
వాషింగ్టన్: అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి అవమానకరంగా పంపిస్తున్నారని భారత్‌తో సహా ఇతర దేశాల్లో అమెరికాపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో విమర్శలు గుప్పిస్తోంది. అమెరికా ఇప్పటివరకు భారత్‌కు పంపించిన వలసదారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి అవమానకర రీతిలో తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఈ ఆరోపణలకు ఊతమిచ్చేలా వైట్‌హౌజ్ తాజాగా ఓ వివాదాస్పద 41 నిమిషాల నిడివి గల వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. అక్రమ వలసదారులను విమానం ఎక్కించేముందు వారికి సంకెళ్లు వేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అలాగే వారికి వేయడానికిగాను గొలుసులను పోలీసులు సిద్ధం చేస్తుండడం వీడియోలో కనిపిస్తోంది. అయితే విమానం ఎక్కుతున్న అక్రమ వలదారుల ముఖాలు మాత్రం వీడియోలో కనిపించలేదు.
ASMR: Illegal Alien Deportation Flight 🔊 pic.twitter.com/O6L1iYt9b4
— The White House (@WhiteHouse) February 18, 2025
కాగా, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు సంకెళ్లు వేసి తరలిస్తున్న అంశంలో ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కూడా ఏమీ చేయలేకపోయారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇంతకుముందు ఇదే విషయమై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ మహిళలకు, పిల్లలకు సంకెళ్లు వేయడం లేదని సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.