
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంజాన్ సందర్బంగా గురువారం వైట్ హౌస్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వర్గం నేతలు, దౌత్య సిబ్బంది, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ముస్లిం సోదరులకు రంజాన్ ముబారక్ తెలిపారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన లక్షలాది మంది అమెరికన్ ముస్లింలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
చారిత్రక అబ్రహాం ఒడంబడికల ప్రాతిపదికగా పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని చెప్పారు. గత బైడెన్ ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇజ్రాయెల్, ఏడు అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో గతంలో ట్రంప్ ప్రభుత్వం హయాంలో కుదిరిన అబ్రహాం ఒప్పందాలను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రశ్నార్థకంగా మారడం, గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్న వేళ ట్రంప్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం గమనార్హం.