Boxing Training
-
రూ. 500కే లవ్లీనా అకాడమీలో బాక్సింగ్ శిక్షణ
గువాహటి: భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ తన ఒలింపిక్స్ కలను సాకారం చేసుకున్నట్లే మిగతా వారు కూడా ఒలింపియన్లుగా ఎదగాలనే లక్ష్యంతో అకాడమీని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తర గువాహటిలోని బర్చండ్రాలో గురువారం లాంఛనంగా ప్రారంభమైన ఈ అకాడమీలో ఫీజు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అందరూ వెచ్చించే విధంగా నెలకు కేవలం రూ. 500 చెల్లించి ఇక్కడ ‘పంచ్’లు నేర్చుకోవచ్చు. 8 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయో విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అలాగే 18 ఏళ్ల పైబడిన వారికి కూడా కోచింగ్ ఇస్తారు. ఆమె లాభాపేక్షలేని కృషిని గుర్తించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రూ. 2 కోట్ల గ్రాంట్‌ను అందజేయనున్నట్లు ప్రకటించారు. లవ్లీనా తన అకాడమీకి ప్రభుత్వ స్థలాన్ని అడగలేదు. 2021లో సొంతంగా అకాడమీ ఏర్పాటు కోసం స్థలం కొనుగోలు చేసిన ఆమె మెరుగైన మౌలిక సదుపాయాలతో దాన్ని తీర్చిదిద్దింది. 26–26 సైజ్ బాక్సింగ్ రింగ్‌తో పాటు ఆధునిక పరికరాలతో కూడిన జిమ్‌ను ఏర్పాటు చేసింది. గువాహటిలో సకల హంగులతో నెలకొల్పిన తొలి బాక్సింగ్ అకాడమీగా చెప్పవచ్చు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల బాలబాలికలు, యువత కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రతిభాసక్తులు ఉన్న వారు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు, ప్రొఫెషనల్ బాక్సర్లుగా తయారయ్యేందుకు ఈ అకాడమీ దోహదం చేస్తుందని ఈ సందర్భంగా లవ్లీనా పేర్కొంది. కొత్త తరం బాక్సర్లకు ఇదో వేదికగా మారాలని ఆకాంక్షించింది. ‘మేటి బాక్సర్లను తయారు చేయాలనే కలతో దీన్ని నిర్మించాను. ఇక్కడ శిక్షణ పొందిన బాక్సర్లు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు తేవాలని, 2028కల్లా కొందరైనా బాక్సర్లు వెలుగులోకి రావాలని ఆశిస్తున్నాను’ అని 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన లవ్లీనా చెప్పింది. దశలవారీగా బాక్సర్లకు హాస్టల్ వసతి కల్పించాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటామని చెప్పింది. -
బాక్సింగ్ నేర్పిస్తానని వచ్చి..ఎక్కడెక్కడో తాకుతూ
ముంబై : బాక్సింగ్ శిక్షణ పేరుతో 19 ఏళ్ల అమ్మాయిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...బీఏ చదువుతున్న సదరు యువతి ఆరు నెలల క్రితం సోదరుడితో కలిసి జిమ్‌లో చేరింది. అక్కడే ట్రైనర్ రాబిస్ ఆంధోని పర్యవేక్షణలో యువతి బాక్సింగ్ నేర్చుకుంటుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి దగ్గరికే వచ్చే శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో రోజూ మాదిరిగానే ఈనెల 19న యువతి ఫ్లాట్‌కు వెళ్లిన ట్రైనర్ ఆంధోని..ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దాన్ని అవకాశంగా మరల్చుకున్నాడు. బాక్సింగ్ నేర్పుతున్నట్లు నటించి ఆమె శరీర భాగాలను అసభ్యకరంగా తడిమాడు. దీంతో షాక్‌కి గురైన యువతి..ఫ్లాట్ నుంచి వెంటనే బయటకు వచ్చేసింది. లిఫ్ట్ ఎక్కబోతుండగా, మరోసారి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధిత యువతి..కుటుంబ సభ్యులకు వివరించగా, వారు ట్రైనర్ ఆంధోనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి : బలిచ్చేందుకు బాలుడిని చిత్రహింసలు పెట్టి.. వివాహేతర సంబంధం; భర్తను వదిలిరానన్నందుకు.. -
