Birdflu: బర్డ్‌ఫ్లూ అరికట్టడంలో కూటమి సర్కార్‌ విఫలం.. రంగంలోకి కేంద్రం | Central Team To Visit Narasaraopet Aaradhya House Who Recently Died Of Bird Flu Over Study On Birdflu | Sakshi
Sakshi News home page

Birdflu In AP: బర్డ్‌ఫ్లూ అరికట్టడంలో కూటమి సర్కార్‌ విఫలం.. రంగంలోకి కేంద్రం

Published Fri, Apr 4 2025 11:24 AM | Last Updated on Fri, Apr 4 2025 12:55 PM

Central Team to Visit Narasaraopet Over Study on Birdflu

పల్నాడు జిల్లా,సాక్షి: బర్డ్‌ ఫ్లూ (హెచ్‌5ఎన్‌1) వైరస్‌ను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీంతో బర్డ్‌ఫ్లూని అరికట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఇటీవల బర్డ్‌ఫ్లూతో మరణించిన పెండ్యాల గోపి, జ్యోతి దంపతుల కుమార్తె రెండేళ్ల ఆరాధ్య ఇంటిని సందర్శించనుంది.

ఇందులో భాగంగా శుక్రవారం కేంద్ర వైద్య బృందం పల్నాడు జిల్లాకు వచ్చింది. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని బాలయ్య నగర్‌లో ఉన్న చిన్నారి ఆరాధ్య ఇంటి పరిసరాల్ని పరిశీలించనుంది. అనంతరం,  జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబుతో భేటీ  కానున్నట్లు సమాచారం. 

 బర్డ్‌ ఫ్లూపై అబద్ధపు ప్రకటనలు
బర్డ్‌ఫ్లూ (హెచ్‌5ఎన్‌1) వైరస్‌ను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారి మనుషులకు ఆ వ్యాధి సోకడంతో పాటు ఒక మరణం సంభవించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం రెండేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. రాష్ట్రంలో రెండు నెలలుగా ఎక్కడా బర్డ్‌ ఫ్లూ లేదంటూ అబద్ధపు ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు సర్కారు.. తాజాగా పచ్చి చికెన్‌ తినడం వల్లే ఆ బాలికకు బర్డ్‌ ఫ్లూ వచ్చిందని ప్రకటించింది.

గందరగోళంలో ప్రజలు
పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. కొద్ది నెలలుగా రాష్ట్రంలోని పౌల్ట్రీ పరిశ్రమలో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తోంది. దానిని అరికట్టడంలో, వైరస్‌ ప్రబలకుండా చర్యలు చేపట్టడంలో చంద్ర­బాబు ప్రభుత్వం తీవ్ర అలసత్వంతో వ్యవహరించింది. ఈ క్రమంలోనే నరసరావుపేట రావిపాడు రోడ్డులోని బాలయ్య నగర్‌కు చెందిన పెండ్యాల గోపి, జ్యోతి దంపతుల కుమార్తె రెండేళ్ల ఆరాధ్య మృత్యువాత పడింది.

జలుబు, తుమ్ములు, తీవ్రమైన శ్వాసకోశ సమస్య, జ్వరం, విరేచనాలతో బాధ పడుతున్న ఈ చిన్నారి మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గత నెల 15న మృతి చెందగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘రెండేళ్ల బాలిక జ్వరం, శ్వాసకోశ సమస్యతో మార్చి 4వ తేదీన పిడియాట్రిక్స్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేరింది. ఆ బాలికకు లెప్టోసిరోసిస్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. 


ఆరాధ్య మృతి
నాసోఫారింజియల్‌ స్వాబ్‌ పరీక్ష ద్వారా ఇన్‌ఫ్లూయింజా ఏ పాజిటివ్‌గా కూడా నిర్ధారణ అయింది. దీంతో మరో నమూనాను పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపాం. వారు ఏవియన్‌ ఇన్‌ఫ్లూయింజా (హెచ్‌5ఎన్‌1)గా నిర్ధారించారు. అయితే అంతలోనే పాప ఆరోగ్యం క్షీణించడంతో గత నెల 15వ తేదీన మృతి చెందింది. 

బర్డ్‌ ఫ్లూపై పచ్చి అబద్ధాలు
ఎవరైనా సరే జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి’ అని ఎయిమ్స్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంత స్పష్టంగా ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ సంస్థే రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ ఉందని నిర్ధారించగా, ప్రభుత్వం మాత్రం లేనే లేదంటూ పచ్చి అబద్ధాలు చెబుతోంది. రంజాన్‌ రోజు సాయంత్రం స్థానిక డీఎంహెచ్‌వోకు ఈ విషయం తెలియడంతో మరుసటి రోజు మంగళవారం ఉదయం నుంచి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. 

డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరి, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మల్లీశ్వరి మంగళవారం నరసరావుపేటకు వచ్చి చిన్నారి కుటుంబాన్ని విచారించారు. తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి రక్త పరీక్షలు చేశారు. జాగ్రత్తలు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా బర్డ్‌ ఫ్లూ వ్యాధి జాడ లేదని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టీ.దామోదర నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

రాష్ట్రంలో ఇదే తొలి కేసు
రాష్ట్రంలో గతంలో చాలాసార్లు కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కొద్ది నెలల కింద కూడా బర్డ్‌ఫ్లూ వైరస్‌ పెద్ద ఎత్తున విజృంభించింది. ఇలాంటి తరుణంలో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ డ్రామా నడిపింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించకుండా కేవలం ప్రకటనలతో సరిపెట్టింది. 

బర్డ్‌ఫ్లూనూ అరికట్టామంటూనే 
నరసరావుపేటలో మరణించిన చిన్నారి ఫిబ్రవరిలో పచ్చి కోడి మాంసం తినడం వల్లే వ్యాధిబారిన పడిందని వైద్య శాఖ చెబుతుండగా.. తామసలు రెండు నెలలుగా చికెన్‌ తినడం లేదని బాధిత కుటుంబం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే వైరస్‌ను పూర్తిగా అరికట్టేశామని ప్రభుత్వం ఏ విధంగా ప్రకటన చేస్తుంది? ఈ పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి.. బుధవారం పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కేసులు లేనేలేవని ప్రకటన ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. 

అప్రమత్తంతో మెలగాలి 
బాలిక మృతి నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చిన్నారి మరణించిన ప్రాంతంలో రెండు వారాల పాటు సర్విలెన్స్‌ పెట్టారు. దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో కేవలం 4 హ్యూమన్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయింజా కేసులు (హెచ్‌5ఎన్‌1), హెచ్‌9ఎన్‌2 కేసులు నమోద­య్యాయి. వీటిలో జూన్‌ 2019లో మహారాష్ట్ర, జూలై 2021లో హరియాణలో ఒక్కో కేసు, ఏప్రిల్, మే 2024లో పశ్చిమ బెంగాల్లో రెండు కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ మృతి కేసు నమోదు కావడం ఇదే ప్రథమం.

చికెన్‌ తీసుకురాలేదు 
రెండు నెలలుగా మా కుటుంబం చికెన్‌ తీసుకురాలేదు.. వండలేదు. రావిపాడు చర్చిలో ప్రార్థనలకు హాజరైనప్పుడు 40 రోజులపాటు మాంసాహారం తినొద్దని చర్చి పెద్దలు చెప్పటంతో చికెన్‌ తెచ్చుకోలేదు. ఈ జబ్బు ఏవిధంగా వచ్చిందో మాకు తెలియదు. మా అందరికీ రక్త పరీక్షలు చేశారు. అందరికీ బాగానే ఉందన్నారు. 

– పెండ్యాల లక్ష్మయ్య (చిన్నారి తాత), రాము (పెదనాన్న)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement