
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో తాము అంచనాలు అందుకోలేకపోయామని పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) విచారం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై సత్తా చాటాలని భావిస్తే.. ఊహించని రీతిలో నిష్క్రమించడం నిరాశను కలిగించిందని పేర్కొన్నాడు. యువ ఆటగాడు సయీమ్ ఆయుబ్(Saim Ayub) గాయం కూడా తమ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిందని.. ఏదేమైనా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామని తెలిపాడు.
ఆతిథ్య జట్టు అట్టడుగున
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహణ అవకాశం... పెద్ద ఎత్తున హంగామా... డిఫెండింగ్ చాంపియన్‌గా అంచనాలు... కానీ పాకిస్తాన్ అభిమానులకు స్వదేశంలో కనీసం తమ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లు కూడా చూసే అవకాశం దక్కలేదు!
కరాచీలో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడి, ఆపై దుబాయ్‌లో భారత్ చేతిలో పరాజయంతో సెమీఫైనల్‌కు దూరమైన పాక్ టీమ్‌కు నామమాత్రపు మ్యాచ్ కూడా కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా రద్దయింది.
మూలిగే నక్కమీద తాటిపండు
ఎడతెరిపి లేకుండా సాగిన వాన కారణంగా టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ కథ ముగిసింది. ఫలితంగా పరువు కోసమైనా తమ ఫ్యాన్స్ కోసం ఈ మ్యాచ్‌లో బాగా ఆడాలనుకున్న పాక్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. రావల్పిండిలో రద్దైన రెండో మ్యాచ్ ఇది. అంతకుముందు మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో కూడా ఒక్క బంతి వేసే అవకాశమే రాలేదు.
ఇక పాక్- బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు తర్వాత గ్రూప్ ‘ఎ’లో ఇరు జట్ల ఖాతాలో ఒక్కో పాయింట్ చేరింది. అయితే పాకిస్తాన్ (–1.087) కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న బంగ్లాదేశ్ (–0.443) మూడో స్థానంతో ముగించగా, ఆతిథ్య జట్టు అట్టడుగున నిలిచింది!
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త ప్రదర్శనతో పరువు తీశారంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో కెప్టెన్ రిజ్వాన్ తమ ఓటములకు కారణాలను విశ్లేషించాడు.
‘‘మా దేశ ప్రజల కళ్లెదుట గొప్పగా ఆడాలని కోరుకున్నాం. మాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే, మేము అందుకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. పరాజయాలు మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచాయి.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, జింబాబ్వేలతో వన్డే సిరీస్‌లలో అదరగొట్టిన సయీమ్ ఆయుబ్ గాయం వల్ల ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఫఖర్ జమాన్ కూడా గాయపడటంతో జట్టు కూర్పులో అకస్మాత్తుగా మార్పులు చేయాల్సి వచ్చింది. ఇది జట్టు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది.
అక్కడ మేము గొప్పగా రాణిస్తాం
అయితే, కెప్టెన్‌గా నేను ఇలాంటి కారణాలు చెప్పకూడదు. ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయపడినా మేము బాగా ఆడాల్సింది. ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. అన్ని విభాగాల్లోనూ మెరుగుపడాల్సి ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో మేము ఎంతో ప్రొఫెషనల్‌గా ఆడాము. అయినా ఇంకా ఇంకా రాణించాల్సి ఉంది.
ఒక్కోసారి అనవసరపు తప్పిదాల వల్ల మూల్యం చెల్లించాం. తదుపరి మేము న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోతున్నాం. అక్కడ మేము గొప్పగా రాణిస్తామని ఆశిస్తున్నా. పాకిస్తాన్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో చేసిన తప్పులు అక్కడ పునరావృతం చేయబోము. కివీస్ గడ్డపై సత్తా చాటుతాం’’ అని 32 ఏళ్ల రిజ్వాన్ పేర్కొన్నాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత 5 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. మరోవైపు.. బంగ్లాదేశ్ 3 వన్డేలు, 3 టీ20ల కోసం జింబాబ్వేకు ఆతిథ్యం ఇస్తుంది.
చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు