
న్యూఢిల్లీ: ఢిల్లీ నిరసనల జ్వాలల్లో చిక్కుకోవడానికి కాంగ్రెస్, ఆప్‌లే కారణమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ రెండు పార్టీలు పౌరసత్వ సవరణ చట్టంపై యువతను తప్పుదోవ పట్టించి రాజధానిలో అల్లర్లు రేకెత్తించిన పాపానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా నిరసనలకు కారణమైన వారి ఇళ్లకు వెళ్లి, వారికి న్యాయసహాయం అందిస్తామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఇతర దేశాలకు చెందిన మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చే వ్యవహారంపై తాము చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. అయితే రాహుల్, ప్రియాంక గాంధీలు దేశంలోని మైనారిటీలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. 2016లో జేఎన్‌యూలో భారత వ్యతిరేక నినాదాలు చేసిన వారిని ఆప్ ప్రభుత్వం కాపాడిందన్నారు.