
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025 పోటీలు ఇవాళ (ఏప్రిల్ 9) మొదలయ్యాయి. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుంది. ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగగా.. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పాకిస్తాన్, వెస్టిండీస్‌పై స్కాట్లాండ్ విజయాలు సాధించాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన ఐర్లాండ్ 44 ఓవర్లలో 179 పరుగలకే కుప్పకూలింది. ఫలితంగా పాక్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రెండో మ్యాచ్‌లో పటిష్టమైన వెస్టిండీస్‌పై స్కాట్లాండ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 45 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటై లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ అజేయ శతకంతో (114) వీరోచితంగా పోరాడినప్పటికీ విండీస్ గెలవలేకపోయింది.
అంతకుముందు మాథ్యూస్ బౌలింగ్‌లోనూ రాణించింది. 10 ఓవర్లలో 56 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. ఈ ప్రదర్శనకు గానూ మ్యాచ్ ఓడిపోయినా మాథ్యూస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గత వరల్డ్‌కప్‌లో (2022) సెమీస్ వరకు చేరిన విండీస్ ఈసారి వరల్డ్‌కప్‌కు (2025) నేరుగా అర్హత సాధించలేకపోగా, క్వాలిఫయర్స్‌లోనూ పరాభవాన్ని ఎదుర్కొంది.
కాగా, ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్-2025లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్, థాయ్‌లాండ్ పోటీపడుతున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.