
కృతయుగంలో లోల అనే దానవ స్త్రీ ఉండేది. ఆమె కొడుకు మధువు. దానవుడే అయినా మధువు ధర్మం తప్పక దేవతలతో మైత్రి కలిగి ఉండేవాడు. బ్రాహ్మణులను ఆదరించేవాడు. ఆపన్నులను ఆదుకునేవాడు. మధువు పరమశివుడి కోసం తపస్సు చేశాడు. పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. తన శూలం నుంచి మరో శూలాన్ని పుట్టించి, వరప్రసాదంగా ఇచ్చాడు. ‘నువ్వు దేవ బ్రాహ్మణులకు అపచారం చేయనంత కాలం ఈ శూలం నీ వద్ద ఉంటుంది. ఇది నీ శత్రువులను నాశనం చేస్తుంది’ చెప్పాడు పరమశివుడు.‘పరమేశ్వరా! ఈ శూలం నా వంశంలో కొనసాగేలా అనుగ్రహించు’ ప్రార్థించాడు మధువు.‘అది కుదరదు. నీ కొడుకు వరకు మాత్రం ఉంటుంది’ అన్నాడు శివుడు.
తర్వాత మధువు ఒక సుందర ప్రదేశంలో భవంతిని, దాని చుట్టూ సుందర నగరాన్ని నిర్మించుకున్నాడు. కుంభీనసి అనే దానవకాంతను పెళ్లాడాడు. కొంతకాలానికి వారిద్దరికీ లవణుడు పుట్టాడు.పెరిగి పెద్దయ్యే కొద్ది లవణుడు దుష్టుడిగా తయారయ్యాడు. కొడుకు చేష్టలకు మధువు కలతచెందేవాడు. కొంతకాలానికి మధువు తనకు శివుడు ప్రసాదించిన శూలాన్ని కొడుక్కు అప్పగించి, వరుణ లోకానికి వెళ్లిపోయాడు.తండ్రి నుంచి శివప్రసాదిత శూలం చేజిక్కిన తర్వాత లవణుడి ఆగడాలు మరింతగా శ్రుతిమించాయి. అతడిని ఎదిరించడానికి రాజులందరూ భయపడేవారు.
రావణ సంహారం తర్వాత అయోధ్యలో కొలువుదీరిన రాముడి వద్దకు ఒకనాడు కొందరు మునులు, బ్రాహ్మణులు వచ్చి, లవణుడి ఆగడాలను గురించి మొరబెట్టుకున్నారు. ‘రామా! లవణాసురుడు నానాటికీ శ్రుతి మించుతున్నాడు. ఎందరో రాజులను వేడుకున్నాం. వారందరూ అతడిని ఎదిరించడానికి భయపడుతున్నారు. రావణుడిని సంహరించిన నువ్వే మాకు దిక్కు అని నీ వద్దకు వచ్చాం’ అని చెప్పారు.వారి మొర విన్న రాముడు తన తమ్ముళ్లను పిలిచాడు.‘మీలో ఎవరు లవణుడిని సంహరించడానికి వెళతారు?’ అని అడిగాడు.
ముందుగా భరతుడు ‘నేను వెళతా’ అంటూ సిద్ధపడ్డాడు. అంతలో శత్రుఘ్నుడు కలగజేసుకుని, ‘అన్నా! నువ్వు అరణ్యవాసం చేసి, అయోధ్యకు తిరిగి వచ్చేంత వరకు భరతుడు నానా కష్టాలు పడ్డాడు. ఇకనైనా భరతుణ్ణి సుఖంగా ఉండనివ్వు. నేను వెళ్లి లవణాసురుణ్ణి చంపి వస్తాను’ అని చెప్పాడు. ‘తమ్ముడా! నువ్వు సర్వసమర్థుడివి. నువ్వా రాక్షసుణ్ణి చంపి, అతడి రాజ్యాన్ని ధర్మయుక్తంగా పాలించుకో’ అన్నాడు. వెంటనే పురోహితులను పిలిపించి, శత్రుఘ్నుడికి పట్టాభిషేకం చేశాడు. ‘లవణుడి వద్ద శివప్రసాదిత శూలం ఉంటుంది. దానిని అతడు ఇంటివద్ద వదిలి, దూరంగా వెళ్లినప్పుడే అదను చూసి అతణ్ణి చంపాలి’ అని చెప్పి, అనేక దివ్యాస్త్రాలను తమ్ముడికి ఇచ్చాడు.
శత్రుఘ్నుడు చతురంగ బలగాలతో బయలుదేరాడు. లవణుడు ఆహారం కోసం బయటకు వెళ్లి, పట్టణానికి తిరిగి వచ్చేసరికి పట్టణ ప్రవేశద్వారం వద్ద శత్రుఘ్నుడు ధనుర్బాణాలు ధరించి నిలిచి ఉన్నాడు. చుట్టూ సైన్యం మోహరించి ఉంది. ‘ఎవడ్రా నువ్వు? ఆయుధాలతో నా పట్టణం ముందు నిలబడ్డావు. నీలాంటి వాళ్లెందరో నాకు ఆహారమైపోయారు. మర్యాదగా అడ్డు తొలగు’అన్నాడు లవణుడు. ‘నేను దశరథ పుత్రుణ్ణి. శ్రీరాముడి తమ్ముణ్ణి. నీతో యుద్ధానికి వచ్చాను’ నిదానంగా బదులిచ్చాడు శత్రుఘ్నుడు.
‘అలాగా! నా మేనమామ రావణుణ్ణి చంపినవాడి తమ్ముడివన్నమాట! నీ కోరిక తప్పక తీరుస్తాను. లోపలకు వెళ్లి నా ఆయుధాన్ని తెచ్చుకోనీ’ అన్నాడు. ‘చేతికి చిక్కిన శత్రువును విడిచిపెట్టేంత అమాయకుణ్ణి కాదు. ఇప్పుడే నా బాణాలతో నిన్ను యమపురికి పంపిస్తాను’ అంటూ శత్రుఘ్నుడు ధనుష్టంకారం చేశాడు. చిర్రెత్తిపోయిన లవణుడు పక్కనే ఉన్న భారీ చెట్టునొకటి పెరికి, శత్రుఘ్నుడి మీదకు వచ్చాడు. ఇద్దరికీ యుద్ధం మొదలైంది. చెట్లతో లవణుడు, బాణాలతో శత్రుఘ్నుడు హోరాహోరీగా పోరాడారు. పరస్పరం గాయపరచుకున్నారు. లవణుడు విసిరిన భారీ చెట్టు శత్రుఘ్నుడి తలను తాకడంతో అతడు స్పృహ తప్పాడు.
శత్రుఘ్నుడు మరణించాడని తలచిన లవణుడు తన శూలం కోసం ఇంటికి పోకుండా, అక్కడే ఉండి తెచ్చుకున్న ఆహారం తినడం ప్రారంభించాడు.ఈలోగా స్పృహలోకి వచ్చిన శత్రుఘ్నుడు తనకు రాముడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని సంధించి, లవణుడి మీదకు వదిలాడు. నిప్పులు చిమ్ముకుంటూ దూసుకొచ్చిన ఆ దివ్యాస్త్రం లవణుడి గుండెల్లోంచి దూసుకుపోయి, పాతాళానికి వెళ్లి తిరిగి వచ్చి శత్రుఘ్నుడి అమ్ముల పొదిలోకి చేరింది. లవణుడు హాహాకారాలు చేస్తూ మరణించాడు.