
లక్నో: లాఖీమ్‌పూర్ ఖేరీ ఘటనపై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బీజేపీపై తీవ్రసస్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని వారిపాలన త్వరలో అంతం కానుందని అన్నారు. లాఖీమ్‌పూర్ ఖేరీలో బీజేపీ కార్యకర్తలు వాహనాలతో రైతుల మీది నుంచి దూసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు పెంచి రైతులను ఇబ్బంది పెడుతున్న నకిలీ బాబా త్వరలో అధికారం కోల్పొతాడని పరోక్షంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, వారి పాలనలో అవినీతి పెరిగిందని మండిపడ్డారు. శాంతి భద్రతలను గాలికి వదిలేశారని, దీంతో నేరాలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు. 2022లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ.. పలు చిన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగనుందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.