
సాక్షి, బెంగళూరు: సీఎం యడియూరప్ప నేడు శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. సీఎం మార్పు కోసమే హైకమాండ్ ఆయనను పిలిపించిందా? అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. తొలిరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అవుతారని తెలుస్తోంది. అపాయింట్‌మెంట్లు కుదరకపోతే శనివారం కూడా ఢిల్లీలోనే మకాం వేయవచ్చు. కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన, పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాలు జరగడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ కర్ణాటకపై పూర్తి దృష్టి సారించినట్లు కథనం. యడ్డి దిగిపోయేలా ఈసారి ఒప్పించవచ్చని ఆయన వ్యతిరేకులు ఆశాభావంతో ఉన్నారు. సీఎం పర్యటన గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఉదయం 11 గంటలకు వెళ్తారని తెలిసింది. రాష్ట్రమంత్రివర్గ ప్రక్షాళన గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ముగ్గురు, నలుగురికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదని వినికిడి.