. అటు తర్వాత మధ్య మధ్యలో చైనా వ్యవహార శైలివల్ల ఇబ్బందులేర్పడినా ఇరు దేశాల మధ్య సంబంధాలూ ఎంతో కొంత మెరుగయ్యాయని చెప్పాలి. సరిహద్దుల్లోని డెమ్‌చోక్,డెస్పాంగ్‌ ప్రాంతాల్లో సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలూ నిరుడు అక్టోబర్‌లో నిర్ణయించ టంతో పరిస్థితుల్లో గణనీయంగా మార్పు వచ్చింది. కానీ మొన్న ఏప్రిల్‌లో హఠాత్తుగా విద్యుత్‌ వాహనాల తయారీలో, ఏఐ సహా అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒడంబడిక ప్రకారం ఇది సరైంది కాదని మన దేశం చెబుతూ వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి కూడా ఇలాంటి ఆంక్షలు ప్రతిబంధ కమవుతాయి. ఈ సంబంధాలు మెరుగుపడటం, అభివృద్ధి చెందటం అంత సులభంగా సాధ్య పడలేదని, జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సుస్థిరపరుచుకోవాల్సిన అవసరం వున్నదని చైనా ఉపాధ్యక్షుడు హాన్‌ జెంగ్‌ అన్నట్టు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంలో చైనా నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే, కీలక ఖనిజాల ఎగుమతులపై వున్న నిషేధాన్ని తొలగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో రెండూ అతి పెద్ద మార్కెట్లు. కానీ వృథా వివాదాల కారణంగా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయత రెండు దేశాలనూ ఆవరిస్తోంది. ఈ ఏడాది చివరిలో ఎస్‌సీఓ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చైనాలో జరగబోతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నారు. కనుక ఈలోగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచు కోవటానికి కృషి చేయాల్సి వుంది. కశ్మీర్‌లోని పెహల్గాంలో పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడిచేయటం, అనంతరం ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో మన దేశం గట్టిగా జవాబీయటం వంటి పరిణామాల్లో చైనా, పాకిస్తాన్‌ వైపే నిలబడింది. ఇక దలైలామా వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారమంటూ చైనా వాదిస్తోంది. గత నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో కలిసి చైనా త్రైపాక్షిక సమావేశం నిర్వహించటాన్ని కూడా సాధారణ విషయంగా పరిగణించటానికి వీల్లేదు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతేమీ లేదని బంగ్లాదేశ్‌ చెప్పినా, పాకిస్తాన్‌ మాత్రం భవిష్యత్తు త్రైపాక్షిక సమావేశాలకు ఇది ఆరంభమని ప్రకటించింది. ఇదిగాక అమెరికాలో ట్రంప్‌ ఆగమనం తర్వాత ఆ దేశం బంగ్లాదేశ్‌ వ్యవహారాల్లో ఏ పాత్ర పోషిస్తుందనేది ఇంకా అస్పష్టంగా వుంది. చైనాకు వ్యతిరేకంగా ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో మనతో కలిసి కూటమి కట్టిన అమెరికా, దానిపై కూడా తన వైఖరేమిటని చెప్పటం లేదు. తన మనసులోని మాట చెప్పకుండా ఈ మధ్య జపాన్, ఆస్ట్రేలియాలతో జరిపిన సమావేశంలో తైవాన్‌ విషయంలో చైనా దూకుడు నిర్ణయం తీసుకుంటే మీ చర్యలెలావుంటాయంటూ ట్రంప్‌ ఆరా తీశారు. అమెరికా ఏం చేస్తుందో, ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియకుండా హామీ ఇవ్వటానికి రెండు దేశాలూ నిరాకరించాయి. ఆస్ట్రేలియా అయితే నేరుగానే అది తన సమస్య కాదన్నట్టు మాట్లాడింది. కనుక స్వీయ ప్రయోజనాల రీత్యా చైనా విషయంలో మనం కూడా ఆచితూచి అడుగేయక తప్పదు.అయితే మన భద్రత విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. ఎస్‌సీఓలో మంగళవారం మాట్లాడిన జైశంకర్‌ నిర్మొహమాటంగానే మన వైఖరేమిటో చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులతో పోరాడాల్సి వుంటుందని ఆయన ప్రకటించారు. పెహల్గాం దాడి జమ్మూ కశ్మీర్‌ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రని చెప్పటంతోపాటు ఎస్‌సీఓ తన ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్‌సీఓకు నేతృత్వం వహిస్తూ దాని లక్ష్యాలకు భిన్నంగా పాకిస్తాన్‌కు మద్దతీయటం సరికాదని చైనా గుర్తించక తప్పదు. స్నేహ సంబంధాలుంటే వాటిని పెంపొందించుకోవటానికి ఇతరేతర మార్గాలున్నాయి. అంతేతప్ప పాక్‌ తప్పులన్నిటినీ భుజాన మోసుకెళ్లటం తన ఎదుగుదలకు కూడా చేటు తెస్తుందని చైనా గుర్తించాలి.

Rasi Phalalu: Daily Horoscope On 16-07-2025 In Telugu4
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.షష్ఠి రా.8.25 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.6.12 వరకు, తదుపరి ఉత్తరాభద్ర తె.5.01 వరకు (తెల్లవారితే గురువారం), వర్జ్యం: ప.3.20 నుండి 4.51 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు, అమృతఘడియలు: రా.12.25 నుండి 1.56 వరకు, కర్కాటక సంక్రమణం; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.34. మేషం..... నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాల ప్రారంభం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం..వృషభం... కొత్త పరిచయాలు. శుభవార్తా శ్రవణం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. పనుల్లో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఊహించని పరిణామాలు.మిధునం.... బంధువులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు..కర్కాటకం... పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆస్తి వివాదాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.సింహం... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం..కన్య.... ప్రముఖులతో చర్చలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ముఖ్య నిర్ణయాలు. పనులలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. దైవదర్శనాలు.తుల..... కుటుంబసభ్యులతో వివాదాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలించవు. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు.వృశ్చికం... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్ధికంగా ఇబ్బందులు. బంధువులతో వివాదాలు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.ధనుస్సు... ఆసక్తికరమైన సమాచారం. భూసంబంధిత వివాదాలు పరిష్కారం. చాకచక్యంగా పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులకు కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు.మకరం... ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధు,మిత్రులతో విరోధాలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు.కుంభం.... ప్రముఖుల నుంచి కీలక సందేశం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో కొంతమేర లాభాలు. ఉద్యోగాల్లో మరింత ఉత్సాహం.మీనం.... ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అనారోగ్యం. సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు.

Kota Vinutha couple reveals sensational facts with Chennai Police5
పవన్‌ కళ్యాణ్‌కు అంతా తెలుసు

సాక్షి, అమరావతి: ‘మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్‌ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే డ్రైవర్‌ శ్రీనివాస్‌ హత్య వరకు వ్యవహారం దారి తీసేది కాదు’ అని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్‌ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు దంపతులు విస్పష్టంగా వెల్లడించారు. డ్రైవర్‌ శ్రీనివాస్‌ హత్య కేసులో వారిద్దరినీ చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు అక్కడి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న విషయం పవన్‌ కల్యాణ్‌కు ముందే తెలుసని వారు కుండబద్ధలు కొట్టడం గమనార్హం. తమ పార్టీ మహిళా నేతను వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని తెలిసినా ఆయన పట్టించుకోలేదని వారు వాపోయారు. చెన్నై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు తమ వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి.గొడవ చేయొద్దు.. సర్దుబాటు చేస్తానన్నారు‘టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మా బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్‌ శ్రీనివాస్‌ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్‌ శ్రీనివాస్‌ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్‌కు విక్రయించారు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేయించారు. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్‌ను పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుండటంతో వెంటనే మా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్దొద్దు.. టీడీపీ వారితో గొడవ పడొద్దని ఆయన మాతో చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్‌తో మాట్లాడతాను. విషయాన్ని సర్దుబాటు చేస్తాను. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. ప్రభుత్వానికి, రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్‌తో ఏం మాట్లాడారో మాకు తెలీదు. కానీ ఎమ్మెల్యే సుధీర్‌ తన వర్గీయులతో మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్‌ కల్యాణ్‌ మా ఆవేదనను పట్టించుకోలేదని స్పష్టమైంది.పూర్తి వివరాలు తెలుసుకునేందుకే శ్రీనివాస్‌ను పిలిపించాం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి వర్గీయులు బ్లాక్‌ మెయిలింగ్‌ కొనసాగిస్తునే ఉన్నారు. దాంతో శ్రీనివాస్‌ను పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో రూ.20 లక్షలు ఖర్చు చేసేశానని, తన వద్ద ఇక రూ.10 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణలోనే శ్రీనివాస్‌ హతమయ్యాడు.పవన్‌ స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదువ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్‌ కల్యాణ్‌ బాధ్యతాయుతంగా స్పందిస్తారని ఆశించాం. పార్టీలో ఓ మహిళా నేత ఆవేదనను అర్థం చేసుకుంటారని, న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సమస్యనే పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్‌ కల్యాణ్‌ వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌ను కట్టడి చేసి ఉండే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది. దాంతో పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో. అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌ బ్లాక్‌మెయిలింగ్‌.. మరోవైపు మా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పట్టించుకోకపోవడం.. దీంతో ఏం చేయాలో మాకు తోచలేదు. దాంతో డ్రైవర్‌ శ్రీనివాస్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాటా మాటా పెరిగి పరిస్థితి చేయిదాటిపోయింది. అతను హతమయ్యాడు. బ్లాక్‌ మెయిలింగ్‌ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కుకున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జికే ఇంతటి దుస్థితి ఏర్పడితే.. ఇక జనసేన పార్టీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతోంది’ అని వారు పేర్కొన్నారు.

Sakshi Guest Column On BRICS countries and Donald Trump6
బ్రిక్స్‌... ట్రంప్‌... కాగితం పులి కథ!

బ్రెజిల్‌లోని రియో డి జనేరో నగరంలో ఈ నెల 6–7 తేదీలలో జరిగిన ‘బ్రిక్స్‌’ 17వ శిఖరాగ్ర సమావేశాలను ఒకవైపు, దానిపై మొదటినుంచే కత్తులు దూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మరొకవైపు గమనించగా కాగితం పులి కథ గుర్తుకు వస్తుంది. బ్రిక్స్‌... తన సభ్య దేశాల అభివృద్ధికి, పరస్పర సహకారానికి ఏర్పడినటువంటిది. 2009లో స్థాపించినప్పటి నుంచి గత 16 సంవత్సరాలలో అందుకు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చింది తప్ప, అమెరికాకు గానీ, మరొకరికిగానీ వ్యతిరేకంగా ఎప్పుడు ఏ చర్యలూ తీసుకోలేదు. అయినప్పటికీ, అమెరికా అధ్యక్షులందరికి భిన్నమైన రీతిలో ట్రంప్‌ మాత్రం బ్రిక్స్‌ను తమకు వ్యతిరేకమైన కూటమి అంటున్నారు. అధికారానికి వచ్చిన కొత్తలో బ్రిక్స్‌ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇపుడు బ్రెజిల్‌ సమావేశాలకు ముందు రోజున 10 శాతం అన్నారు. బ్రిక్స్‌లో చేర రాదంటూ ప్రపంచ దేశాలను కొన్ని నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. కానీ, ఈసారి సమావేశాలు ముగిసే నాటికి, ట్రంప్‌ను అమెరికా సన్నిహిత దేశాలు సహా ఎవరూ ఖాతరు చేయనట్లు స్పష్టమైంది. జనాభా... జీడీపీ... 40 శాతం వాటా!2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలలో బ్రిక్‌గా మొదలైన సంస్థ, దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారటం తెలిసిందే. ట్రంప్‌ హెచ్చరికలు చేసిన మరునాడే ఇండోనేషియా పూర్తి సభ్య దేశంగా చేరింది. ఇపుడు బ్రెజిల్‌లో బేలారూస్, బొలీవియా, కజకిస్థాన్, క్యూబా, నైజీరియా, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం,ఉగాండా, ఉబ్జెకిస్తాన్‌ భాగస్వామ్య దేశాలుగా కొత్తగా చేరాయి. బ్రెజిల్‌ సమావేశాల కన్న ముందు మాసాలలో ఈజిప్టు, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ పార్ట్‌నర్‌ దేశాలయ్యాయి. ఈ జాబితాను విశ్లేషించినట్లయితే నాలుగు విషయాలు దృష్టికి వస్తాయి. ఒకటి, సంఖ్య రీత్యా ఇపుడవి మొత్తం 21 దేశాలు. రెండు, అమెరికా, యూరప్‌తో కూడిన పాశ్చాత్య ప్రపంచానికి బయటగల ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండాలన్నింటికి అందులో ప్రాతినిధ్యం ఉంది. మూడు, వాటిలో అనేకం ఆర్థికంగా శక్తిమంతమై నవి. నాలుగు, బహుశా అంతకన్న విశేషంగా పలు దేశాలకు అమెరి కాకు అనుకూలమైనవనే పేరున్నది. అటువంటి పేరే గల ఆసియన్‌ కూటమి దేశాలు కూడా బ్రిక్స్‌కు తోడుకావటం మరొక విశేషం.తాజా విస్తరణ తర్వాత బ్రిక్స్‌ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 41 శాతానికి చేరింది. వీటి జీడీపీ ప్రపంచ జీడీపీలో 40 శాతం అయింది. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన జి–7కు మించిపోయిన లెక్కలు. బ్రిక్స్‌ నెలకొల్పిన న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డిబి) రుణ సహాయాలతో 40 బిలియన్‌ డాలర్ల విలువ గల 120 అభివృద్ధి పథకాలను వర్ధమాన దేశాలలో అమలుపరుస్తున్నారు. అమెరికా చెప్పు చేతలలో గల ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ తరహా షరతులుగానీ, ఆయా దేశాల ఆర్థిక విధా నాలలో జోక్యం గానీ బ్రిక్స్‌ బ్యాంక్‌ నుంచి ఉండవు.అమెరికాకు ఎందుకు కలవరం?