అనుమానాస్పద రీతిలో ఘటన
మైలార్‌దేవ్‌పల్లి: పదమూడు రోజుల పసికందు నీటి బకెట్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన విజ్జి, ముదలి మణి దంపతులు ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం బండ్లగూడ ప్రాంతానికి వచ్చారు. అలీనగర్ కాలనీలోని జయ అండ్ కో బిస్కెట్ కంపెనీలో పని చేస్తూ వర్కర్స్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ముదలి మణి 13 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం ఉదయం భర్త పనికి వెళ్లాడు. ముదలి మణి బిడ్డను మంచంపై పడుకోబెట్టి బాత్రూంలోకి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత వచ్చి చూసేసరికి పాప కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికింది. అనంతరం నీటి బకెట్‌లో పాప పడి ఉన్నట్లు గమనించింది. వెంటనే స్థానికుల సహాయంతో పసికందును ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. 13 రోజుల పసికందు బకెట్‌లో పడే అవకాశం లేదంటూ ఈ ఘటనపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.