
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం అత్యంత గడ్డు దశను ఎదుర్కొంటోంది. ఇంటా.. బయటా వరుస పరాజయాలు.. చెత్త ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటోంది. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో పాక్ తేలిపోయిన విషయం తెలిసిందే.
స్లో ఓవర్ రేటు
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సల్మాన్ ఆఘా కెప్టెన్సీలో కివీస్ చేతిలో 4-1తో సిరీస్ కోల్పోయిన పాక్ జట్టు.. ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. అంతేకాదు.. రెండు వన్డేల్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) ఆగ్రహానికి గురై.. జరిమానాల పాలైంది.
ఐదు శాతం మేర కోత
ఇక ఇటీవల ముగిసిన మూడో వన్డేలోనూ ఇదే తప్పును పునరావృతం చేయడంతో ఐసీసీ మరోసారి పాకిస్తాన్ జట్టుకు పనిష్మెంట్ ఇచ్చింది. జట్టు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో పర్యాటక జట్టు వరుసగా మూడోసారి ఇదే తప్పిదానికి పాల్పడింది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం మేర కోత విధిస్తున్నాం’’ అని పేర్కొంది. దీంతో కివీస్ దేశ పర్యటనలో వరుసగా మూడోసారి పాక్ జట్టుకు ఫైన్ పడింది.
కనీసం సెమీస్ కూడా చేరుకుండానే
కాగా వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్లలో కనీసం సెమీస్ కూడా చేరుకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా బాబర్ ఆజంను తప్పించి.. అతడి స్థానంలో రిజ్వాన్‌కు పగ్గాలు అప్పగించింది పాక్ బోర్డు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనలో వరుస వన్డే సిరీస్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చినట్లే కనబడింది.
వరుస ఓటములు
అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికాలతో త్రైపాక్షిక సిరీస్ కోల్పోయిన రిజ్వాన్ బృందం.. మెగా వన్డే టోర్నీలోనూ వైఫల్యం కొనసాగించింది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో వరుస ఓటములతో ఈ మేర పరాభవం పాలైంది.
ఈ క్రమంలో మార్చి 16- ఏప్రిల్ 5 వరకు న్యూజిలాండ్‌లో పర్యటించి ఐదు టీ20లు, మూడు వన్డేలు (మార్చి 29, ఏప్రిల్ 2, ఏప్రిల్ 5) ఆడి.. ఇక్కడా చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు, ఆటగాళ్ల తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టించారంటూ మండిపడుతున్నారు.
చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్