
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) సాధికార కమిటీ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీలకు రూ.1000 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం లభించినట్లు అధికారులు తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద మొత్తం రూ.3,400 కోట్ల క్లెయిమ్‌లు రాగా.. 2023 మార్చికి ప్రభుత్వం రూ.2,900 కోట్లు పంపిణీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఇదే తొలి నగదు పంపిణీ.
ఎలక్ట్రానిక్ తయారీ, వైట్ గూడ్స్, జౌళి, ఔషధ పరికరాల తయారీ, వాహన, స్పెషాలిటీ స్టీల్, ఆహార ఉత్పత్తులు, సోలార్ పీవీ మాడ్యుల్స్, అడ్వాన్డ్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్స్, ఔషధ వంటి 14 రంగాలకు పీఎల్‌ఐ పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశీయ తయారీ, ఉద్యోగాల సృష్టి, ఎగుమతులకు ఊతమిచ్చేందుకు 2021లో ప్రభుత్వం పీఎల్‌ఐ పథకాన్ని తీసుకొచ్చింది. పీఎల్‌ఐ పథకం కింద ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న 32 భారీ సంస్థలకు ఆమోదం లభించింది. ఇందులో 10 కంపెనీలు మొబైల్ తయారీ సంస్థలే. ఈ పథకం కింద అదనంగా రూ.10లక్షల కోట్ల ఉత్పత్తి; 7 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని అంచనా.