
Ind Vs Sa- Virat Kohli: కోహ్లి ప్రవర్తన సంతోషాన్నిచ్చింది... మాకు మేలు జరిగింది.. నిజానికి వాళ్లు: ఎల్గర్
India Vs Sa 3rd Test- Dean Elgar Comments: మూడో టెస్టులో తన డీఆర్‌ఎస్ కాల్ సందర్భంగా చోటుచేసుకున్న వివాదంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ స్పందించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి సహా క్రికెటర్లు వ్యవహరించిన తీరు తమకే ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నాడు. నిజానికి ఆ ఘటన జరగడం తనకు సంతోషాన్నిచ్చిందన్నాడు. కాగా కేప్‌టౌన్ టెస్టులో విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలు నీరుగారిపోయాయి.
ఇక ఆఖరి టెస్టు మూడో రోజు నుంచే సఫారీల చేతుల్లోకి వెళ్తున్న నేపథ్యంలో కోహ్లి బృందం మైదానంలో వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రొటిస్ సారథి డీన్ ఎల్గర్ డీఆర్‌ఎస్ కాల్‌తో తప్పించుకోవడంతో సహనం కోల్పోయిన కోహ్లి స్టంప్స్ మైకు వద్దకు వెళ్లి మాట్లాడటం విమర్శలకు తావిచ్చింది. క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైన ఈ విషయం గురించి ఎల్గర్ స్పందిస్తూ... ఒత్తిడిలో ఏం చేస్తున్నారో వాళ్లకు అర్థం కాలేదంటూ భారత జట్టు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ... ‘‘వాళ్లు(టీమిండియా) అనుకున్నట్లుగా ఆట సాగలేదు. తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అదే మాకు కలిసి వచ్చింది. భావోద్వేగాలకు లోనై అసలు ఆటను మర్చిపోయారు. అలా జరగడం నిజంగా మాకు కలిసి వచ్చింది. ఏదేమైనా ఆ ఘటన మాకు మేలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.
కాగా డీన్ ఎల్గర్‌కు డీఆర్‌ఎస్ కాల్ నేపథ్యంలో కోహ్లి స్టంప్స్ మైకు వద్దకు వెళ్లి... ‘‘ఎప్పుడూ మా పైనే దృష్టి పెట్టకండి. మీ వాళ్లపై కూడా కాస్త ఫోకస్ చేయండి’’అంటూ ప్రసారకర్తలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో క్రీడా ప్రముఖులు అతడి తీరును తప్పుపడుతున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అయితే ఏకంగా కోహ్లిపై నిషేధం విధించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు.
చదవండి: Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి! ఐసీసీకి ఇదే నా విజ్ఞప్తి
— Bleh (@rishabh2209420) January 13, 2022