
నిజమే.. ఇలాంటి గుండెకోత ఏ తల్లిదండ్రులకు రాకూడదు. వైద్య విద్య అభ్యసించి చేతికి అందొచ్చిన కూతురు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. కొలువులో ఉండగానే కర్కశంగా తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడో కిరాతకుడు. న్యాయం కోసం నినదించిన ఆ తల్లిదండ్రుల రోదనను అధికార యంత్రాంగం పెడచెవిన పెట్టడంతో దేశవ్యాప్తంగా ప్రజా నిరసన జ్వాల ఎగిసింది. స్వలాభం కోసం రాజకీయ పార్టీలు ఈ కేసును వాడుకున్నాయి. ప్రజా ఉద్యమంతో దిగొచ్చిన అధికారులు మొద్దునిద్ర వదిలి దర్యాప్తు చేపట్టారు. గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రి (Kolkata RG Kar Hospital) కేసు ఇంకా ప్రజల మెదళ్లలోనే కదలాడుతోంది. ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
7 నెలలైనా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదు
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో తమ కుమార్తె(31) హత్యాచారానికి గురై ఏడు నెలలు గడిచినా ఇప్పటికీ అధికారులు డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆమె తండ్రి తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కోల్‌కతాలోని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం, కోల్‌కతా మున్సిపల్ కార్యాలయం, ఆర్‌జీకర్ ఆస్పత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నామన్నారు. డెత్ సర్టిఫికెట్ (Death Certificate) జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమంటూ తమను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం మమతా బెనర్జీ, ఆరోగ్య మంత్రి ఫిర్హాద్ హకీంకు ఈ విషయం తెలిసినట్లు తాము భావించడం లేదని చెప్పారు.
గతేడాది ఆగస్ట్ 9న ఆర్‌జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో మహిళా డ్యూటీ డాక్టర్ దారుణ హత్యాచారానికి గురవడం తెల్సిందే. ఈ కేసులో దోషిగా తేలిన ప్రధాన ముద్దాయి సంజయ్ రాయ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. సీల్దా కోర్టు ఈ ఏడాది జనవరి 20న ఈ మేరకు తుది తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును బాధితురాలి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దోషికి ఉరిశిక్ష విధించాలని , ఈ దారుణం వెనుకున్న ఇతర పెద్దలనూ బోనెక్కించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తాం
తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని కలవాలనుకుంటున్నట్టు మహిళా దినోత్సవం రోజున ఆర్‌జీ కర్ ఆస్పత్రి హత్యాచార బాధితురాలి తల్లి మీడియా ముఖంగా వెల్లడించారు. "నేను, నా భర్తతో పాటు ప్రధానమంత్రిని కలవాలనుకుంటున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం. మా అమ్మాయి పెద్ద కలలు కన్నది. ఆమె ఇలా చనిపోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఆమె మమ్మల్ని విడిచిపెట్టి ఏడు నెలలు అయ్యింది, కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. మా దగ్గర మరణ ధృవీకరణ పత్రం కూడా లేదు. ఒక మహిళా వైద్యురాలు తన కార్యాలయంలో సురక్షితంగా లేకపోతే, ఆమెకు భద్రత ఎక్కడ?" అని ఆమె ప్రశ్నించారు.
మార్చి 17న సుప్రీంకోర్టు విచారణ
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రి కేసును సర్వోన్నత న్యాయస్థానం సుమోటుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి విచారణ మార్చి 17న జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్‌లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది. ఆర్‌జీ కర్ ఆస్పత్రి కేసులో న్యాయం కోసం నినదిస్తూ దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన వైద్యులు, వైద్య నిపుణులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అంతకుముందు విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అత్యున్నత న్యాయస్థానం భరోసాతో వైద్యులు తమ విధులకు తిరిగొచ్చారు.
చదవండి: ముంబై ఆస్పత్రిలో క్షుద్రపూజల కలకలం
సీబీఐ దర్యాప్తు ఎలా సాగుతోంది?
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రి కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ కంటే ముందే కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్‌ను సమర్పించడానికి కేంద్ర ఏజెన్సీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. కోల్‌కతా పోలీసులు నిర్వహించిన దర్యాప్తు ప్రారంభ దశలో సాక్ష్యాలను తారుమారు చేయడం, మార్చడం వంటి సంఘటనలకు దారితీసిన ఈ భయంకరమైన నేరం వెనుక పెద్ద కుట్ర ఉండే అవకాశాలను సీబీఐ తన చార్జిషీట్‌లో తోసిపుచ్చలేదు. ఈ కేసులో సీబీఐ అధికారులు సంజయ్ రాయ్‌తో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మండల్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించారని.. సాక్ష్యాలను తారుమారు చేశారని సందీప్, అభిజిత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.