
పుణే: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ (Billie Jean King Cup) ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టెన్నిస్ టోర్నమెంట్ కోసం భారత జట్టు సిద్ధమైంది. నేటి నుంచి ఐదు రోజులపాటు పుణే వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా భారత టెన్నిస్ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు.
తెలుగమ్మాయిలు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పాటు అంకితా రైనా, వైదేహి, ప్రార్థన తొంబారేలతో కూడిన మన జట్టు ముమ్మర సాధన చేస్తోంది. ఇటీవల ముంబై డబ్ల్యూటీఏ టోర్నమెంట్ సెమీఫైనల్‌కు చేరిన యువ సంచలనం మాయా రాజేశ్వరన్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైంది.
రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, హాంకాంగ్ జట్లు పాల్గొంటున్నాయి. గతేడాది మూడో స్థానంలో నిలవడం ద్వారా వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందలేకపోయిన భారత జట్టు ఈసారి ఆ అవాంతరాలను అధిగమించాలని పట్టుదలతో ఉంది.
‘ప్రస్తుతానికి మా లక్ష్యం ప్లేయర్లను శారీరకంగా, మానసికంగా తాజాగా ఉంచడమే. ఈ వారం చాలా ముఖ్యమైంది. ఫిట్‌గా ఉంటేనే కోర్ట్‌లో చురుగ్గా కదలగలరు’ అని భారత కెప్టెన్ విశాల్ ఉప్పల్ పేర్కొన్నాడు. టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డైరెక్టర్ సుందర్ అయ్యర్ పేర్కొన్నారు.
ప్రేక్షకులను ఉచితంగా అనుమతించనున్నట్లు వెల్లడించిన సుందర్ అయ్యర్... టోర్నీకి ‘సుహానా’ గ్రూప్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఐటా, ఐటీఎఫ్ మహారాష్ట్ర టెన్నిస్ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీని డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.