
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ బిడ్డ అనయా బంగర్ (Anaya Bangar) సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. తాను ఆర్యన్ (Aryan Bangar)గా ఉన్నపుడు క్రికెటర్లతో మంచి అనుబంధం ఉండేదని.. అయితే, అనయాగా మారిన తర్వాత కొంత మంది నిజస్వరూపాలు బయటపడ్డాయంటూ విస్మయకర విషయాలు వెల్లడించింది. సీనియర్ ఆటగాడు ఒకరు తనకు అండగా మాట్లాడినట్లు నటించి.. తనతో నిద్రించాలని ఉందంటూ అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.
అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్
కాగా టీమిండియా మాజీ కోచ్ అయిన సంజయ్ బంగర్- కశ్మీర దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరిలో ఆర్యన్ పెద్దవాడు. అతడు కూడా తండ్రి బాటలోనే క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయంతో దేశీ టోర్నీల్లో ఆడాడు. కానీ శరీర ధర్మానికి అనుగుణంగా తాను అబ్బాయిని కాదు.. అమ్మాయినని గుర్తించి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకున్నాడు.
తద్వారా అమ్మాయిగా మారిపోయిన ఆర్యన్.. అనయా బంగర్‌గా కొత్త పేరుతో ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అనయా యునైటెడ్ కింగ్‌డమ్‌లో జీవిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘లలన్‌టాప్’నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. క్రికెట్ ప్రపంచంలో ఎంతో మంది విషపూరితమైన మగాళ్లు ఉన్నారంటూ అనయా బంగర్ సంచలన విషయాలు వెల్లడించింది.
నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి
‘‘నాకు అప్పుడు ఎనిమిది- తొమ్మిదేళ్ల వయసు ఉంటుంది. మా అమ్మ కబోర్డ్‌లోని దుస్తులు తీసుకుని వేసుకునే వాడిని. అద్దంలో చూసుకుని మురిసిపోయేవాడిని. అప్పుడే నాకు.. ‘నేను అమ్మాయిని.. అమ్మాయిలాగే ఉండాలి’ అనే కోరిక కలిగింది.
దేశీ క్రికెట్లో నేను ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి ప్రసిద్ధ క్రికెటర్లతో ఆడాను. అప్పుడు నా శరీర ధర్మం గురించి బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడిని.
ఎందుకంటే.. నాన్నకు క్రికెటర్‌గా, టీమిండియా కోచ్‌గా గొప్ప పేరుంది. అందుకే నా విషయాన్ని దాచాల్సి వచ్చింది. క్రికెట్ ప్రపంచం మొత్తం అభద్రతాభావం, మగాళ్ల ఆధిపత్యంతో నిండిపోయింది.
దుస్తుల్లేకుండా ఫొటోలు పంపేవారు
నా గురించి తెలిసిన తర్వాత కొంత మంది మంచి మాటలు చెబుతూ అండగా నిలబడ్డారు. మరికొందరు మాత్రం వేధించారు. అప్పుడప్పుడు దుస్తుల్లేకుండా వారి ఫొటోలు నాకు పంపించేవారు.
ఓ వ్యక్తి అయితే అందరి ముందు నన్ను తిట్టేవాడు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి వ్యక్తిగత ఫొటోలు పంపమని అడిగేవాడు. ఇంకో సందర్భంలో ఓ వెటరన్ క్రికెటర్ తన బుద్ధిని బయటపెట్టాడు.
పద కార్లో కూర్చో.. నీతో కలిసి
నా పరిస్థితి గురించి అతడికి చెప్పగానే.. ‘పద కార్లో కూర్చో.. నీతో కలిసి నిద్రించాలని నాకు ఆశగా ఉంది’ అంటూ చెత్త మాటలు మాట్లాడాడు’’ అని అనయా బంగర్ తాను ఎదర్కొన్న చేదు అనుభవాల గురించి పంచుకుంది.
చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్