హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా అన్ని క్రికెట్ టోర్నీలు రద్దు లేక వాయిదా పడటంతో ఇంటికే పరిమితమయ్యాడు ఈ లెఫ్టాండ్ బ్యాట్స్‌మన్. ఈ క్రమంలో తన ఫ్యాన్స్‌ను అలరించాలనే ఉద్దేశంతో టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ‘అల.. వైకుంటపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.
అనంతరం ‘పోకిరి’ సినిమాలో మహేశ్ బాబు చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్‌కు టిక్‌టాక్ చేశాడు. సన్‌రైజర్స్ జెర్సీ ధరించి, చేతిలో బ్యాట్ పట్టుకొని ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే డైలాగ్‌తో టిక్‌టాక్ చేశాడు. తాజాగా వార్నర్ చేసిన మరో టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ సృష్టిస్తోంది. బాహుబలి చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ డైలాగ్‌ను టిక్‌టాక్ చేసి అందిరినీ సంభ్రమాశ్చర్యంలోకి ముంచెత్తాడు. ఇక టాలీవుడ్ అభిమానుల నుంచి వార్నర్‌కు పలు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాటలకు, డైలాగ్‌లకు టిక్‌టాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.