
విశాఖపట్నం: 104 ఉద్యోగులను రెగ్యులర్ చేసి, ఈ సేవలను ప్రభుత్వమే నిర్వహించాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు జననేత జగన్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. పెందుర్తి నియోజకవర్గంలో సోమవారం జరిగిన పాదయాత్రలో వీరు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. 2008లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 104 సేవలను ప్రారంభించారన్నారు. గత 10 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మీరు అధికారంలోకి రాగానే 104 ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఆదుకోవాలి.– నాగరాజు, కోటేశ్వరరావు, 104 యూనియన్ ప్రతినిధులు
జననేతకు పండితుల ఆశీర్వచనాలు
హైదరాబాద్ వద్ద నాగోలుకు చెందిన అర్చక బృందం పెందుర్తి వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు నల్లపెద్ది ప్రసాదశర్మ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ప్రతాప మాధవ శర్మ ఆధ్వర్యంలో 421 రోజులు పాటు మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నామన్నారు. జగన్ ముఖ్యమంత్రి ఆయిన తరువాత ఆయన సమక్షంలో పూర్ణాహుతితో యాగం ముగుస్తుందన్నారు. ప్రస్తుతం యాగం విజయవంతంగా నడుస్తుందన్నారు. యాగం పూర్తయితే కార్యజయం కలుగుతుందన్నారు. జగన్‌కు ఆశీర్వాదం అందించిన వారిలో ప్రసాదశర్మతో పాటు మధు శర్మ, మారుతి శర్మ, వెంకటేశ్వర శర్మ, శ్రీధర్ ఉన్నారు.