
ప్రభుత్వ హైస్కూల్ ప్లస్‌లో సీఈసీలో రాష్ట్రంలో ఫస్ట్
తూర్పు గోదావరి: మండలంలోని పందలపాకకు చెందిన రుత్తల లీలాశ్రావణికి చదువుపై ఉన్న శ్రద్ధ మహిళలకు ఆదర్శంగా నిలిచింది. విజయవాడకు చెందిన ఈమె 2018–19 ఏడాది 9.7తో పదవ తరగతి పూర్తి చేసింది. అయితే ఆరోగ్య సమస్యల వల్ల చదువు మానేసింది. ఆ తర్వాత పందలపాకకు చెందిన యడ్ల మణికంఠతో వివాహం చేశారు. దీంతో ఆమె పందలపాక వచ్చింది. ఆమెకు ఒక పాప పుట్టింది. చదువు మళ్లీ కొనసాగించాలనే లక్ష్యంతో అడుగు ముందుకు వేసింది. అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పందలపాక గ్రామంలో మహిళల కోసం కళాశాలను ఏర్పాటు చేశారు.
దీంతో ఆమె కాలేజీలో చేరి చదువు కొనసాగించింది. దీంతో కాలేజీ చేరిన ఇంటర్ మొదటి సంవత్సరంలో సీఈసీలో 479 మార్కులు సాధించింది. శనివారం వచ్చిన ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో మొత్తం 943 మార్కులు సాధించింది. హైస్కూల్ ప్లస్ కాలేజీలో రాష్ట్రంలో మొదటి స్థానం రావడంతో చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయురాలు కావడం తన కొరిక అని తెలిపింది. విద్యాశాఖ మంత్రి ఈ నెల 15వ తేదీన ఆమెను సత్కరించనున్నట్టు మేసేజ్ వచ్చిందని పందలపాక పడాల పెద్దపూల్లారెడ్డి జిల్లా పరిషత్ హెచ్‌ఎం చిర్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు.