
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచదేశాలకు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే స్వయంగా దేశం విడిచిపోవాలని.. లేకుంటే తీవ్ర చర్యలు తప్పవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో..
అక్రమ వలసదారులు ముందుగా సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ తుది ఆదేశాలు అందుకున్నాక కూడా దేశాన్ని వీడకుంటే.. రోజుకు 998 డాలర్లు(రూ.86వేల చొప్పున) జరిమానా విధిస్తారు. ఆ జరిమానా చెల్లించకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. అప్పటికీ వీడకుంటే పర్యవసనాలు మరోలా ఉంటాయని డీహెచ్‌ఎస్ హెచ్చరించింది.
తమంతట తాముగా అక్రమ వలసదారులు వెళ్లిపోవాలి. లేకుంటే.. అప్పటివరకు సంపాదించుకున్న డబ్బు జరిమానా రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. వెయ్యితో మొదలై.. ఐదు వేల డాలర్ల దాకా జరిమానా విధించవచ్చు. జైలు శిక్ష ఎదుర్కొనడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ అమెరికాకు వచ్చే అవకాశమూ కోల్పోతారు అని డీహెచ్‌ఎస్ హెచ్చరించింది. అయితే ఈ తరహా హెచ్చరికలను న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్ భయాల్లో భాగంగానే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది.