
కదిరి అర్బన్: కదిరిలో కారు రిపేరీకి వెళ్లి హత్యకు గురైన నారాయణస్వామి నాయక్ కేసు మిస్టరీ వీడింది. ఐదుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వెంకటరమణ సోమవారం కదిరి పట్టణ సీఐ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. నారాయణస్వామి నాయక్ కుమార్తెను ఈ ఏడాది మార్చి 30న జగదీష్, మహేష్, సురేష్, వీరమహేష్, తేజ్‌దీప్‌లు కిడ్నాప్ చేశారు. అనంతరం విశాపట్నం జిల్లా చింతపల్లి మండలం సంకడ గ్రామంలో ఉంచి అమ్మాయిపై జగదీష్ అత్యాచారం చేశాడు. దీంతో నారాయణస్వామి నాయక్ ఆ ఐదుగురిపైనా కదిరి పోలీస్టేషన్‌లో కేసు పెట్టాడు. అంతటితో ఆగకుండా మీ అంతు చూస్తానని బెదిరించాడు.
దీంతో అందరం ఒక్కడి చేతిలో (నారాయణస్వామినాయక్) చచ్చేకంటే ఆ ఒక్కడ్ని మనమే చంపేస్తే సమస్య ఉండదని ఐదుగురూ ఒక నిర్ణయానికి వచ్చి హత్యకు కుట్ర పన్నారు. ఈ నెల 15న కదిరి మునిసిపల్ పరిధిలోని సైదాపురం సమీపాన గల ఐటీఐ వద్ద కారు రిపేరీ చేయించుకునేందుకు వచ్చిన నారాయణస్వామినాయక్‌ను ఐదుగురూ కలిసి పిడిబాకు, వేటకొడవలి, గొడ్డలితో దాడిచేసి మట్టుబెట్టారు. నిందితులలో నలుగురిని కదిరి కొండవద్ద పట్టుకుని, వారు ఉపయోగించిన మారణాయుధాలను స్వా«ధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. ప్రధాన నిందితుడు జగదీష్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్నీ పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ శ్రీధర్, పట్టణ ఎస్‌ఐ గోపాలుడు ఉన్నారు.