
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఐకేపీ కేంద్రాలకు చేరుతోంది. ఈ సమయంలో అకాల వర్షాలు తిప్పలు పెడుతున్నాయని తల్లడిల్లుతున్నారు. నిర్దేశిత తేమశాతం వచ్చేందుకు ఎండలో ఆరబోస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరం కావడంతో.. ధాన్యం పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. కొనుగోళ్లు త్వరగా ప్రారంభించాలని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక శివారులో రహదారిపైనే రైతులు ఇలా ధాన్యం ఆరబోస్తుండడంతో.. రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనచోదకులు వాపోతున్నారు – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
పాల్వంచ రూరల్: యాసంగి సీజన్‌లో వరి సాగు చేసిన కొందరు రైతుల పరిస్థితి మరీ దైన్యంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం, దంతలబోరు, సంగం, కారెగట్టు తదితర గ్రామాల రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు.. ఏటా ప్రభుత్వం సోములగూడెం శ్మశానవాటిక సమీపంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేది. ఈ ఏడాది కూడా అక్కడే ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతో రైతులు తమ ధాన్యాన్ని శ్మశానవాటికలోనే ఆరబోశారు.
పదిహేను రోజులు దాటినా ఇప్పటికీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు కాకపోగా.. ఇటీవల నిత్యం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు రాత్రిపూట ధాన్యం కుప్పచేసి, ఉదయం మళ్లీ ఆరబెడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.2,320 మద్దతు ధరతో పాటు బోనస్ రూ.500 లభిస్తాయనే ఆశతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడం లేదు.
అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతుందనే భయంతో 15 రోజులుగా రైతులు శ్మశానవాటికలో ధాన్యం రాశులపైనే నిద్రిస్తున్నారు. అయితే రాత్రి పూట అక్కడ పడుకోవాలంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని కోరుతున్నారు.