
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి
మీర్‌పేట: విదేశీ యువతిపై లైంగికదాడి జరగడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె మీర్‌పేట మిథులానగర్‌లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న జర్మనీకి చెందిన యువతిని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఆసక్తి పెంచుకుని నెల రోజుల క్రితం యువతి దేశానికి వచి్చందన్నారు.
నెల రోజుల పాటు ఎన్నో జ్ఞాపకాలు తనవెంట తీసుకెళ్దామనుకునే లోపే ఇలాంటి చేదు అనుభవం కలిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి గంటకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలో ఆలయానికి వచి్చన వివాహితపై, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదని ఆరోపించారు. విదేశీ యువతి ఘటనలో ఫొటోలు, వీడియో రికార్డింగ్‌ల వంటి ఆధారాలు ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.
ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 22 శాతం నేరాలు పెరిగాయని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు, గృహహింసలు పెరిగిపోతుండడం ఆందోళనకరమన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట బీజేపీ నాయకులు అందెల శ్రీరాములు యాదవ్, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, గాజుల మధు, భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్, రవినాయక్, రాజు, నీలారవినాయక్ తదితరులు ఉన్నారు.