అమెరికాపై ఉత్తర కొరియా సంచలన ఆరోపణలు చేసింది. అసలు యుద్ధానికి నిప్పు పెట్టింది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేనని ఆరోపించింది. ఓ పక్క క్షిపణి పరీక్షకు సిద్ధమవుతూనే మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించింది. ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో రష్యా అధికారిక మీడియాతో మాట్లాడుతూ అమెరికాపై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా దేశ ప్రజల ప్రాణాలు రక్షించుకునేందుకే, శాంతిభద్రతలకోసమే మేం అణుప్రయోగాలు చేస్తున్నాం. అయితే ఐక్యరాజ్యసమితి వేదికగా ట్రంప్ పిచ్చిపట్టినట్లుగా ఉత్తర కొరియాపై వ్యాఖ్యలు చేశారు. మాపై యుద్ధానికి నిప్పు పెట్టింది ఆయనే. మేం కూడా ఆ యుద్ధానికి మాటలతో కాకుండా మంటలతో సమాధానం చెబుతాం. అమెరికా శక్తిసామర్థ్యాలతో సమంగా మేం సిద్ధమవుతున్నాం. మా లక్ష్యాలను చేరుకోవడంలో ఇదే చివరి దశ. మా అణ్వాయుధాల గురించి చర్చలు వస్తే వాటిపై మాట్లాడేందుకు మేం అంగీకరించం’ అని రి యాంగ్ హో అన్నారు.