
నేటి గోదావరి బోర్డు 17వ సమావేశం ఎజెండాలో కీలకాంశం
ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ
ఇప్పటికే కేంద్రం, కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదు
గోదావరి బోర్డు కోరినా ప్రాజెక్టు వివరాలు ఇవ్వని ఏపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో కీలక చర్చ జరగనుంది. జీఆర్‌ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు 17వ సమావేశం జరగనుంది. తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్.. ఏపీ తరఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొని వాదనలు వినిపించనున్నారు.
గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలతో పాటు నాగార్జునసాగర్ నుంచి కృష్ణా వరద జలాలను తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించనున్న బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి వేస్తామని ఏపీ ప్రతిపాదించింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రూ.80 వేల కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను తరలిస్తామని ఏపీ చెబుతోంది.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గోదావరి, కృష్ణా బోర్డులతోపాటు కేంద్ర జల్‌శక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, ఇతర వివరాలివ్వాలని గోదావరి బోర్డు ఏపీకి లేఖ రాయగా ఇంతవరకు అందించలేదు. సోమవారం నాటి సమావేశంలో ఈ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. సాగర్ కుడికాల్వ సామర్థ్యం పెంచడం ద్వారా కృష్ణా వరద జలాలను బొల్లపల్లి రిజర్వాయర్‌కి తరలిస్తామని ఏపీ చేసిన ప్రతిపాదనతో సాగర్ కింద తెలంగాణలో ఉన్న ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ
గోదావరి పరీవాహకంలోని మొత్తం 16 ప్రాజెక్టుల నిర్వహణను గోదావరి బోర్డుకు అప్పగించాలని 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై సైతం గోదావరి బోర్డు సమావేశంలో చర్చ జరగనుంది. గోదావరిపై ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు మాత్రమే రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని, దానిని మినహా ఇతర ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని ఇప్పటికే తెలంగాణ తేల్చి చెప్పింది. తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులను అప్పగిస్తే తమ ప్రాజెక్టులు సైతం అప్పగిస్తామని ఏపీ మెలిక పెట్టింది.
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలోని 11 ప్రాజెక్టులు, ఏపీలోని 4 ప్రాజెక్టులు కలిపి గోదావరి బేసిన్‌లోని మొత్తం 15 అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతి పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియలో పురోగతిపై సైతం చర్చ జరగనుంది. తెలంగాణలోని 11 ప్రాజెక్టుల్లో తొమ్మిదింటికి సంబంధించిన 8 డీపీఆర్‌లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం సమర్పించగా, 6 ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు సైతం లభించాయి. అపెక్స్ కౌన్సిల్ అనుమతిస్తే పూర్తిస్థాయి అనుమతులు లభించినట్టే. ఏపీ ఇంతవరకు తమ ప్రాజెక్టుల డీపీఆర్‌లను అనుమతుల కోసం సమర్పించలేదు.