అమెరికా తన డాలర్‌ను ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రపంచ దేశాల కరెన్సీ విలువలను, మార్కెట్లను, బ్యాంక్‌ చెల్లింపులను, రిజర్వ్‌లను నియంత్రిస్తున్నందున, తమకు సరిపడని దేశాల డాలర్‌ అకౌంట్లను స్తంభింపజేస్తున్నందున, డాలర్‌ మారకం నుంచి విముక్తి అవసరమని బ్రిక్స్‌ దేశాలు కొంతకాలం క్రితమే నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా నిరుడు అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌ నగరంలో జరిగిన 16వ సమావేశాలలో ఇందుకు మరింత కదలిక వచ్చింది. ఆ ప్రకారం బ్రిక్స్‌ దేశాలు డాలర్‌తో సంబంధాలను ఒకే సారి పూర్తిగా తెంచుకోవటంగాక, తమ మధ్య వాణిజ్యానికి పరస్పర చెల్లింపులు డాలర్‌లో గాక వీలైనంత మేర తమ సొంత కరెన్సీలలో జరుపుకోవాలనీ, ఆ స్థాయిని క్రమంగా పెంచుకోవాలనీ నిర్ణయించుకున్నాయి. ఈ పని బ్రిక్స్‌ దేశాల మధ్యనే గాక, ఇతర దేశాలతోనూ జరిగేందుకు ప్రయత్నించాలని భావించాయి. అనగా డాలర్‌ పాత్రను, ఆధిపత్యాన్ని తగ్గించటమన్నమాట!నిజానికి స్థానిక కరెన్సీలలో చెల్లింపుల పద్ధతి స్వల్ప స్థాయిలో గతంలోనూ ఉండేది. కానీ బ్రిక్స్‌ నిర్ణయాలతో అది గణనీయంగా పెరిగి ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో 30 శాతానికి మించినట్లు అంచనా. బ్రెజిల్‌ విస్తరణతో ఈ ధోరణి పెరిగినట్లయితే, త్వరలో 50 శాతానికి చేరే అవకాశం ఉంది. బ్రిక్స్‌ అంటే అమెరికా అధ్యక్షుడు ఎందుకింత కలవరపడుతున్నారో, దీన్ని బట్టి తేలికగా అర్థం చేసు కోవచ్చు. ప్రపంచంపై అమెరికా సామ్రాజ్యవాదపు ఆధిపత్యం వెంటనే అంతం కాక పోయినా క్రమంగా బలహీనపడుతుంది. మారిన పరిస్థితులలో ఒకప్పటివలె బ్రిక్స్‌ వంటి దేశాలపై ప్రత్యక్ష యుద్ధాలు చేయలేరు గనుక, టారిఫ్‌ల హెచ్చింపు, ఇతర వాణిజ్య ఆంక్షల రూపంలో ఆర్థిక యుద్ధాలు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి, అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ఇతరుల నుంచి వస్తున్న పోటీలను తట్టుకునేందుకు ఆయన స్వపర భేదాలు లేకుండా అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్‌ల యుద్ధం ఆరంభించారు. అయితే, బ్రిక్స్‌తో వైరం భిన్నమైనది. ఆ సంస్థ వర్ధమాన దేశాల కోసం భిన్న మైన, దీర్ఘకాలిక, ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించే అజెండాతో పని చేస్తున్నది. ఆర్థికంగానే కాదు. అభివృద్ధి నమూనా దృష్ట్యా కూడా. వాణిజ్యంలో ‘స్వేచ్ఛ’ కోసం...మరొక కీలకమైన అంశం స్వేచ్ఛా వాణిజ్యం. ఈ భావనను ముందుకు తెచ్చి డబ్ల్యూటీవోను నెలకొల్పిన అమెరికా కూటమి, దానిని తమ ప్రయోజనాలకు అనుకూలమైనంత కాలం ఉపయోగించుకుని, ఇటీవల ఇతర దేశాలు కూడా లాభపడుతుండటంతో ఆ నియమాలను భంగపరచజూస్తున్నది. స్వేచ్ఛా వాణిజ్యం యథా తథంగా కొనసాగటమే గాక, ఆ సంస్థలో వర్ధమాన దేశాల గొంతుకలు వినవస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలన్నది బ్రిక్స్‌ వాదనలలోని ముఖ్యాంశాలలో ఒకటి. ఆ పని జరిగితే వర్ధమాన దేశాల వనరులకు, ఉత్పత్తులకు తగిన ధరలు లభిస్తాయి. ధనిక రాజ్యాలు ఇతరులను ఒత్తిడి చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేయటం, తమ ఉత్పత్తులను మాత్రం అధిక ధరలకు విక్రయించటం వంటి పరిస్థితి పోతుంది. మరొక స్థాయిలో బ్రిక్స్‌ దేశాలు అమెరికా ఏకధ్రువ ప్రపంచం ఆమోదయోగ్యం కాదనీ, బహుళ ధ్రువ ప్రపంచం తమ లక్ష్యమనీ స్పష్టంగానే చెప్తున్నాయి. బ్రిక్స్‌ గురించి యూరోపియన్‌ దేశాలు ఇంతవరకైతే వ్యతిరేకంగా మాట్లాడలేదుగానీ, అమెరికా వైపు చూస్తు న్నాయి. కజాన్, రియో డి జనేరో సమావేశాల దరిమిలా ట్రంప్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల తక్షణ ప్రభావాల గురించి కూడా కొంత చెప్పు కోవాలి. ఇండియాను టారిఫ్‌లతో లొంగదీసి ఒప్పందాలు చేసుకో జూడగా, దానిపై ఒకవైపు చర్చలు సాగిస్తూనే, తాము కూడా 25 శాతం ఎదురు సుంకాలు విధించగలమని భారత ప్రభుత్వం డబ్ల్యూటీవోలో స్పష్టం చేసింది. తామూ అదే పని చేయగలమని బ్రెజిల్, వియత్నాం, ‘ఆసియాన్‌’, దక్షిణాఫ్రికా మొదలైనవి హెచ్చరించాయి. చైనా, రష్యా సరేసరి. టారిఫ్‌లు ప్రకటించినపుడు ట్రంప్‌ మాట్లాడుతూ 90 రోజులలో 90 ఒప్పందాలు చేసుకోగలమని,అందరూ క్యూలు కడుతున్నారని ఆట్టహాసంగా అన్నారు. 