
హోం మంత్రి అమిత్ షా వెల్లడి
నీముచ్/జైపూర్: 2026 మార్చి 31వ తేదీలోగా దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలనే లక్ష్యానికి కేంద్ర రిజర్వు పోలీస్ దళం(సీఆర్‌పీఎఫ్) వెన్నెముకగా ఉందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సీఆర్‌పీఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
నేపాల్‌లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వరకు వామపక్ష తీవ్రవాదాన్ని విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నక్సలైట్లను ప్రస్తుతం దేశంలోని కేవలం 4 జిల్లాలకే పరిమితం చేయగలిగామన్నారు. దేశంలోని నక్సలిజం నిర్మూలనలో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు(సీఏపీఎఫ్), సీఆర్‌పీఎఫ్ ముఖ్యంగా అందులోని కోబ్రా బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 400కు పైగా శిబిరాలను ఏర్పాటు చేసుకుని సీఆర్‌పీఎఫ్ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతోందని వివరించారు.
కశ్మీర్‌లో ఉగ్రవాదంపై, ఈశాన్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, మావోయిస్టులను నాలుగు జిల్లాలకు పరిమితం చేయడం ద్వారా జాతి భద్రతలో సీఆర్‌పీఎఫ్ సేవలు నిరుపమానంగా మారాయని అమిత్ చెప్పారు. ధైర్యసాహసాలకు మారుపేరైన కోబ్రా కమాండోల పేరు వింటేనే నేడు కాకలు తీరిన నక్సలైట్లు సైతం వణికిపోతున్నారని ఆయన తెలిపారు. బ్రిటిష్ పాలనలో 1939లో ‘క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్’గా ఏర్పడిన ఈ బలగాల పేరును 1949లో హోం మంత్రి సర్దార్ పటేల్ హయాంలో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్‌గా మార్చారు.
2047 కల్లా మనమే నంబర్ వన్
దేశం వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకునే 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలుస్తామని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఇప్పటికే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా నిలిచిందన్నారు. మరికొద్ది సంవత్సరాల్లోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్తాన్‌లోని సిరోహిలో బ్రహ్మ కుమారీస్ సంస్థలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ‘సాయుధ బలగాల త్యాగాలు, అంకితభావం, బలిదానాల ఫలితంగా∙దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ వారు తమ జీవితాల్లోని అమూల్యమైన కాలాన్ని దేశ సరిహద్దులను కాపాడటానికి అంకితం చేస్తున్నారు’ అని కొనియాడారు.