
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్‌చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్‌లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు.
ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి.
అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని.
(చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..)