90 రోజులు గడిచేసరికి జరిగినవి ఇంగ్లండ్, వియత్నాంలలో మాత్రమే. కెనడా, యూరప్‌ సైతం ధిక్కార స్వరంలోనే ఉన్నాయి. ఈ పరిణా మాల మధ్య బ్రిక్స్‌ను ఢీకొంటున్న ట్రంప్, కాగితం పులిగా మిగలటం తప్ప గత్యంతరం కనిపించదు.టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Donald Trump asks Volodymyr Zelenskyy if Ukraine could hit Moscow7
మాస్కోను కొట్టగలవా?

వాషింగ్టన్‌: దీటైన అస్త్రశస్త్రాలు అందిస్తే మాస్కోను కొట్టగలవా? రష్యాపై భీకరంగా దాడిచేయగలవా? అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూటి ప్రశ్న వేశారు. జూలై నాలుగో తేదీన జెలెన్‌స్కీకి ఫోన్‌చేసిన మాట్లాడిన సందర్భంగా ట్రంప్, వొలదిమిర్‌ జెలెన్‌స్కీల మధ్య జరిగిన సంభాషణ తాలూకు విశేషాలను తాజాగా అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తూ తీవ్ర నష్టం చేకూరుస్తున్న రష్యాకు సైతం అదే స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం కల్గించాలని జెలెన్‌స్కీకి ట్రంప్‌ సూచించినట్లు తెలుస్తోంది.ఇరునేతల సంభాషణ వివరాలను కొన్ని అత్యున్నత వర్గాలు వెల్లడించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘‘ చూడు వొలదిమిర్‌.. నువ్వు రష్యా రాజధాని మాస్కో నగరంపై క్షిపణులతో దాడి చేయగలవా?’’ అని ట్రంప్‌ ప్రశ్నించగా.. ‘‘ తప్పకుండా. మీరు సరైన మిస్సైళ్లు ఇస్తే దాడి చేసి చూపిస్తా’’ అని జెలెన్‌స్కీ హామీ ఇచ్చారు. ‘‘ మీకు కావాల్సిన సుదీర్ఘ శ్రేణి క్షిపణులను అందిస్తాం. రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ను ధ్వంసంచేయగలరా?’’ అని ట్రంప్‌ ప్రశ్నించగా.. ‘‘ ఆ స్థాయిలో దాడికి సరిపడా ఆయుధాలు సమకూరిస్తే తప్పకుండా దాడిచేస్తాం’’ అని జెలెన్‌స్కీ మాటిచ్చారు. ‘‘ దాడుల్లో రక్తమోడుతూ ఉక్రెయిన్‌వాసులు పడుతున్న బాధను రష్యన్లు అనుభవించాలి. మీ దాడులతో వాళ్లకూ నొప్పి తెలిసిరావాలి’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.ఉక్రెయిన్‌తో సయోధ్య కుదుర్చుకోవాలని, లేదంటే 50 రోజుల్లోపు సుంకాల సుత్తితో మోదుతానని రష్యాను ట్రంప్‌ హెచ్చరించిన మరుసటి రోజే ఈ సంభాషణల అంశం తెరమీదకు రావడం గమనార్హం. శాంతి ఒప్పందం చేసుకోండని ఎంతమొత్తుకున్నా రష్యా వినిపించుకోవట్లేదని, సహనం నశించి ట్రంప్‌ ఇలా జెలెన్‌స్కీని దాడులు చేయగలవా? అని ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే సంభాషణల వార్తపై అటూ శ్వేతసౌధంగానీ, ఇటు ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయంగానీ స్పందించలేదు.నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టేతో కలిసి శ్వేతసౌధంలో ట్రంప్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ పుతిన్‌ అంత సులభంగా లొంగే మనిషి కాడు. మన నేతలనే మభ్యపెట్టాడు. క్లింటన్‌ మొదలు జార్జ్‌ బుష్, ఒబామా, బైడెన్‌దాకా అమెరికా అధ్యక్షులను తన మాటలతో మభ్యపెట్టాడు. నేను వాళ్లలాగా ఫూల్‌ను కాబోను. బిలియన్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తా. నాటో సభ్యదేశాలు ఆర్డర్‌ ఇచ్చిన 17 గగనతల రక్షణ వ్యవస్థ మిస్సైల్‌ లాంఛర్లన్నీ ఉక్రెయిన్‌కు పంపిస్తాం’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Chandrababu government plunged the state into debt within a year8
కూటమి సర్కారు అప్పులు.. రూ.1,86,112 కోట్లు

సాక్షి, అమరావతి: సంపద సృష్టించకపోగా ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించా­రు. బడ్జెట్‌ బయట, బడ్జెట్‌ లోపల ఎడా పెడా అప్పు­­ల మీద అప్పులు చేస్తున్నారు. గతంలో ఏ ప్రభు­త్వాలు కూడా ఏడాదిలోనే ఇంత భారీగా అప్పు­లు చేయలేదు. ఈ విషయంలో కూటమి ప్ర­భుత్వం రికార్డు సృష్టించింది. తాజాగా మంగళవా­రం రూ.3,600 కోట్లు అప్పు చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట చేసిన.. చేయాలని నిర్ణయించిన అప్పులు ఏకంగా రూ.1,86,112 కోట్లకు చేరాయి. ఏడాదిలోనే ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజ­లపై అప్పుల భారం మోపారు తప్ప సూపర్‌ సిక్స్‌ హామీల అమలు ద్వారా ప్రజలికిచ్చేందేమీ లేదు. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయ­­డం ద్వారా ఆర్‌బీఐ రాష్ట్రప్రభుత్వానికి 6.88 శాతం వడ్డీకి రూ.3,600 కోట్ల రుణం సమీకరించింది. ఈ అప్పుతో బడ్జెట్‌ అప్పులే ఏకంగా రూ.1,23,702 కోట్లకు చేరాయి. బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.31,410 కోట్లు అప్పు చేస్తోంది. ఇందులో ఇప్పటికే చాలా వరకు అప్పులు చేయగా, ఇటీవల కేబినెట్‌ సమా­వేశంలో 2013 కంపెనీల చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌ జల్‌ జీవన్‌ వాటర్‌ సప్లై కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, దాని ద్వారా మరో రూ.10,000 కోట్లు అప్పు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ ఏవియేషన్‌ డెవల­ప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా ఇంకో రూ.1,000 కోట్లు అప్పు చేయడానికి ఇటీవల కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని, జీవో కూడా జారీ చేశారు. సంపద సృష్టి దేవుడికే ఎరుక!రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభు­త్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్థ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేస్తోంది. రాజ­ధాని అప్పులకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసినా, సూపర్‌ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ఏడాది పాలన పూర్తి చేశారు. సంపద సృష్టించడం దేవుడెరుగు.. ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు. ఏడాది పాలనలో ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం చేసిందంటే భారీగా అప్పులు చేయడం తప్ప ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ఏపీఎండీకి చెందిన 436 మైనర్‌ లీజుల విలువ రూ.1,91,000 కోట్లుగా చూపించి, తద్వారా ప్రైవేట్‌ బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9,000 కోట్లు అప్పు చేసింది. ఇందు కోసం బాబు సర్కారు ప్రైవేట్‌ వ్యక్తులకు ఖజానాను తాకట్టు కూడా పెట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ఎక్కువ అప్పులు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట చంద్రబాబు భారీగా అప్పులు చేస్తున్నా, ఎల్లో మీడియా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం లేదు. మంగళవారం మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతోంది.

