
ముంబై : మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
అయితే, డిప్యూటీ సీఎంగా చేసిన ఏక్‌నాథ్ షిండే ప్రమాణం స్వీకారం చేసిన తీరుపై వేదికపై ఉన్న ప్రముఖుల ముఖాలు ఎర్రబారాయి. వెంటనే పక్కనే ఉన్న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. ‘షిండేజీ మీరు ఇలా ప్రమాణ స్వీకారం చేయకూడదని చెప్పడంతో.. మరోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Shiv Sena's Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw
— ANI (@ANI) December 5, 2024
అసలు ఏమైందంటే?
దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం అనంతరం ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వద్దకు వెళ్లారు. గవర్నర్ అను నేను.. ఆ తర్వాత ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయడం ప్రారంభించారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో మాతృభాషలో ఏక్‌నాథ్ షిండే అనే నేను .. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. అంటూ ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ అలా చేయలేదు.
బదులుగా ఏక్‌నాద్ షిండే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేను హిందూ హృదయ సామ్రాట్ అని ప్రస్తావించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి, మహరాష్ట్ర ప్రజలపై ప్రశంసలు కురిపిస్తూ ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. వెంటనే గవర్నర్ అప్రమత్తమయ్యారు. ప్రమాణ స్వీకారం రాజ్యాంగం ప్రకారం చేయాలంటూ ఏక్ నాథ్ షిండేను ఆపారు. దీంతో తాను ముందుగా సిద్ధం చేసుకున్న ప్రమాణ స్వీకార స్క్రిప్ట్‌ను పక్కన పెట్టి గవర్నర్ చెప్పినట్లుగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.