
న్యూఢిల్లీ: మాజీ ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) నవీన్ చావ్లా(79) కన్నుమూశారు. అపొలో ఆస్పత్రిలో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని మరో మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి తెలిపారు. పది రోజుల క్రితం కలిసినప్పుడు బ్రెయిన్ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరనున్నట్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. 1969 బ్యాచ్ ఐఏఎస్ అయిన చావ్లా 2005 నుంచి 2009 వరకు ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు.
అనంతరం 2009 ఏప్రిల్ నుంచి 2010 జులై వరకు సీఈసీగా పనిచేశారు. కమిషనర్‌గా ఆయన పక్షపాతంతో వ్యవహరించినట్లు బీజేపీ ఆరోపించింది. 2006లో లోక్‌సభలో అప్పటి ప్రతిపక్ష నేత ఎల్‌కే అడ్వాణీ 204 మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ ఆరోపణలపై 2009లో అప్పటి సీఈసీ ఎన్ గోపాలస్వామి కమిషనర్ బాధ్యతల నుంచి చావ్లాను తొలగించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు కూడా చేశారు. ఈ విషయమై బీజేపీ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. దేశ 16వ సీఈసీ నవీన్ చావ్లా హయాంలో కీలక ఎన్నికలు సంస్కరణలు అమలయ్యాయి.
స్త్రీ, పురుషతోపాటు థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ‘ఇతరులు’అనే కేటగిరీని తీసుకురావడం అందులో ఒకటి. సీఈసీతో సమానంగా కమిషనర్లను అభిశంసించాలన్నా పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమయ్యేలా రాజ్యాంగ సవరణ తేవాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కాగా, నవీన్ చావ్లా 1992లో మదర్ థెరిసా జీవిత చరిత్రను రాశారు. 1997లో ప్రచురితమైన లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ మదర్ థెరిసా అనే పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు.