
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి.
► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు.
► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్‌పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు.