
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలే వేసి, అనంతరం ప్రొ. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్ నేటితో రెండు దశబ్దాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తమ ఇళ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. (టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ శుభాకాంక్షలు)