The World Games will be held from July 14th to 30th in 20289
రెండు రోజులముందుగానే...'క్రికెట్‌... రైట్‌ రైట్‌'...

లాస్‌ ఏంజెలిస్‌: మరో మూడేళ్ల తర్వాత జరగనున్న లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ విడుదలైంది. 2028 జూలై 14 నుంచి 30 వరకు ఈ విశ్వక్రీడల సంరంభం కొనసాగనుంది. అయితే సంప్రదాయానికి భిన్నంగా ఈ ఏడాది పలు క్రీడాంశాల షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకకు ముందే ఆరంభమయ్యే క్రీడాంశాల సంఖ్య పెరగగా... విశ్వక్రీడల చివర్లో నిర్వహించే అథ్లెటిక్స్‌ను ఈ సారి ముందే జరపనున్నారు. మొత్తం 351 మెడల్‌ ఈవెంట్స్‌ జరగనున్న ఈ విశ్వక్రీడల షెడ్యూల్‌లోని కొన్ని విశేషాలు... » 2028 జూలై 14న లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుక జరగనుండగా... అంతకు రెండు రోజుల ముందే పలు క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. 1932, 1984 ఒలింపిక్స్‌ క్రీడలకు వేదికగా నిలిచిన లాస్‌ ఏంజెలిస్‌లోని విఖ్యాత ఎల్‌ఏ మెమోరియల్‌ కొలోజియంతోపాటు ఇంగ్లెవుడ్‌లోని స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ముగింపు వేడుకలకు ఎల్‌ఏ మెమోరియల్‌ కొలోజియం వేదికగా నిలుస్తుంది. » బాస్కెట్‌బాల్, క్రికెట్, హాకీ, హ్యాండ్‌బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్‌బాల్, వాటర్‌ పోలో వంటి ఈవెంట్‌లలో పోటీలు ముందే మొదలవనున్నాయి. » 1920 ఒలింపిక్స్‌ తర్వాత... విశ్వక్రీడల ప్రారంభ వేడుకకు ముందు ఇన్ని క్రీడాంశాల్లో పోటీలు మొదలు కావడం ఇదే తొలిసారి. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆర్చరీ, హ్యాండ్‌బాల్, రగ్బీ సెవెన్స్, ఫుట్‌బాల్‌ పోటీలు మాత్రమే ముందు ప్రారంభించారు. » ప్రధాన క్రీడా వేదిక లాస్‌ ఏంజెలిస్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని పొమెనాలో క్రికెట్‌ పోటీలు జరగనుండగా... జూలై 12న ప్రారంభం కానున్న ఈ పోటీలు 29న ముగియనున్నాయి. జూలై 20, 29న మెడల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. » టి20 ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీలో... పురుషుల, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొననున్నాయి. 1900 ఒలింపిక్స్‌లో చివరిసారి క్రికెట్‌ పోటీలు నిర్వహించగా... సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ప్రవేశ పెట్టారు. » అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్, లాక్రాస్, స్క్వాష్‌ వంటి పలు క్రీడాంశాలను లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో చేర్చేందుకు అనుమతి ఇచ్చింది. » ఆరంభ వేడుక తదుపరి రోజు అంటే జూలై 15న ట్రయాథ్లాన్‌లో తొలి మెడల్‌ ఈవెంట్‌ జరగనుంది. » ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌ పోటీలు ముగిసిన తర్వాత అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించడం పరిపాటి కాగా... ఈసారి మొదట అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించి చివరి వారంలో స్విమ్మింగ్‌ ఈవెంట్‌లు జరపనున్నారు. » 2028 జూలై 30న ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు నిర్వహించనుండగా... చివరగా స్విమ్మింగ్‌ పోటీలు జరుగుతాయి.

Tesla Opens First India Showroom in Mumbai10
టెస్లా కారు వచ్చేసింది..

ముంబై: అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా తాజాగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచి్చంది. ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. అలాగే, మధ్య స్థాయి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మోడల్‌ ’వై’ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మంగళవారం ఈ షోరూంను ప్రారంభించారు. టెస్లా భారత్‌లోనే పరిశోధనలు, తయారీ కార్యకలాపాలు కూడా చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు, సర్వీస్, చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఏపీఏసీ (ఏషియా పసిఫిక్‌) రీజియన్‌ చీఫ్‌ ఇసాబెల్‌ ఫాన్‌ తెలిపారు. ముంబై, ఢిల్లీలో 4 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జర్మన్‌ కార్లతో పోటీ.. దేశీ మార్కెట్లో మెర్సిడెస్‌–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి జర్మన్‌ ఎలక్ట్రిక్‌ లగ్జరీ కార్లతో టెస్లా మోడల్‌ వై పోటీపడనుంది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా లాంటి భారతీయ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థల కార్ల ధర రూ. 30 లక్షల లోపే ఉంటోంది. దేశీయంగా ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్‌ ప్రస్తుతం కార్ల దిగుమతులపై 70–100 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. వీటిని తగ్గించాలని కోరుతున్న టెస్లా, దేశంలో ముందుగా తమ కార్లను అమ్ముకునేందుకు, సర్విస్‌ చేసేందుకు అనుమతిస్తే, అమ్మకాలను బట్టి తయారీ చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తామంటూ టెస్లా చెబుతోంది. కానీ, ఏ ఒక్క కంపెనీకో ప్రయోజనం చేకూర్చేలా విధానాలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్‌లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేస్తామనే హామీ ఇచ్చే కంపెనీలు 15 శాతం సుంకానికే ఏటా 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది.రెండు వేరియంట్లు..మోడల్‌ వై రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. ఒకసారి చార్జ్‌ చేస్తే 500 కి.మీ. రేంజిని (మైలేజీ) ఇచ్చే రియర్‌ వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌ బేస్‌ ధర రూ. 59.89 లక్షలుగా ఉంటుంది. 622 కి.మీ. రేంజినిచ్చే లాంగ్‌ రేంజ్‌ రియర్‌ వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌ ధర రూ. 67.89 లక్షలుగా ఉంటుంది. 2025 మూడో త్రైమాసికం లేదా నాలుగో త్రైమాసికం నుుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.దీన్ని కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ)గా చైనాలోని తమ ప్లాంటు నుంచి టెస్లా దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయిస్తుంది. ముందుగా ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్‌లో డెలివరీలు, రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. టెస్లా డిజైన్‌ స్టూడియో ద్వారా వాహనం లోపల, వెలుపల, అలాగే ఫీచర్లను కూడా కస్టమైజ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో టెస్లా వాహనాలకు లిబర్టీ జనరల్‌ ఇన్సూరెన్స్, ఎకో జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు బీమా కవరేజీని అందిస్తాయి.ధరలు ఇలా.. (కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం..) ⇒ మోడల్‌ వై రియర్‌ వీల్‌ డ్రైవ్‌ ధర రూ. 59.89 లక్షలు (ముంబై ఎక్స్‌–షోరూం), ఆన్‌రోడ్‌ ధర రూ. 61,07,190.⇒ మోడల్‌ వై లాంగ్‌ రేంజ్‌ రియర్‌ వీల్‌ డ్రైవ్‌ ధర రూ. 67.89 లక్షలు (ముంబై ఎక్స్‌–షోరూం), ఆన్‌రోడ్‌ ధర రూ. 69,15,190.⇒ బుకింగ్‌ అమౌంట్‌ రూ. 22,220గా (నాన్‌–రిఫండబుల్‌) ఉంటుంది. తుది ధ్రువీకరణ కోసం ఏడు రోజుల్లోగా మరో రూ. 3 లక్షలు చెల్లించాలి. ⇒ ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ (ఎఫ్‌ఎస్‌డీ) ఆప్షన్‌ కోసం అదనంగా రూ. 6 లక్షలు.⇒ అమెరికాలో నగదు రూపంలో చెల్లిస్తే లాంగ్‌ రేంజ్‌ రియర్‌ వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌ ధర 37,490 డాలర్లుగా (సుమారు రూ. 32.24 లక్షలు) ఉంది.ప్రత్యేకతలు.. ⇒ గంటకు 0 – 100 కి.మీ. వేగం 5.6 సెకన్లలో⇒ వెనుక కూర్చునే వారి కోసం ఎనిమిది అంగుళాల స్క్రీన్, 9 స్పీకర్లు⇒ టాప్‌ స్పీడ్‌ గంటకు 201 కి.మీ.⇒ ఫాస్ట్‌ చార్జర్లతో 15 నిమిషాల్లో 267 కి.మీ. చార్జింగ్‌⇒ వెలుపల ఎనిమిది కెమెరాలు⇒ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌⇒ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌⇒ రెండు వేరియంట్లు, ఆరు రంగుల్లో లభ్యం ⇒ వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, వైర్‌లెస్‌ చార్జర్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement