
పాకిస్తాన్‌తో మూడో వన్డేలోనూ న్యూజిలాండ్ (NZ vs PAK 3rd ODI) ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మౌంట్ మౌంగనూయ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్.. తొలుత బౌలింగ్ చేసింది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. నసీం షా (Naseem Shah) బౌలింగ్‌లో ఓపెనర్ నిక్ కెల్లీ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అయితే, మరో ఓపెనర్ రైస్ మరియూ , హెన్రీ నికోల్స్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
కెప్టెన్ ధనాధన్
రైస్ 61 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 పరుగులు చేయగా.. నికోల్స్ 40 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 31 రన్స్ రాబట్టాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన డారిల్ మిచెల్ (Daryl Mitchell) 53 బంతుల్లో 43 పరుగులతో అలరించగా.. టిమ్ సీఫర్ట్ (26) కూడా రాణించాడు. మిగతావాళ్లలో కెప్టెన్ మైకేల్ బ్రేస్‌వెల్ అర్ధ శతకం (40 బంతుల్లో 59) ఆకట్టుకున్నాడు.
కాగా అవుట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఈ మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించగా.. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 264 పరుగులు సాధించింది. పాక్ బౌలర్లలో ఆకిఫ్ జావేద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. నసీం షా రెండు, ఫాహిమ్ అష్రఫ్, సుఫియాన్ ముకీమ్ ఒక్కో వికెట్ తీశారు.
బాబర్ ఆజం ఎట్టకేలకు
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ మరోసారి నిరాశపరిచింది. 40 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అబ్దుల్లా షఫీక్ (56 బంతుల్లో 33) ఫర్వాలేదనిపించగా.. ఇమామ్ ఉల్ హక్ (1) పూర్తిగా విఫలమయ్యాడు.
బాబర్ ఆజం మాత్రం ఈసారి అర్ధ శతకంతో రాణించాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (37), తయ్యబ్ తాహిర్ (33) మాత్రమే ఓ మోస్తరుగా బ్యాటింగ్ చేయగా ఉస్మాన్ ఖాన్ (12), సల్మాన్ ఆఘా (11) నిరాశపరిచారు. నసీం షా 17 పరుగులు చేశాడు.
బెన్ సీర్స్ మరోసారి
కివీస్ బౌలర్లలో గత మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన బెన్ సీర్స్ మరోసారి ఫైఫర్ సాధించాడు. 9 ఓవర్ల బౌలింగ్‌లో 34 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మిగిలిన వాళ్లలో జేకబ్ డఫీ రెండు, మైకేల్ బ్రేస్‌వెల్, ముహమ్మద్ అబ్బాస్, డారిల్ మిచెల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
పరిపూర్ణ పరాజయం
కాగా మూడో వన్డేలో ఓటమితో పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్యటన పరిపూర్ణ పరాజయంతో ముగిసింది. నిజానికి కేన్ విలియమ్సన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర వంటి స్టార్లు లేకుండానే కివీస్ పాక్‌తో మ్యాచ్‌లు ఆడింది. అయినప్పటికీ పాకిస్తాన్ జట్టు మాత్రం ఆతిథ్య జట్టుపై ఏ దశలోనూ ఆధిపత్యం కనబరచలేకపోయింది.
ఇక అంతకు ముందు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ పాకిస్తాన్ కివీస్ చేతిలో 4-1తో ఓటమిపాలైంది. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సల్మాన్ ఆఘా, వన్డే సిరీస్‌లో మహ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. మరోవైపు.. రెగ్యులర్ సారథుల గైర్హాజరీలో కివీస్‌ను మైకేల్ బ్రేస్‌వెల్ ముందుండి నడిపించాడు.
న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మూడో వన్డే స్కోర్లు
👉న్యూజిలాండ్: 264/8 (42)
👉పాకిస్తాన్: 221 (40)
👉ఫలితం: 43 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ విజయం
చదవండి: హిట్టర్లు అవసరం.. అందుకే తిలక్‌ను వెనక్కి పంపించాం: హార్దిక్