బాక్సింగ్‌కి సిద్ధం
బాక్సింగ్ గ్లౌజ్స్‌తో ముంబై ప్రయాణమయ్యారు వరుణ్‌తేజ్. కొన్నిరోజుల పాటు బాక్సింగ్ శిక్షణలో బిజీగా ఉండబోతున్నారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో వరుణ్‌తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ బాక్సర్ పాత్రలో నటించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేశ్, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాక్సర్ పాత్రలో నటించడానికి అమెరికాలో బాక్సింగ్ గోల్డ్ మెడలిస్ట్ టోనీ జెఫ్రీస్ దగ్గర శిక్షణ తీసుకున్నారు వరుణ్. ఇప్పుడు ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయాత్ దగ్గర కూడా బాక్సింగ్‌కి సంబంధించిన మెళకువలు నేర్చుకోనున్నారు. ప్రపంచ బాక్సింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రవేశించిన తొలి భారతీయ బాక్సర్ నీరజ్. ఆయన దగ్గర బాక్సింగ్ ట్రిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు వరుణ్. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. -
సూపర్ శిక్షణ
బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవడానికి రెండు నెలలుగా వరుణ్ తేజ్ ఫారిన్లో ఉన్న సంగతి తెలిసిందే. వరుణ్ శిక్షణ ఓ కొలిక్కి వస్తున్నట్లు తెలిసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలోనే వరుణ్ బాక్సర్‌గా నటించనున్నారు. ఇందుకోసం శిక్షణ తీసుకోవడానికే ఆయన ఫారిన్ వెళ్లారు. ఇంగ్లాండ్‌కు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ టోనీ డేవిడ్ జెఫ్రీస్ వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ‘‘టోనీ జెఫ్రీస్ నీతో రెండు నెలలుగా శిక్షణ బాగా జరిగింది. ఇప్పుడు మిస్ అవుతున్నాను. త్వరలో ట్రైనింగ్ మళ్లీ స్టార్ట్ చేద్దాం’’ అని పేర్కొన్నారు వరుణ్ తేజ్. ఇక్కడ లేటెస్ట్ వరుణ్‌తేజ్ లుక్‌ని గమనిస్తే... వరుణ్ బాగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. పాత్ర కోసమే ఇదంతా అని ఊహించుకోవచ్చు. -
సాధనే ఆయుధం
రింగులో బాక్సర్ శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా బలంగా ఉండాలి. లేకపోతే ప్రత్యర్థిదే విజయం. బరిలో గెలవాలంటే సరైన సాధనే ఆయుధం. అందుకే ఇటు మానసికంగా అటు సాధనపరంగా రాజీ పడటం లేదు వరుణ్ తేజ్. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వరుణ్‌తేజ్ పడుతున్న ఈ శ్రమ అంతా ఆయన బాక్సర్‌గా నటించబోతున్న చిత్రం కోసమే. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటించనున్నారు. ఇందుకోసం కాలిఫోర్నియాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు వరుణ్. ‘‘పది రౌండ్ల బాక్సింగ్ సాధన చేసిన తర్వాత నేను’’ అనే క్యాప్షన్‌తో ఇన్సెట్లో ఉన్న ఫొటోను షేర్ చేశారు వరుణ్. అక్కడినుంచి వరుణ్ తిరిగొచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
బొబ్బింగ్ అండ్ బ్లాకింగ్!
అప్రైట్ స్టాన్స్, సెమీ క్రౌచ్, ఫుల్ క్రౌచ్, జబ్, క్రాస్, హుక్, బొబ్బింగ్, బ్లాకింగ్... ఇదిగో ఈ పదాలనే మార్చి మార్చి పలుకుతున్నారు వరుణ్ తేజ్. స్పోర్ట్స్ గురించి.. అది కూడా బాక్సింగ్ గురించి తెలిసినవారికి ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ ప్రస్తావించిన పదాలన్నీ బాక్సింగ్‌కి సంబంధించినవి అని. హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ సాధన మొదలు పెట్టారు. ఈ ప్రత్యేకమైన శిక్షణ కోసం ఆయన లాస్ ఏంజిల్స్ వెళ్లారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్ర చేయనున్నారు. ‘‘లాస్ ఏంజిల్స్‌లో బాక్సింగ్ శిక్షణ మొదలైంది’’ అంటూ తన ప్రాక్టీస్‌కి సంబంధించిన ఫొటోను బయటపెట్టారు వరుణ్. ఇక కిరణ్ కొర్రపాటి విషయానికి వస్తే... ఇంతకుముందు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మిస్టర్, తొలిప్రేమ’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. వరుణ్‌తో కిరణ్ దర్శకత్వం వహించనున్న తాజా సినిమాకు వరుణ్ తేజ్ కజిన్ అల్లు బాబీ (నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు) ఒక నిర్మాత అని తెలిసింది. -
మేరీ మమ్మీ
ఫస్ట్ పర్సన్ హిందీలో మేరీ అంటే ‘నా’.. మమ్మీ అంటే అమ్మ.. మేరీ మమ్మీ అంటే నా అమ్మ! ప్రతి కొడుకుకి ఉండాల్సిన మమ్మీ మేరీ కోమ్!! తన కొడుకులకు రాసుకున్న ఉత్తరం అనువాదమిది! మన ఇళ్లల్లో కూడా ‘వాడికేం.. మగాడు’ అన్న మాట తరచూ వింటూంటాం.. అంటే తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి మగపిల్లలకు ఏం చేసినా చెల్లుతుంది అని చెప్తున్నారన్నమాట! చెల్లదు .. అని చెప్తుంది మేరీ! ‘నో ’ అంటే ‘నో’!! డియర్ సన్స్.. ఎందుకో ఈ రోజు మీకు ఈ ఉత్తరం రాయాలనిపించింది. మన దగ్గర అమ్మాయిలకు గౌరవం లేదు. అబ్బాయిలుగా మీకూ ఒక ముక్కు, రెండు కళ్లు, రెండు చెవులు, మెదడు ఉన్నట్టే అమ్మాయిలుగా మాకూ ఉంటాయి. శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే మీ నుంచి మమ్మల్ని వేరు చేస్తున్నాయి. అంతమాత్రాన మేం సెకండ్ సిటిజన్స్ కాము కదా! మీలాగే మేమూ మెదడుతో ఆలోచిస్తాం... మనుసుతో ఫీలవుతాం! ఇలాంటి పెద్ద విషయాలను పదేళ్లయినా నిండని మీతో ఎందుకు చెప్తున్నానంటే.. కనీసం ఈ వయసు నుంచయినా అమ్మాయిలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారని.. అమ్మాయిల విషయంలో సున్నితంగా ప్రవర్తించడం అలవడుతుందని! నాకూ తప్పలేదు.. మన దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు ఈవ్‌టీజింగ్‌కి, సెక్సువల్ అబ్యూజ్కి, లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. ఎవరో ఆడపిల్లల దాకా ఎందుకు కన్నలూ.. మీ అమ్మనైన నేనూ లైంగిక దాడికి గురయ్యాను. అప్పుడు నాకు పదిహేడేళ్లు.. ఉదయం ఎనిమిదన్నరకు రిక్షాలో బాక్సింగ్ ట్రైనింగ్‌కి వెళ్తున్నా.. పక్కనుంచి సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా నా మీదకు వంగి నా యెదను తడుతూ వెళ్లిపోయాడు. ఒక్క క్షణం షాక్ అయ్యాను. కోపంతో రగిలిపోయాను. వెంటనే రిక్షాలోంచి దూకి, చెప్పుల్ని తీసి చేత్తో పట్టుకొని వాడిని వెంబడించాను. కాని వాడు తప్పించుకొని పారిపోయాడు. అరే వాడిని పట్టుకోలేకపోయానే అనే బాధ ఇప్పటికీ వెంటాడుతుంది. వాడు దొరికి ఉంటే అప్పటికే నేను నేర్చుకున్న కరాటేను వాడి మీద ప్రాక్టిస్ చేసేదాన్ని. ఇంకోసారి.. ఢిల్లీ, హిస్సార్‌లో కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది నాకు, నా ఫ్రెండ్స్‌కి. ట్రైనింగ్ క్యాంప్‌లో ఓ సాయంకాలం.. వాకింగ్ చేస్తుంటే! ఎందుకు విషయం అవుతోంది? ఆ సంఘటనల తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలి.. మమ్మల్నే మాటలన్నారు. అమ్మాయిలను చూస్తే చాలు.. వాళ్ల వక్షస్థలాన్ని తాకాలని, పిరుదుల మీద తట్టాలని ఎందుకనుకుంటారు ఈ మగవాళ్లు? అమ్మాయిలున్నది అలాంటి వెకిలి ఆనందాలను పంచడానికి కాదు. అమ్మాయిలను బలవంతంగా తాకి అబ్బాయిలు పొందే సంతోషమేంటో నాకిప్పటికీ అర్థంకాదు! అమ్మాయిల మీద లైంగిక దాడి జరిగిందంటే చాలు.. వాళ్లు వేసుకున్న బట్టలు ఎందుకు చర్చకొస్తాయి? వాళ్లు ఆ టైమ్‌లో బయటకు ఎందుకు వెళ్లారనేది ఎందుకంత ఇంపార్టెంట్ అవుతుంది? ఒరేయ్.. ఈ ప్రపంచం మీకెంత సొంతమో.. మాకూ అంతే కదా? మరి మాకెందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్? స్వేచ్ఛగా బయటకు వెళ్లడానికి అమ్మాయిలెందుకు వెనకాముందు ఆలోచించాలి? మీకు అర్థం కావాలి.. మీరు పెరుగుతున్నారు. అందులోనూ అబ్బాయిలు.. అందుకే మీకు అర్థంకావాలని చెప్తున్నానురా.. రేప్, అబ్యూజ్, ఈవ్ టీజింగ్, సెక్సువల్ హెరాస్మెంట్.. ఇవన్నీ నేరాలే. వీటికి తీవ్రమైన శిక్షలుంటాయి.. ఉన్నాయి.. ఉండాలి కూడా! కన్నలూ.. ఎప్పుడైనా ఎవరైనా ఆడపిల్లలను ఏడిపించడం మీరు చూస్తే వెంటనే వెళ్లి ఆ అమ్మాయిలకు సాయం చేయండి.. ధైర్యం చెప్పండి.. వాళ్లకు అండగా నిలబడండి.. మీ అమ్మగా మీ నుంచి నేను కోరుతున్నదిదే! రెస్పెక్ట్ విమెన్! అత్యంత విషాదమేంటంటే.. ఈ సమాజంలో సమంగా గౌరవం పొందాల్సిన మేము నిర్లక్ష్యానికి గురికావడం! మన దేశ రాజధాని ఢిల్లీలో.. కొన్ని వందల మంది అమ్మాయిలు రేప్‌కి గురయ్యారు. గురవుతూనే ఉన్నారు. ఎవ్వరూ ఆ అన్యాయాలను ఆపట్లేదు సరికదా కనీసం ప్రశ్నించడం లేదు. మీరు అలా కాదు.. మనిల్లు వేరు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమనే వాతావరణంలో మీరు పెరుగుతున్నారు. దీనికి సరైన ఉదాహరణ మీ నాన్నే. ఆయన మీ ఫ్రెండ్స్ అందరి నాన్నల్లాగా నైన్ టు ఫైవ్ జాబ్ చేయరు. బాక్సర్‌గా నా ట్రైనింగ్, జాబ్, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా... ఇంటిపట్టునే ఉండడం నాకు కుదరదు. కాని మా ఇద్దరిలో ఎవరో ఒకరి అటెన్షన్ మీకు తప్పకుండా కావాలి. అందుకే ఆ బాధ్యతను మీ నాన్న తీసుకున్నారు. ఈ విషయంలో మీ నాన్నంటే నాకెంత గౌరవమో మాటల్లో చెప్పలేను. నా కోసం, మీ కోసం, ఈ ఇంటి కోసం ఆయన టైమ్‌ని, కెరీర్‌ని డెడికేట్ చేశారు. నా బలం మీ నాన్నే. ఆయన తోడులేందే నా ప్రయాణంలో ఒక్క అడుగూ ముందుకు సాగలేదు! అయితే త్వరలోనే మీరు బయటవాళ్ల నుంచి నాన్న మీద హౌజ్ హజ్బెండ్ అనే మాటలు వింటారు. ఒక్కటి గుర్తుంచుకోండి.. అలాంటి మాటలను అవమానంగా, అగౌరవంగా భావించాల్సిన పనిలేదు. ఇంటిని చూసుకునే బాధ్యత అమ్మకు మాత్రమే కాదు నాన్నకూ ఉంటుందని గ్రహించండి. రేపొద్దున మీరిలాంటి బాధ్యతను పంచుకోవాల్సి వస్తే నామోషీగా, అమర్యాదగా ఫీలవ్వకూడదు. అది అవమానం.. అది హేళన.. మీరు నా పక్కనుంచి నడుస్తుంటే కొంతమంది మీ అమ్మను ‘చింకీ’ (చట్టి ముక్కు, చిన్న కళ్లున్న చైనీస్ అనే అర్థంలో) అంటూ కామెంట్ చేయడం వింటారు. ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన చాలామంది అమ్మాయిలు వాళ్ల రూపురేఖలు, వాళ్ల వస్త్రధారణతో చింకీస్గా టార్గెట్ అవుతున్నారు. అది అవమానం. అది హేళన. అది జాత్యాహంకారం. నేను భారతీయురాలినే. మిమ్మల్నీ భారతీయులుగానే పెంచుతున్నా! భారతీయులమైనందుకు గర్వపడేలా తీర్చిదిద్దుతున్నా. తిరుబాటుదారులున్న రాష్ట్రానికి చెందినవాళ్లం. ఆ హింస నుంచి మిమ్మల్ని కాపాడుకుంటున్నా... రక్షించుకుంటున్నా. ఆ భయాలనుంచి బయటపడే ధైర్యాన్ని మీకు నూరిపోస్తున్నా. ఈ దేశ పౌరులుగా మిగిలిన అందరితో సమానమైన గౌరవమర్యాదలు పొందే హక్కు మీకెలా ఉందో మహిళలకూ పురుషులతో సమానమైన గౌరవమర్యాదలు పొందే హక్కుంది. మీరు ఈ దేశ భవిష్యత్ పౌరులు. ఈ దేశ పరువు, ప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు మీ చేతుల్లో ఉన్నాయి. మహిళలను మీరు గౌరవిస్తేనే ఈ దేశ పరువు, ప్రతిష్ఠలు నిలబడుతాయి. అదే నిజమైతే.. నా దేశం నాకు ఎంతో పేరు, ప్రతిష్ఠలను ఇచ్చింది. కాని ఎమ్మెస్ ధోని, విరాట్ కొహ్లీలను గుర్తుపట్టినట్టుగా నన్ను గుర్తించరు. అలాగని ‘చింకీ’ అనే కామెంట్‌కీ నేను అర్హురాలిని కాదు కదా..! రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి నన్ను గౌరవించారు. చాలా సంతోషం. స్త్రీ సమస్యలను చర్చించే ఈ అవకాశాన్ని వదులుకోను. మహిళల మీద సాగుతున్న హింస గురించి పార్లమెంట్లో ప్రశ్నిస్తాను. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. అయితే సెక్సువల్ అబ్యూజ్, హెరాస్మెంట్స్ నేరాలే కావనే ముద్ర పడిపోయింది మనలో. అవి నేరాలే అనే విషయం మీకు చెప్పకపోతే.. వాటి గురించి మీకు అవగాహన పెంచకపోతే అమ్మగా నేను ఫెయిల్ అయినట్టే. అందుకే.. ఇవన్నీ చెప్పాలనే ఈ ఉత్తరం రాస్తున్నా.. శరీరాల మీద హక్కు కేవలం మగవాళ్లకే కాదు.. వాళ్ల శరీరాల మీద హక్కు స్త్రీలకూ ఉంటుంది. వాళ్లు ఒకసారి నో అని చెప్పారంటే ఆ ‘నో’ గౌరవించండి. బలవంతం చేసి వాళ్ల చావులను చూడకండి. రేప్ అనేది సెక్స్ కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ మిస్ప్లేస్డ్ సెన్స్ ఆఫ్ పవర్ అండ్ రివెంజ్! నన్ను ఇబ్బంది పెట్టినవాడిని చాచి ఒక్కటి ఇవ్వగలను. అది నా బాక్సింగ్ ప్రాక్టిస్నూ పెంచుతుంది. కాని కొట్టేదాకా తెచ్చుకోవడం ఎందుకని? కోరిక చాలా అందమైంది పరస్పర అంగీకారం, ఇష్టం ఉంటే! ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మన ఇళ్లలో చాలా సార్లు వింటాం.. వాళ్లు మగ పిల్లలు.. మగ పిల్లలు మగపిల్లలే అని. అదే నిజం అయితే మగపిల్లలుగా ఈ దేశంలో అమ్మాయి భద్రంగా, గౌరవంగా మసిలే వాతావరణాన్ని కల్పించండి! ఇట్లు మీ అమ్మ మేరీ కోమ్