
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం ఎలాంటి అనర్థాలకు దారి తీయకుండా సమసిపోయింది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు పాక్‌లోని కరాచీలో స్టేడియంలో భారత జెండా పెట్టకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ట్రోర్నీలో పాల్గొనే అన్ని జట్ల జాతీయ జెండాలను స్టేడియంలో ప్రదర్శించడం ఆనవాయతీ. అయితే, ఈ ఆనవాయితీని పాక్ క్రికెట్ బోర్డు తుంగలో తొక్కింది.
భారత్ మినహా మిగతా దేశాల జాతీయ జెండాలన్నిటినీ కరాచీ స్టేడియం పైకప్పుపై ఎగరేసింది. ఈ విషయం పెద్దది కావడంతో ఐసీసీ జోక్యం చేసుకుంది. దీంతో పీసీబీ దిగొచ్చింది. టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండాను ప్రదర్శించింది. ఈ విషయం తెలిసి భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ ప్రమేయం లేకపోతే పీసీబీ ఇష్టానుసారంగా వ్యవహరించేదని అంటున్నారు.
The Indian flag is present at National Bank Stadium Karachi ahead of the ICC Champions Trophy 2025.
Via - @imransiddique89
#ChampionsTrophy2025 pic.twitter.com/NUa8Gh837B— Ahmad Haseeb (@iamAhmadhaseeb) February 18, 2025
కాగా, ఇదే ఐసీసీ నిబంధనలను సాకుగా చూపుతూ పాక్ క్రికెట్ బోర్డు టీమిండియా జెర్సీలపై వారి దేశం పేరును ముద్రించుకుంది.
ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా మిగతా మ్యాచ్‌లకు పాక్ ఆతిథ్యం ఇస్తుంది. భద్రతా కారణాల రిత్యా భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది.
నేటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కు కరాచీలోని నేషనల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.
రేపు (ఫిబ్రవరి 20) జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 2న టీమిండియా న్యూజిలాండ్‌తో ఫైనల్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా