
గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’ వేడుక స్పెషల్ ఎపిసోడ్ సాక్షి టీవీలో శనివారం ప్రసారం కానుంది. ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు.
సామాజిక రంగంలో గొప్ప సేవ చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వారికీ, కళారంగంలో గొప్ప ప్రతిభ చూపిన వారికి 2023–24 సంవత్సరాలకు గాను ఈ ఎక్సెలెన్సీ అవార్డులు బహూకరించారు. జ్యూరీ చైర్‌పర్సన్‌గా శాంతా సిన్హా వ్యవహరించారు. అవార్డులు అందుకున్న వారిలో పర్యావరణ సేవకు గాను దూసర్ల సత్యనారాయణ, సేంద్రియ వ్యవసాయానికి మల్లికార్జున రెడ్డి, అమర సైనికుడు డొక్కరి రాజేష్ (మరణానంతరం అతని తల్లిదండ్రులకు), క్రికెటర్ గొంగడి త్రిష, అథ్లెట్ జీవాంజి దీప్తి తదితరులు ఉన్నారు.
సినిమా రంగంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ సీనియర్ నటి రమాప్రభ అందుకున్నారు. ఎక్సెలెన్సీ అవార్డులు అందుకున్న వారిలో దర్శకుడు సాయి రాజేష్, మీనాక్షి చౌదరి, కిరణ్ అబ్బవరం తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం, ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నారు.