
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ ఏడాది జూన్ 20 నుంచి భారత జట్టు తమ ఇంగ్లండ్ టూర్‌ను ప్రారంభించనుంది.
మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ మే మూడో వారంలో ప్రకటించనుంది. ఇక ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ టూర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడని తొలుత వార్తలు వినిపించాయి.
కానీ ఇప్పుడు రోహిత్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రోహిత్ శర్మ ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఇంగ్లండ్ సిరీస్ గురించి మాట్లాడాడు.
"ఇంగ్లండ్ పర్యటనకు స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంద శాతం ఫిట్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మా ప్లేయర్లు అందరూ ఫిట్‌గా ఉంటే ఇంగ్లండ్‌లో కచ్చితంగా పై చేయి సాధిస్తాము. అయితే ఇంగ్లండ్ నుంచి కూడా మాకు గట్టి సవాలు ఎదురు కానుంది. సిరీస్ గెలిచేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాము" అని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌లో రోహిత్ ఆడనున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు