
చాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడని పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) అన్నాడు. తమ పాత్రలు ఏవైనా అందరి ప్రధాన లక్ష్యం మాత్రం టైటిల్ గెలవడమేనని తెలిపాడు. అదే విధంగా తమ ఓపెనింగ్ జోడీలోనూ ఎలాంటి మార్పులు చేయబోవడం లేదని రిజ్వాన్ పేర్కొన్నాడు.
కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) నిర్వహించగా నాడు పాకిస్తాన్ విజేతగా నిలిచింది. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో.. చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 19 నుంచి సొంతగడ్డపై మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో పాక్ జట్టు తొలుత న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా బాబర్ ఆజం(Babar Azam) ఓపెనర్‌గానే బరిలో దిగుతాడని స్పష్టం చేశాడు. కాగా వన్‌డౌన్‌లో వచ్చే బాబర్.. ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌తో త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఓపెనర్‌గా వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ విఫలమయ్యాడు.
ఓపెనర్‌గా ఆడిన మూడు మ్యాచ్‌లలో వరుసగా 10, 23, 29 పరుగులు చేశాడు. అంతకుముందు సౌతాఫ్రికా గడ్డపై సయీమ్ ఆయుబ్ స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్‌గా ప్రమోట్ అయిన బాబర్ అక్కడ కూడా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను ఓపెనర్‌గా ఆడించడంపై పునరాలోచన చేయాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు.
అతడు ఓపెనర్‌గానే వస్తాడు..
ఈ నేపథ్యంలో కెప్టెన్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే, కాంబినేషన్లకు అనుగుణంగానే తుదిజట్టు కూర్పు ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీలోనూ బాబర్ ఆజం ఓపెనర్‌గా కొనసాగుతాడు. తన బ్యాటింగ్ స్థానం పట్ల అతడు సంతృప్తిగానే ఉన్నాడు.
స్పెషలిస్టు ఓపెనర్లతోనే బరిలోకి దిగాలని మాకూ ఉంది. అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఒక్కోసారి సడలింపులు తప్పవు. అందుకే బాబర్ ఆజంను ఓపెనర్‌గా పంపాలనే నిర్ణయానికి వచ్చాం. ఫఖర్ జమాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. టెక్నికల్‌గా అతడు గొప్ప బ్యాటర్ అని అందరికీ తెలిసిందే.
అందరూ కెప్టెన్లే
ఇక ఈ టోర్నీలో నేను లేదంటే బాబర్ ఆజం మాత్రమే ముఖ్యంకాదు. ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్కరు కఠినంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్‌గా జట్టు సమిష్టి ప్రదర్శనతో వచ్చే గెలుపును ఆస్వాదిస్తా. అయితే, కొన్నిమ్యాచ్‌లలో వ్యక్తిగత ప్రదర్శనలే అధిక ప్రభావం చూపిస్తాయి.
ఏదేమైనా ప్రస్తుతం మా దృష్టి జట్టులోని పదిహేను మంది సభ్యులపై ఉంది. అందరూ కెప్టెన్లే. అయితే, వారికి ప్రతినిధిగా నేను టాస్ సమయంలో.. మీడియా సమావేశంలో ముందుకు వచ్చి మాట్లాడుతానంతే’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే ప్రపంచకప్-2023లో ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’లో అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఉన్నాయి.
చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment