
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ప్రధానమని జాతీయస్థాయిలో పేరొందిన న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి అన్నారు. ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్, ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియాతో కలిసి నగరంలోని తాజ్ డెక్కన్‌లో పోషకాహారంపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన ఆహారంతో పాటు చురుగ్గా ఉండటం కూడా చాలా అవసరం అన్నారు. వ్యాయామానికి ముందు తర్వాత తీసుకునే ఆహారం చాలా కీలకమని, కొవ్వులు, ఆహారంలో ఫైబర్, జింక్, మెగ్నీషియం వంటి 15 ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదం వంటి పప్పులు మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు.
ఈ సదస్సులో భాగంగా జరిగిన చర్చలో అపోలో హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ హరితా శ్యామ్, యశోద హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ సునీతా ఫిలిప్, స్టార్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
జోరుగా.. హుషారుగా..
శాస్త్రిపురం: వేసవిలో పచ్చని పార్కులు ఆహ్లాదాన్నిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులు పార్కుల్లో సందడి చేస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పార్కులలో జీహెచ్‌ఎంసీ అధికారులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఓపెన్ జిమ్‌తో పాటు చిన్నారుల కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. దీంతో పార్కుల్లో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఏ పార్కు చూసినా పిల్లలు, వృద్ధులు, మహిళలతో కళకళలాడుతున్నాయి.
(చదవండి: నీడ పట్టున ఉండొద్దు..నిత్యం కాస్త ఎండ తగలాల్సిందే..! హెచ్చరిస్తున్న వైద్యులు)