
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన రైల్వే శాఖ తన పరిధిలో ఉన్న అన్ని ఆస్పత్రుల్ని సిద్ధం చేసింది. ఏపీలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లలోని రైల్వే ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్, కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసింది. రైల్వే ఆస్పత్రుల్లో పనిచేసే పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్‌లు, నర్సింగ్ అసిస్టెంట్లకు కోవిడ్ –19 రోగులతో వ్యవహరించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. విజయవాడ డివిజన్‌లో 129, గుంతకల్ డివిజన్‌లో 234, గుంటూరు డివిజన్‌లో 125.. మొత్తం 488 క్వారంటైన్ పడకలను సిద్ధం చేశారు.
► విజయవాడ, గుంతకల్‌లోని రైల్వే ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ కమ్ కోవిడ్ వార్డులను ఏర్పాటు చేశారు.
► ఈ వార్డుల్లో ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బందికి తోడు అవసరమైన అదనపు సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునేందుకు రైల్వే బోర్డు అంగీకారం తెలపడంతో ఆ మేరకు నియామకాలు చేపట్టారు.
► ఇప్పటివరకు విజయవాడలో 11 మంది డాక్టర్లు, 36 మంది ఇతర వైద్య సిబ్బందిని నియమించారు. గుంతకల్‌లోని రైల్వే ఆస్పత్రిలో ఆరుగురు డాక్టర్లు, మరో 14 మంది వైద్య సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు.
► ఇంకా అవసరమైన సిబ్బంది నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 15 తర్వాత నియామకాలు చేపట్టనున్నారు.
► విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖలో రైల్వే బోగీలను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చారు. జోన్ మొత్తంలో 2,500 ఐసోలేటెడ్ కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయి.
► రైల్వే ఆస్పత్రుల్లో వసతుల కొరత ఏర్పడినా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ వార్డుల కొరత వచ్చినా.. రైల్వే ఐసోలేషన్ కోచ్‌లు అందుబాటులోకొస్తాయి.
► రైల్వే సిబ్బంది ఇప్పటికే ఆరు లక్షల మాస్క్‌లు, 40 వేల లీటర్ల శానిటైజర్లను తయారు చేశారు. రైల్వే ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి పీపీఈలు అందించేందుకు ప్రతి వారం వెయ్యికి పైగా తయారు చేయనున్నారు.