
వేసవి సెలవులను ఎంజాయ్ చేయడంలో ఇప్పుడు అడ్వెంచర్స్ కూడా భాగమవుతున్నాయి. గతంలో ఈ తరహా సాహస వినోదాల కోసం విహార యాత్రలకు వెళ్లినప్పుడు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు నగరం నుంచి కేవలం 30కి.మీ నుంచి 200 కి.మీ పరిధిలోనే పలు రకాల అడ్వెంచర్ స్పాట్స్ సాహసికులను, ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నాయి. వీకెండ్‌లో కాసింత ఉత్కంఠ, మరి కాసింత ఉద్వేగవంతమైన అనుభూతిని పొందేందుకు వినోదాన్ని మేళవించిన అనుభవాలను పొందాలనుకుంటే.. కచ్చితంగా ఇలాంటి వారి కోసమే అన్నట్లు పలు స్పాట్స్ ఆహ్వానిస్తున్నాయి. అయితే ఈ సాహసాలు ఏవైనా అవగాహన పెంచుకుని, ముందస్తు శిక్షణ తీసుకున్న అనంతరమే ప్రయత్నించాలంటున్నారు నిపుణులు.
మన దేశంలో తొలిదశలో ఉన్న సాహసికులను ఆకర్షించేది అడ్వెంచర్ పారా గ్లైడింగ్ దాదాపు 4 దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ.. గత ఐదారేళ్లుగా ఈ క్రీడా వినోదానికి బాగా ఆదరణ పెరిగింది. వందల/వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు చూస్తూ ఓ గ్లైడర్/ కనోపి సాయంతో గాల్లో ఎగరడం ఒక అద్భుతమైన అనుభూతి. దీనిని ఎంజాయ్ చేయాలంటే.. నగరం నుంచి ఓ 50 కిమీ ప్రయాణించాలి. షామీర్‌పేట్, తుర్కపల్లి దగ్గర ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పరిసరాల్లో ఈ అడ్వెంచర్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు.
హైలెస్సో.. హైలెస్సా అంటూ నదిలో బోట్లు
నడిపే కయాకింగ్ సాహసాలందు ఓ గొప్ప అనుభూతిని పంచుతుందంటున్నారు సాహసికులు. నీళ్లలో పడవను స్వయంగా నడుపుకుంటూ వైవిధ్యభరిత అనుభూతిని అందుకోవాలనునే వారిని.. సుమారు 100 కి.మీ.దూరంలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న కోటిపల్లి రిజర్వాయర్ ఆహ్వానిస్తోంది. నీళ్లలో పడవల యానం.. మొదటిసారిగా ప్రయతి్నస్తున్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుభవజు్ఞలైన వారికి మరింత ఆస్వాదించదగిన అనుభవం.
గుహల అన్వేషణ..
హిమాలయాల కంటే పాతవైన ఈ పర్వత సమూహాల్లో గుహల అన్వేషణకు పాండవుల గుట్ట ప్రత్యేక చిరునామా. అక్కడ జంతువులు, పురాతన చిహ్నాలతో కూడిన ప్యాలియోలిథిక్ రాక్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. నగరం నుంచి సుమారు 195 కిమీ దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ గుట్టలో గుహలను శోధించడం.. ఓ సాహసం మాత్రమే కాదు చరిత్రను గుర్తుచేసుకోవడం కూడా. దీనిని సాహసాలను ఇష్టపడేవారి వారాంతపు వినోదానికి సరైన ఎంపిక అనవచ్చు.
డర్ట్ బైక్.. ఏటీవీ రైడ్స్..
ఆఫ్–రోడ్ థ్రిల్ కోరుకునే వారికి నగరం నుంచి 85 కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ సరైన అడ్రెస్ అని చెప్పాలి. అక్కడ అడ్వెంచర్ చేయడానికి డర్ట్ బైకులు మాత్రమే కాదు ఏటీవీ రైడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొండలు, చెట్లు రాళ్లు రప్పల నడుమ ప్రత్యేకంగా రూపుదిద్దిన రేసింగ్ ట్రాక్‌పై చేసే డర్ట్ బైక్స్, ఏటీవీ రైడ్స్ సాహసికులకు థ్రిల్‌ని అందిస్తాయి.
జిప్ లైనింగ్..
నగరం నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ఘట్కేసర్ దగ్గరలోని పెబుల్ బీచ్ అడ్వెంచర్ క్లబ్‌లో జిప్ లైనింగ్ ట్రిప్‌లు ఉన్నాయి. వీటిని పిల్లలకూ, పెద్దలకూ సరిపోయేలా రూపుదిద్దారు. ఇంకా నగరం చుట్టు పక్కల బ్యాలెన్స్‌వాక్, ఫారెస్ట్ క్యాంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్.. లతో పాటు మరిన్న వైవిధ్యభరిత సాహస వినోదాలు అందుబాటులో ఉన్నాయి. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వీటిని ఎంజాయ్ చేస్తే చక్కని సమ్మర్ అనుభూతిని అందుకోవచ్చు.
రాప్పెలింగ్.. స్కై సైక్లింగ్..
ఓ వీకెండ్‌ను వైవిధ్యభరితంగా, ఉద్విగ్నంగా గడపాలంటే స్కై సైక్లింగ్ మరో మంచి ఎంపిక. ఇది నగరం నుంచి 105కి.మీ దూరంలో ఉన్న సిద్ధిపేట జిల్లాలోని కోమటి చెరువు దగ్గర అందుబాటులో ఉంది. ఈ స్కై సైక్లింగ్ చేస్తూ ఆ చెరువు అందాలను, పరిసర ప్రదేశాల్లో అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
రాక్ క్లైంబింగ్..
తెలంగాణలో అనేక కొండలు, గుట్టలు రాక్ క్లైంబింగ్‌కు ప్రసిద్ధి చెందాయి. అయితే భువనగిరి కోట ప్రత్యేక శైలి నిర్మాణం రాక్ క్లైంబింగ్ సాహసానికి చారిత్రాత్మక ఆకర్షణను అందిస్తుంది. ఇది నగరం నుంచి దాదాపు 105 కిమీ దూరంలో
ఉంది.
బంగీ జంపింగ్..
ఇప్పటికే చాలా సినిమాల్లోనూ, బయటా స్టార్స్ చేయగా చూసి ఉంటారు. అలాంటి బంగీ జంపింగ్ నగరవాసులకు కూడా చేరువలోకి తెచ్చింది లియోనియా రిసార్ట్. నగరం నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ రిసార్ట్‌కు వెళితే ఈసాహసాన్ని ఆస్వాదించవచ్చు.
(చదవండి: అరేబియా సౌందర్యం..కన్నడ దైవత్వం..! ఏకంగా ఆరు రోజులు, ఐదు రాత్రులు..)