
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మెడికల్ కళాశాల వద్ద మెడికోలు ఆందోళన చేపట్టారు. కళాశాల డీన్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేకే శ్రీరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని నిరసనకు దిగారు. చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్న శ్రీరామ్ బంధువులు ఆరోపిస్తున్నారు.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
మరో ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇవాళ తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణిగా గుర్తించారు. ఉగాది పండగకు ఇంటికి వెళ్లి నిన్న(శుక్రవారం) సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు విద్యార్థిని వచ్చింది.
తల్లితో కలిసి రాత్రి హాస్టల్‌లో ఉన్న మృతురాలు కృష్ణవేణి.. తెల్లవారుజామున కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
