
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తాజాగా తృణధాన్యాల ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది. మిల్లెట్ మార్వెల్స్ పేరిట రూపొందించిన ఉత్పత్తులను అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జేఎండీ సంగీత రెడ్డి చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర రూ. 95–120 వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల తర్వాత దేశవ్యాప్తంగా, అమెరికా తదితర దేశాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.
రాబోయే మూడేళ్లలో గ్రూప్ ఆదాయంలో 5% ఈ విభాగం నుంచి సమకూర్చుకోనున్నట్లు చెప్పారు. 2024–25లో కంపెనీ ఆదాయం రూ. 535 కోట్లుగా ఉండగా ఈసారి 15% వరకు వృద్ధి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 స్టోర్స్ ప్రారంభించనున్నట్లు ప్రసాద్ వివరించారు. రాబోయే రెండేళ్లలో వ్యాపార విస్తరణపై రూ.10–25 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు.