Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSRCP Pulivendula Vontimitta AP HC Petitions hearing Updates1
ఎస్‌ఈసీ కల్పించుకుని రిగ్గింగ్‌ను అడ్డుకోవాల్సింది: హైకోర్టు

సాక్షి, అమరావతి: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్‌ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌బూత్‌ల్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారని.. పక్క నియోజకవర్గాల నుంచి మనుషులను రప్పించి రిగ్గింగ్‌ చేయించారని వైఎస్సార్‌సీపీ తరఫు లాయర్‌ వాదనలు వినిపించారు. అయితే విజేతను ప్రకటించాక కోర్టుల జోక్యం అనవసరమంటూ టీడీపీ తరఫు లాయర్‌ వాదించారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మరికాసేపట్లో ఆదేశాలు జారీ చేయనుంది.వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున లాయర్‌ వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఉప ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు. మొత్తం 15 పోలింగ్‌బూత్‌ల్లోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించలేదు. జమ్మలమడుగు నుంచి వాహనాల్లో వచ్చారు. ఆ వాహనాలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫొటోలు ఉన్నాయి. పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు క్యూ లైన్‌లో నిల్చిన ఓటేసిన ఫొటోలు ఉన్నాయి. ఓటర్లను భయభ్రంతాలకు గురి చేసి ఓట్లేశారు. కలెక్టర్‌ సమక్షంలో దొంగ ఓటు వేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఎన్నికలో జరుగుతున్న దౌర్జన్యాలను అదే రోజు ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నిలక సంఘం ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రిగ్గింగ్‌ జరుగుతున్నా పట్టించుకోలేదు. తమను అనుమతించలేదని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు అని వాదించారు. అయితే.. టీడీపీ తరఫు లాయర్‌ వాదిస్తూ.. ఎన్నిక సంబంధమైన వివాదాల్లో జోక్యం చేసుకునే హైహక్కు కోర్టుకు లేదు. ఇప్పటికే విజేతను ప్రకటించారు. కాబట్టి కోర్టుల జోక్యం అనవసరం అన్నారు. ఈ క్రమంలో.. పిటిషనర్ల తరఫున మాజీ ఏజీ శ్రీరామ్‌ వాదిస్తూ.. ఎన్నికల సంఘం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోవద్దనే నియమం ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేశారు. మోహిందర్‌ సింగ్‌ కేసులో కోర్టు రీపోలింగ్‌కు ఆదేశించింది. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు.. జోక్యం చసుకునే హక్కు హైకోర్టుకు ఉంది అని తెలిపారు. ఈ క్రమంలో జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ స్పందిస్తూ.. ఎస్‌ఈసీ కల్పించుకుని రిగ్గింగ్‌ను అడ్డుకోవాల్సిందని అన్నారు. అంతేకాదు.. ఇతర ప్రాంతాల వారు ఓట్లు వేస్తున్నట్లు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల అవకతవకల పిటిషన్‌ వాదనలు పూర్తి కావడంతో ఆదేశాలు మధ్యాహ్నాం తర్వాత జారీ చేస్తామని తెలిపారాయన. ‘‘పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడ్డారని, పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించి దొంగ ఓట్లు వేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీ పోలింగ్‌కు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తుమ్మల హేమంత్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

War 2 Movie Review And Rating In Telugu2
‘వార్‌ 2 ’మూవీ రివ్యూ

టైటిల్‌ : వార్‌ 2నటీనటులు: హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులునిర్మాణ సంస్థ: యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌నిర్మాత : ఆదిత్యా చోప్రాదర్శకత్వం: అయాన్‌ ముఖర్జీసంగీతం: ప్రీతమ్‌(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌)సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్విడుదల తేది: ఆగస్ట్‌ 14, 2025బాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్‌ ఫిలిం వార్‌ 2. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం కావడంతో టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్‌ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.వార్ 2 కథేంటంటే..కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్‌పై పడుతుంది. భారత్‌ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్‌లో చేరాలంటే.. తన గాడ్‌ ఫాదర్‌ లాంటి వ్యక్తి, కల్నల్‌ సునీల్‌ లూథ్రా(అశుతోష్‌ రాణా)ని చంపాలని కబీర్‌కు టాస్క్‌ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్‌ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్‌ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్‌ (అనిల్‌ కపూర్‌) ఓ స్పెషల్‌ టీమ్‌ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్‌ రావు సారంగ్‌ సూచనతో స్పెషల్‌ టీమ్‌కి మేజర్‌ విక్రమ్‌ చలపతి(ఎన్టీఆర్‌)ని లీడర్‌గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్‌ లూథ్రాని చంపిన కబీర్‌పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్‌ టీమ్‌లో చేరుతుంది. విక్రమ్‌ టీమ్‌ కబీర్‌ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్‌ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్‌కి, కబీర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్పై యాక్షన్‌ థ్రిల్లర్ అనగానే క‌ళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్‌కి వస్తాడు. వార్‌ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్‌ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్‌ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఎమోషనల్‌ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్‌ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్‌.. హృతిక్‌కి ఒక టాస్క్‌ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్‌ సునీల్‌ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఇక మేజర్‌ విక్రమ్‌గా ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్‌తో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఉంటుంది. కబీర్‌ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్‌ ఛేజింగ్‌ సీన్‌, మెట్రో ట్రైన్‌పై వచ్చే యాక్షన్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కు ముందు విమానంపై వచ్చే యాక్షన్‌ సీన్‌ సినిమాకే హైలెట్‌. స్పై యాక్షన్‌ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్‌ ప్రారంభంలో హృతిక్‌, ఎన్టీఆర్‌పై వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్‌, ఎన్టీఆర్‌ మధ్య వచ్చే యాక్షన్‌ సీన్‌ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్‌కు ఆల్రేడీ స్పై యాక్షన్‌ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్‌ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్‌ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్‌కి ఇది తొలి స్పై యాక్షన్‌ మూవీ. మేజర్‌ విక్రమ్‌గా అద్భుతంగా నటించాడు. యాక్షన్‌, డ్యాన్స్‌ విషయంలో హృతిక్‌తో పోటీ పడి యాక్ట్‌ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకే భారీ ఎలివేషన్‌, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్‌, హృతిక్‌ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్‌ సునీల్‌ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్‌స్పేస్‌ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్‌తో వచ్చే యాక్షన్‌ సీన్‌లో కియారా అదరగొట్టేసింది. అనిల్‌ కపూర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్‌ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Stray Dogs Row: Larger Supreme Court Bench Hearings Full Details3
వీధి కుక్కల తీర్పు వివాదం.. అత్యవసర స్టేకి నిరాకరణ

న్యూఢిల్లీ: రాజధాని రీజియన్‌లోని జనావాసాల నుంచి వీధికుక్కలను తొలగించాలనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలపై అత్యవసరంగా నిలుపుదల చేయాలని పిటిషనర్లు కోరగా.. అందుకు ధర్మాసనం తిరస్కరించింది.👉జంతు పరిపరక్షణ విభాగాల తరఫున సీనియర్‌ లాయర్‌ కపిల్ సిబాల్ వాదిస్తూ.. ‘‘వీధి కుక్కలను తరలించడానికి సరిపడా షెల్టర్‌ హోమ్స్‌ లేవు. అలాంటప్పుడు వాటిని ఎక్కడికి తరలిస్తారు? ఎక్కడ ఉంచుతారు?. పోనీ ఒకవేళ ఒకే దగ్గర అన్నేసి కుక్కలను ఉంచితే.. అవి తిండి కోసమో లేదంటే మరేయితర సందర్భాల్లో పరస్పరం దాడి చేసుకుంటాయి. అంతేకాదు.. ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇలా ఎలా చూసుకున్నా.. గతంలో ఇచ్చిన ఆదేశం అమలు చేయలేనిది. కాబట్టి ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయండి అని కోరారు. మరో సీనియర్‌ లాయర్‌ అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. ఆదేశాలు అమలు చేయడానికి అవసరమైన వసతులు లేవు. ఇదెలా ఉందంటే.. గుర్రానికి ముందు బండిని కట్టేసినట్లు ఉంది. అలాగని వీధికుక్కల దాడులు.. కుక్క కాటు ఘటనలు తీవ్రమైనవనే పిటిషనర్లు భావిస్తున్నారు. అలాగని పరిష్కారం హింసాత్మకంగా ఉండకూడదు’’ అని వాదించారు.👉ఢిల్లీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ‘‘జంతువులను ఎవరూ ద్వేషించడం లేదు. వీధికుక్కల దాడుల్లో ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం స్టెరిలైజేషన్‌ (సంతానరహిత క్రియ) అనేది రేబిస్‌ను ఆపదు. కిందటి ఏడాది 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదు అయ్యాయి. పిల్లలు స్వేచ్ఛగా వీధుల్లో ఆడలేని.. అమ్మాయిలు తిరగలేని పరిస్థితి. దీనిపై వివాదం కాదు.. సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మాంసాహారం తినేవారే జంతు ప్రేమికులమని ప్రకటించుకుంటున్నారు. ఇక్కడ కుక్కలను చంపాల్సిన అవసరం లేదు. వాటిని జనావాసాల నుంచి వేరు చేయడమే ఉద్దేశం’’ అని వాదించారు. 👉అయితే.. సుప్రీం కోర్టు ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు జనాల్లోకి చేరకముందే.. కొన్ని ప్రాంతాల్లో అధికారులు కుక్కలను పట్టుకోవడం పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే.. ‘‘పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, కానీ వాటిని అమలు చేయదు. Animal Birth Control (ABC) నిబంధనలు అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది’’ కోర్టు వ్యాఖ్యానించింది. ఓ మనుషులు పడుతున్న బాధ.. మరోవైపు జంతు ప్రేమికుల ఆందోళన.. ఈరెండింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో గత ఉత్తర్వులపై అత్యవసర స్టే అవసరమా? అనే అంశాన్ని పరిశీలిస్తామని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం చెబుతూ.. తీర్పును రిజర్వ్‌ చేసింది. ఆదేశం ఇలా..వీధి కుక్కల దాడులు, రేబిస్‌ బారినపడి పలువురు మరణించిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో.. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది. ఇందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల గడువును ఢిల్లీ ప్రభుత్వానికి విధించిన సుప్రీం కోర్టు.. అవి మళ్లీ జనావాసాల్లోకి వస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించింది. అదే సమయంలో శునకాల తరలింపును గనుక అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించిది కూడా. ఈ నేపథ్యంలో ఈ తీర్పు సమంజసం కాదంటూ జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. కొందరు(వీళ్లలో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు) సోషల్‌ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆదేశాలను పునఃపరిశీలిస్తానని హామీ ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌.. ఈ పిటిషన్‌ను ముగ్గురు జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.

YSRCP MP Avinash Reddy Serious Comments On TDP and Yellow Media4
‘వేసుకుందే దొంగ ఓట్లు.. ఉత్కంఠ ఎక్కడిది?’

సాక్షి, పులివెందుల: పులివెందుల ఎన్నికల విషయమై ఎల్లో మీడియా రాతలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్‌ జరిగితే ఎన్నికలపై ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో.. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు అనైతికం కాదా? అని ప్రశ్నలు సంధించారు.వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ తాజాగా మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈనాడు పత్రిక చూస్తే ఆ రాతలు ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉత్కంఠకు తెర అని ఈనాడు రాస్తే.. లోకేశ్ అయితే ప్రజాస్వామ్యం నిలబడింది అంటున్నాడు. పులివెందులలో దొంగ ఓటింగ్‌ జరిగిందని ప్రజలందరికీ తెలుసు. దొంగ ఓటింగ్‌ జరిగితే ఉత్కంఠ ఎలా అవుతుంది?. ఉత్కంఠకు తెర అని రాతలు రాసి నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. రిగ్గింగ్‌ జరిగితే ఉత్కంఠకు తెర ఎలా అవుతుంది?. తప్పుడు రాతలతో మరోసారి ఎల్లో మీడియా ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎవరిని నమ్మించడానికి ఇలాంటి రాతలు, స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు. అసలు పులివెందులలో ఓటింగ్‌ జరిగితే కదా.. ఇలాంటి రాతలు అనైతికం కాదా?. మీ పత్రిక అనైతిక రాతలు చూసి ఆత్మవిమర్శ చేసుకోండి.ఎవరి కోసం స్టేట్‌మెంట్స్‌.. అసలు పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఓటింగ్ జరిగి ఉంటే కదా మీరు ఇలాంటి రాతలు రాయాల్సింది?. వేసుకుందే దొంగ ఓట్లు.. దానికి మళ్లీ ప్రజాస్వామ్యం నిలబడింది అంటూ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం ఎందుకు?. ఇక్కడ జరిగింది పులివెందుల, కడప జిల్లా వాళ్లకు మాత్రమే తెలుసు. రాష్ట్రమంతా తెలియదు కాబట్టి ఎల్లో మీడియాలో ఇక్కడ అంతా సవ్యంగా జరిగినట్లు వార్తలు రాయించేసుకుంటున్నారు. మీ పత్రిక, చానల్ ఎంత అనైతికంగా ఇలాంటి వార్తలు రాస్తుందో మీరే ఒక సారి ఆత్మవిమర్శ చేసుకోండి. నిజమైన పోటీ జరిగి ఐదు ఓట్లతోనైనా టీడీపీ గెలిస్తే వారికి ఎనలేని తృప్తి ఉండేది.. మాకు బాధ ఉండేది. కానీ, ఈ విధంగా పోలీసుల సంపూర్ణ సహకారంతో వేలాది మంది టీడీపీ కార్యకర్తలను బూత్‌ల ఎదురుగా పెట్టి నిజమైన ఓటరు స్లిప్పులు లాక్కున్నారు.నిజమైన ఓటర్లు ఉన్నారా?నిజమైన ఓటరును అసలు పోలింగ్ బూత్‌లోకే పోనివ్వలేదు. దీన్ని ఎలక్షన్ అంటారా?.. ఇంకేమైనా అంటారా?. మీరు గెలిచామని మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే అవకాశమే లేదు. ప్రజలు ఓట్లు వేస్తే కదా.. మీరు గెలిచాం అని చెప్పుకోడానికి?. మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారు అని అనుకోరు.. ఎందుకంటే జరిగిందతా వారికి తెలుసు కాబట్టి. వారితో ఓట్లు వేయించలేదు కాబట్టి పులివెందుల మండల ఓటర్లు మీరు గెలిచారని అసలే అనుకోరు. ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను, ఓటర్లను బూత్‌లోకి రానివ్వకుండా చేసుకున్న పోలింగ్‌ను ఎలక్షన్ అంటారా?. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది.. అప్పుడు ఇలా దొంగ ఓట్లతో కాదు.. మనం ఎప్పుడు చేసే విధంగా నిజమైన ఓటింగ్‌తోనే వీళ్లకు గుణపాఠం చెబుదాం’ అని వ్యాఖ్యలు చేశారు.

Actor Darshan Bail Cancelled By Supreme Court5
దర్శన్‌కు సిగరెట్లు, మందు అందిస్తే ఊరుకునేది లేదు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: కన్నడ స్టార్‌ నటుడు దర్శన్ తూగుదీపకు భారీ షాక్‌ తగిలింది. కర్ణాటక హైకోర్టు ఆయనకు జారీ చేసిన బెయిల్‌ను సుప్రీం కోర్టు గురువారం రద్దు చేసింది. తక్షణమే ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని హత్య కేసులో అరెస్టైన దర్శన్‌.. ప్రస్తుతం బెయిల్‌ మీద ఉన్న సంగతి తెలిసిందే.‘‘మేము బెయిల్ మంజూరు, రద్దు ఈ రెండు అంశాలను పరిశీలించాం. హైకోర్టు ఉత్తర్వు యాంత్రికంగా అధికారాన్ని వినియోగించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ మంజూరు చేయడం విచారణపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు’’ అని బెయిల్‌ రద్దు చేస్తూ తీర్పు సందర్భంగా జస్టిస్‌ మహదేవన్‌ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుపై బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్‌ జేబీ పార్దీవాలా హర్షం వ్యక్తం చేశారు. ‘‘జే మహదేవన్‌ వర్ణించలేనంత గొప్ప తీర్పును ప్రకటించారు. నిందితులు ఎంతటి వాళ్లైనా.. చట్టానికి అతీతులేం కాదు అనే ఓ స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది’’ అని జస్టిస్‌ జేబీ పార్దీవాలా అన్నారు. ప్రస్తుతం దర్శన్‌ తమిళనాడులో ఉన్నట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీని ట్రయల్‌ కోర్టుకు అందించి.. ఆపై వారెంట్‌ ద్వారా దర్శన్‌ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర్పు సందర్భంగా ద్శిసభ్య ధర్మాసనం.. ‘‘బెయిల్ మంజూరు చేయడానికి చట్టపరమైన కారణం లేదు. దర్శన్‌కు బెయిల్‌ ద్వారా లభించిన స్వేచ్చ.. న్యాయ వ్యవస్థను దెబ్బతీయే ప్రమాదంలోని నెట్టింది’’ అని అభిప్రాయపడింది. ఈ క్రమంలో.. గతంలో జైలులో దర్శన్‌కు ప్రత్యేక వసతులు అందిన విషయాన్ని జస్టిస్‌ పార్దీవాలా ప్రస్తావించారు. ‘‘జైల్‌లో నిందితుడికి ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ట్రీట్‌మెంట్‌ అందిన విషయం మా దృష్టికి వచ్చింది. జైలు ప్రాంగణంలోనే నిందితుడు సిగరెట్లు, మందు తాగిన విషయం మాకు తెలిసింది. ఈ వ్యవహారంలో జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు’’ అని కర్ణాటక పోలీసు, జైళ్ల శాఖను జస్టిస్‌ పార్దీవాలా హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ చట్టం సమానంగా వర్తించాలి అని పునరుద్ఘాటిస్తూ.. దర్శన్‌పై ఉన్న ఆరోపణలు, అలాగే ఫోరెన్సిక్ ఆధారాలు.. బెయిల్ రద్దు చేయాల్సిన అవసరాన్ని బలపరిచాయని పేర్కొంది. ఈ విషయంలో మేము మా అసాధారణ అధికారాన్ని వినియోగించేందుకు సంతృప్తిగా ఉన్నాం అని కోర్టు ఉత్తర్వులో పేర్కొంది.కేసు నేపథ్యం.. పోలీసుల అభియోగాల ప్రకారం.. చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్‌లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్‌లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్‌లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్‌ అయ్యారు. ఆ సమయంలో వాళ్లకు అందిన వీఐపీ ట్రీట్‌మెంట్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శన్‌ను మరో జైలుకు మార్చారు. ఆపై వాళ్లు బెయిల్‌ మీద బయటకు వచ్చారు. 2024 డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏడుగురి బెయిల్‌ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. అయితే విచారణలో దర్శన్‌కు హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. తాజాగా సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కావడంతో దర్శన్ మళ్లీ అరెస్ట్ కానున్నాడు. కేసు టైమ్‌లైన్‌2024 జూన్‌ 8: రేణుకాస్వామి హత్య.. బెంగళూరులోని కామాక్షిపాళ్య ప్రాంతంలోని కాలువ ప్రాంతంలో దొరికిన మృతదేహాం2024 జూన్‌ 11: నటుడు దర్శన్‌ అరెస్ట్‌2024 జూన్: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. 2024 సెప్టెంబర్ 21: అనారోగ్య కారణంగా బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.2024 అక్టోబర్ 31: కర్ణాటక హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.2024 డిసెంబర్ 13: హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.2025 జనవరి 24: దర్శన్‌ బెయిల్‌ రద్దు కోరుతూ సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్‌2025 ఆగస్టు 14: దర్శన్‌ బెయిల్‌ రద్దు చేసిన సుప్రీం కోర్టు

I Pray India Refuse To Play Against Pakistan Says Pak Former Player Basit Ali6
టీమిండియా మాతో ఆడకపోవడమే మంచింది.. ఆ చావుదెబ్బను ఊహించలేము: పాక్‌ మాజీ

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఇటీవల The Game Plan అనే యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ 2025లో భారత్‌ తమతో ఆడకపోతేనే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ టోర్నీలో భారత్‌ తమతో మ్యాచ్‌లను ఎలాగైతే బాయ్‌కాట్‌ చేసిందో ఆసియా కప్‌లోనూ అలాగే చేస్తే బాగుంటుందని అన్నాడు.ఒకవేళ భారత్‌ ఆసియా కప్‌లో తమతో మ్యాచ్‌లు ఆడేందుకు ముందుకు వస్తే మాత్రం వారు కొట్టే చావుదెబ్బను ఊహించలేమని తెలిపాడు. ఇలా జరగకూడదని దేవుడిని ప్రార్దిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.బాసిత్‌ అలీ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్‌ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. బాసిత్‌ వ్యాఖ్యలపై పాక్‌ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తుంది. మరోవైపు భారత అభిమానులు మాత్రం బాసిత్‌ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాడంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పాక్‌ విండీస్‌ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత బాసిత్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. విండీస్‌తో జరిగిన చివరి వన్డేలో పాక్‌ 92 పరుగులకే ఆలౌటై, 202 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో పాక్‌ విండీస్‌కు 35 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను కోల్పోయింది.ఈ ఓటమి తర్వాత బాసిత్ అలీ పాక్‌ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి జట్టుతో భారత్‌ లాంటి పటిష్ట జట్టును ఎప్పుడు ఓడించాలంటూ కామెంట్లు చేశాడు.కాగా, యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్‌-2025లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరిన్ని మ్యాచ్‌లు జరిగే ఆస్కారం​ కూడా ఉంది. దీనికి ముందు పాక్‌తో ఆడేందుకు భారత ప్రభుత్వం సమ్మతించాలి. పాక్‌తో ఆడే విషయమై భారత క్రీడాభిమానులు, క్రికెట్‌ విశ్లేషకులు, మాజీలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు క్రికెట్‌ వేరు, దేశ సమస్య వేరని అంటుంటే.. మరికొందరు మాత్రం నీచ బుద్ది ఉన్న పాక్‌తో క్రికెటే కాకుండా ఏ ఆట ఆడకూడదని భీష్మించుకూర్చున్నారు.

Supreme Court Evms recounting of votes to alter Sarpanch election results7
ఈవీఎం గోల్‌మాల్‌ రివీల్‌.. సుప్రీంకోర్టులో రీకౌంటింగ్‌.. ఓడిన అభ్యర్థి గెలుపు

ఈవీఎంల పనితీరుపై గత లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్‌ సమయంలోనూ తీవ్ర చర్చ నడిచింది. ఈవీఎంలను హ్యాక్‌ చేయొచ్చంటూ ప్రపంచ అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం చూశాం. ఏపీలో ఎన్డీయే కూటమిది ఈవీఎంల గెలుపేనంటూ చెబుతున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. చాలా దేశాలు ఈవీఎంల నుంచి బ్యాలెట్‌ పేపర్ల వైపు మళ్లడాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం చూశాం. ఈ క్రమంలో.. ఈవీఎంల గుట్టురట్టు అయిన ఘటన ఒకటి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఓట్‌ చోరీ వ్యవహారం వార్తల్లోకెక్కిన వేళ.. హర్యానాలోని ఓ కుగ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమవుతోంది. కొన్నేళ్ల క్రితం ఆ గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలూ వచ్చాయి. కానీ.. ఓడిపోయిన వ్యక్తి వేసిన కేసు.. న్యాయస్థానాల్లో నలిగి చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం అసాధారణ రీతిలో సర్పంచ్‌ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను తెప్పించుకుంది. ఓట్ల లెక్కింపు మరోసారి జరిపించింది. ఆశ్చర్యకరంగా.. అప్పుడు ఓడిన వ్యక్తి.. ఇప్పుడు సుప్రీంకోర్టులో గెలిచాడు! ఈ నాటకీయ పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.జరిగింది ఇదీ..హర్యానాలోని బవునా లఖూ.. ఓ చిన్న గ్రామం. 2022 నవంబరులో ఇక్కడ సర్పంచ్‌ ఎన్నికలు జరిగాయి. ఈవీఎంల ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో కులదీప్‌ సింగ్‌ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, మోహిత్‌ సింగ్‌ అనే అభ్యర్థి ఈ ఫలితాలను సవాల్‌ చేశాడు. ఎన్నికల ట్రైబ్యునల్‌ బూత్‌ నెంబరు-69లో రీపోలింగ్‌ నిర్వహించారు. కానీ.. హర్యానా హైకోర్టు ఈ ఆదేశాలను రద్దు చేసింది. దీంతో మోహిత్‌ కుమార్‌ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. కేసు విచారించిన సుప్రీంకోర్టు గత నెల 31న గ్రామంలోని ఒక పోలింగ్‌ బూత్‌ కాకుండా 65 నుంచి 70వ నెంబరు బూత్‌లన్నింటిలోని ఓట్లను మళ్లీ లెక్కపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.Vote Theft Claims via EVMs in India: Haryana CaseAllegations of #votechori (vote theft) via Electronic Voting Machines (EVMs) resurfaced after a 2022 sarpanch election in Buana village, Panipat, Haryana. Initially, Kuldeep Singh won with 1,000 votes, but Mohit Kumar’s challenge… pic.twitter.com/tp7m65v7Wk— Adv. Avtaar S Turka / अवतार तुरका 🇮🇳 (@AvtaarTurka) August 14, 2025ఈ రీకౌంటింగ్‌ కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో ఆగస్టు ఆరో తేదీన ఇరుపక్షాల సమక్షంలో జరిగింది. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. రీకౌంటింగ్‌ ఫలితాలు ఎలా ఉన్నాయంటే.. 2022లో గెలిచిన కుల్‌దీప్‌ సింగ్‌కు 1000 ఓట్లు దక్కితే.. ఓడిన మోహిత్‌ సింగ్‌కు 1051 ఓట్లు వచ్చాయి. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ ఈ ఫలితాలను ధ్రువీకరించి నివేదిక సమర్పించడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 11న మోహిత్‌ కుమార్‌ను విజేతగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లోగా ఈ ఫలితాన్ని నోటిఫై చేయాల్సిందిగా కూడా స్పష్టం చేసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చునని, రీకౌంటింగ్‌ ఫలితాలు మాత్రం మారవని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. ఈవీఎంల విషయంలో దేశంలో పలు రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడం పలు అనుమానాలకు తావిచ్చింది ఫలితాలు వెలువడినప్పటి నుంచే వైఎస్సార్‌సీపీ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈవీఎంలకు బదులు బాలెట్‌ పేపర్లను ఎన్నికల్లో తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. ఈవీఎంలపై అనుమానాలతో ఒంగోలు ఓట్ల గోల్‌మాల్‌ వ్యవహారంపై ఆయన కోర్టును సైతం ఆశ్రయించారు. అంతెకాదు.. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ప్రస్తావించిన అంశం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పోలింగ్‌ రోజు, కౌంటింగ్‌ రోజుకు మధ్య ఓట్ల శాతంలో తేడాను, భారీ ఓట్ల చోరీని(48 లక్షల ఓట్లు) ఆయన ప్రస్తావించారు. ఓట్ల చోరీపై పోరాటం అంటున్న రాహుల్‌ గాంధీ.. ఏపీ ఫలితాలపై ఎందుకు మాట్లాడరంటూ సూటిగా ప్రశ్నించారు.

Kommineni Srinivasa Rao Comments On Free Bus Scheme8
ఉచిత బస్సు ప్రయాణానికీ ఎగనామాలే!

2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి రావడమే తరువాయి.. ‘‘మీ ఇష్టం ...మీరు ఎక్కడకు కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు’’ అని ఇద్దరూ తెగ ఊరించారు. ఇంకో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘‘ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న చెప్పాడని బస్ కండక్టర్‌కు తెలపండి.. నేను సేఫ్ డ్రైవర్‌ని’’ పదే పదే చెప్పారు కూడా. ఈ హామీకి సంబంధించిన ప్రచారం కోసం తయారు చేసిన ప్రకటనల్లో ‘‘మహిళలు ఏపీలోని ఏ పుణ్యక్షేత్రానైన్నా ఉచితంగా దర్శించి రావచ్చు’’ అని ఉండేది. ఒక యాడ్ ఎలా ఉందంటే... ‘‘టీ కూడా పెట్టకుండా బిజీగా రాసుకుంటున్నావు..’’ అని భర్త తన భార్యను ప్రశ్నిస్తాడు..‘‘మొక్కులు తీర్చుకోవడానికి యాత్రలకు గాను పుణ్యక్షేత్రాల జాబితా తయారు చేస్తున్నా’’.. అని భార్య జవాబు.. ‘‘అసలే ఖర్చులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఎలా’’ అని భర్త ప్రశ్న.. ‘‘మనం ఒక పనిచేస్తే సగం ఖర్చు తగ్గించుకోవచ్చు’’ అని భార్య సమాధానం..‘‘జనసేనకు ఓటు వేస్తే ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు. దాంతో సగం ఖర్చు తగ్గిపోతుంది’’ అని భార్య వివరణరిప్లై.. ఇక అంతే కూటమికి ఓటు వేస్తే ఫ్రీబస్ అంటూ ఊదరగొట్టేశారు..అధికారం అయితే వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 14 నెలల వరకు అందుబాటులోకి రాలేదు. ఆడబిడ్డ నిధితోసహా పలు స్కీములు అమలు చేయకుండా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ముఖ్యంగా మహిళలలో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో, దాన్ని ఎంతో కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో ఇచ్చిన హామీలలో కొన్ని అయినా, కొంత మేర అయినా అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని వీటిని అరకొరగా చేస్తుండడంతో ప్రజలలో వ్యతిరేకత పెద్దగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ జనసేనలు తమను మోసం చేశాయని మహిళలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పేరుకే తప్ప పెద్దగా ప్రయోజనం లేకుండా అమలు చేయ సంకల్పించారని విమర్శిస్తున్నారు. దానికి కారణం ఆడవారు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు రకరకాల షరతులు పెట్టడమే. ఉచిత బస్ స్కీమ్‌పై కూటమి మంత్రులు ఇంతకాలం పలురకాల పిల్లి మొగ్గలు వేశారు. జిల్లాల వరకే ఉచితం అని ఒకసారి, ఉమ్మడి జిల్లాలలో ప్రయాణాలకు అనుమతిస్తామని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణాలు ఉంటాయని అన్నప్పుడు అంతా నవ్వుకున్నారు. యథా ప్రకారం మరో మోసం చేశారని విమర్శించారు. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల ఒత్తిడి ఉండనే ఉంది. కడప నుంచి అమరావతి ఎప్పుడు ఉచిత బస్‌లలో వెళదామని స్త్రీలు ఎదురు చూస్తున్నారని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేసి రాష్ట్రమంతా పర్యటించవచ్చంటూ చెబుతూనే లిటిగేషన్ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుకునేలానే చెప్పేవారు. తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం.. ఏ గుడికి అయినా, ఎంత దూరం అయినా హాపీగా వెళ్లి రావచ్చనుకున్న ఆడవాళ్ల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటే ఐదింటిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారట. దాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలోనే ఫ్రీ. ఇవేవి దూర ప్రాంతాలకు వెళ్లేవి కావు. ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అనుమతించినా, అవి సరిపడా ఉండవు. పైగా వీటిలో చాలా బస్సులు నాన్‌స్టాప్‌లుగా మార్చారు. అన్ని కలిపి 8458 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని టీడీపీ మీడియా మహిళలను మభ్య పెట్టాలని యత్నించింది. ఈ లెక్కలు కూడా కావాలని పెంచి చెప్పినవే. ఏ మహిళైనా విశాఖ నుంచి తిరుపతికి వెళ్లాలంటే పది బస్సులు మారి వెళ్లాల్సి వస్తుందని, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లక్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైన్, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీల్లేదు. నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోకాని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో కాని టిక్కెట్ తీసుకోవల్సిందే. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే స్త్రీలు టిక్కెట్లు తీసుకోవల్సిందే అన్నమాట. మహిళలు హైదరాబాద్ వెళ్లాలన్నా బస్సులు మారుతూ గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏపీ సరిహద్దు వరకే ఉచితం కనుక, ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని మరో బస్సు ఎక్కాలన్నమాట. అమరావతి బస్సుల్లో కాని, ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడిపేవాటిల్లోనూ ఉచిత ప్రయాణం అవకాశం లేదు. నాన్‌స్టాప్ బస్సులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ఉంటాయి. వాటిలో ఎక్కడానికి వీలు లేదు. ఉదాహరణకు విజయవాడ-గుంటూరు మధ్య ప్రతి పావుగంటకు నాన్‌స్టాప్ బస్సులు ఉంటాయి. అలాగే విశాఖ- శ్రీకాకుళం, తిరుపతి-కడప, నెల్లూరు-ఒంగోలు ,విజయవాడ-ఏలూరు, కాకినాడ- రాజమండ్రి, అనంతపురం-కర్నూలు, నంద్యాల-కర్నూలు ఇలా వివిధ పట్టణాల మధ్య పెద్ద సంఖ్యలో నాన్‌స్టాప్ బస్సులు ఉంటాయి. ఇవి ఉచిత పథకంలో భాగం కాదు. తిరుమల, పాడేరు, శ్రీశైలం ఘాట్ రోడ్డులలో కూడా టిక్కెట్ కొనాల్సిందేనట. అలాంటప్పుడు పుణ్య క్షేత్రాలకు ఉచితంగా వెళ్లడం ఎలా సాధ్యం. చివరికి గిరిజనులు అధికంగా ప్రయాణించే పాడేరు ఘాట్ రోడ్డులో కూడా ఈ స్కీమ్ ఉండదట. అంటే ప్రజలను మభ్య పెట్టడానికే ఎన్నికల సమయంలో అన్నీ ఫ్రీ అని అబద్దపు ప్రచారం చేశారన్నమాట. అప్పుడేమో ఎలాంటి షరతులు పెట్టకుండా నమ్మబలికి , ఇప్పుడేమో అన్నీ కండిషన్స్ పెడతారా అని మహిళలను మండిపడుతున్నారు. ఇంకో విషయం చెప్పాలి. ఎల్లో మీడియాలో మే నెల18 న రాసిన ఒక స్టోరీలో ఉచిత స్కీమ్ అమలుకు ఏపీ ప్రభుత్వంపై రూ.3182 కోట్ల భారం పడుతుందని లెక్కవేశారు. అదే మీడియా ఆగస్టు 10న రాసిన ఒక కథనంలో ఏడాదికి ఈ స్కీమ్ కింద భారం రూ.1942 కోట్లు అవుతుందని అంచనా వేశారని తెలిపారు. అంటే దాదాపు 1200 కోట్ల మేర భారం తగ్గించారంటే ఆ మేరకు ఉచిత బస్ ప్రయాణ సర్వీసులలో కోత పెట్టినట్లే. నిజానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ స్కీమును అమలు చేశారు. ఆ పథకం అమలులో ఆ రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో నెలకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్నదని అంచనా. ఏపీలో కూడా తొలుత సుమారు రూ.250 కోట్ల వ్యయం అంచనా వేసినా, ఆ తర్వాత దానికి కోత పెట్టుకుంటూ స్కీమ్‌ను నామమాత్రం చేశారా అన్న సంశయం కలుగుతుంది. తెలంగాణలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులను రీయింబర్స్ చేయడం లేదు. దాంతో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. నిధుల కొరత కారణంగా తెలంగాణలో గౌలిగూడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోందని ఒక వార్త వచ్చింది. ఏపీలో గత జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా మార్చినందున కొంత భారం తగ్గుతుంది. అయినా స్కీమ్ అమలులో తీవ్ర జాప్యం చేశారు. ఇది ఇలా ఉండగా, ఉచిత బస్ స్కీమ్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆటోలు, టాక్సీల వారు వాపోతున్నారు.స్వయంఉపాధి కింద వేలాది మంది బతుకుతున్న వారికి ఇది ఒక గండంగా మారుతుంది. ఫ్రీ బస్ స్కీమ్ హామీ వల్ల ఆటోలవారు నష్టపోకుండా వారికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, రుణ సదుపాయం, రాయితీల కల్పన వంటివి చేస్తామని హామీ ఇచ్చినా, ఇంతవరకు అవి అమలు కావడం లేదు. దాంతో ఆటో యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు గురి అవుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మొత్తమ్మీద చూస్తే విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాలలో సిటీ బస్సుల్లో తిరిగే మహిళలకే కాస్త ఉపయోగం.అదేమీ పెద్ద ఖర్చు కాదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానానికి, ఆచరణలో అమలు చేస్తున్నదానికి చాలా తేడా ఉందన్నమాట.ఉచిత బస్ స్కీమ్ వల్ల వేల రూపాయలు ఆదా అవుతాయని చేసిన ప్రచారం అంతా ఉత్తదే అన్నమాట. పుణ్య క్షేత్రాలన్నీ తిరిగేసి మొక్కులు తీర్చుకోవాలనుకున్న ఏపీ మహిళలు, కనీసం టీడీపీ, జనసేనలకు మద్దతు ఇచ్చిన వనితలకు ఇది పెద్ద నిరాశ మిగుల్చుతుందని భావించవచ్చు. ఇదన్నమాట! స్త్రీ శక్తి పేరుతో అమలు చేయతలపెట్టిన ఉచిత బస్‌ ప్రయాణం పథకం అసలు రంగు.

IndiGo Restart China Operations as Bilateral Air Talks Progress9
అనుమతిస్తే పునప్రారంభానికి సిద్ధం: ఇండిగో

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరిన వెంటనే చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇండిగో సిద్ధమవుతోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పీటర్ ఎల్బర్స్ తెలిపారు. కొవిడ్-19 పరిణామాల కారణంగా 2020 ప్రారంభంలో నిలిపివేసిన చైనా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆంక్షలకు ముందు ఈ సంస్థ న్యూఢిల్లీ నుంచి చెంగ్డూ, కోల్‌కతా-గ్వాంగ్ జౌ మధ్య రోజువారీ సర్వీసులను నడిపేది.ద్వైపాక్షిక ఒప్పందంపై ఆశలు..ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పునరుద్ధరించడానికి భారత్, చైనాలు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, అధికారిక అనుమతులు ఇంకా ఖరారు కాలేదు. ప్రత్యక్ష సేవలను తిరిగి ప్రారంభించేందుకు మార్గాలను అన్వేషించడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. కొవిడ్‌-19కు ముందు తాము చైనాకు విమానాలు నడిపేవారమని, ప్రభుత్వం ఒక ఒప్పందానికి వస్తే వాటిని పునప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్బర్స్ చెప్పారు. 2020 ప్రారంభం నుంచి భారతదేశం-చైనా మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ లేదు. ఆ ఏడాది చివర్లో లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇది దౌత్య, ఆర్థిక సంబంధాలపై ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం భారతదేశం-హాంకాంగ్ మధ్య విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుంచి చైనాకు వెళ్లాల్సి ఉంటుంది.ప్రధాన సమస్యప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో భారత విమానయాన సంస్థలపై చైనా విధించిన విమాన ఛార్జీల నిబంధనల అంశం ప్రాధానమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఛార్జీలను నిర్ణయించడానికి విమానయాన సంస్థలకు అనుమతిస్తూ, అధిక ధరల స్వేచ్ఛ కోసం భారత్‌ ఒత్తిడి తెస్తోంది. చైనాలో తమ గత నిర్వహణ అనుభవాలపై భారత ప్రభుత్వం విమానయాన సంస్థల నుంచి ఫీడ్‌బ్యాక్‌ కోరిందని సీనియర్ అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: మరో టాప్‌ కంపెనీలో లేఆఫ్స్‌ పర్వంఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరితే భారత విమానయాన మార్కెట్లోకి చైనీస్ చౌక ధరల విమానయాన సంస్థల ప్రవేశానికి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుంది. ఇది ద్వైపాక్షిక పర్యాటకం, వ్యాపార ప్రయాణాన్ని పెంచే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ఐదేళ్ల విరామం తర్వాత ఇటీవల చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలు జారీ చేసే ప్రక్రియను తిరిగి ప్రారంభించింది.

Krishna Janmashtami 2025 check these imp temples10
ఆలయ గోపాలుడు : నమ్మితే.. పెళ్లి.. సంతానం!

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సాక్షాత్తూ ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడిగా ఈ భూమిపై ఉద్భవించిన పర్వదినం కృష్ణాష్టమి. ఈ శనివారం కృష్ణాష్టమి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్న కొన్ని వేణుగోపాల స్వామి ఆలయాల గురించి సంక్షిప్తంగా... ముందుగా హైదరాబాద్‌ పరిసరాలలోని ఆలయాల గురించి... శ్యాం మందిరం – కాచిగూడ, హైదరాబాద్‌హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్‌కి సమీపంలో గల శ్రీ కృష్ణమందిరానికే శ్యాం మందిర్‌ అని పేరు. ఈ మందిరం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నిత్యం స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.గోవర్ధనగిరి – కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్‌హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలో మలేసియాన్‌ టౌన్‌షిప్‌కి వ్యతిరేక దిశలో కొలువైన వేణుగో΄ాల స్వామి దేవాలయం ఒక గుట్ట పైన వెలసినది. గుట్టపైన స్వామి వారి విగ్రహం దొరకగా అక్కడే గుడి కట్టించారు. ఈ ప్రదేశాన్ని గోవర్ధనగిరి అని పిలుస్తారు.. ప్రతి నిత్యం స్వామి వారికి విశేషమైన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. పండుగలప్పుడు, కృష్ణాష్టమికి చాలా విశేషంగా ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గుట్ట పైన వెలసి ఉండడం వలన ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది.శ్రీ కృష్ణ దేవాలయం – బహుదూర్‌ పురా150 సంవత్సరాల పూర్వం ఈ దేవాలయాన్ని నిర్మించారు. నెహ్రు జంతు ప్రదర్శన శాలకు దగ్గరలో ఉన్న ఈ దేవాలయాన్ని కిషన్‌ బాగ్‌ దేవాలయం అని కూడా అంటారు. నిజాం దగ్గర వకీల్‌గా పని చేసిన రాజా రాం బహుదూర్‌ ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఇక్కడ ఘనంగా పూజ కార్యక్రమాలు, రథ యాత్ర నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయంలో వెలసిన వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని కూడా పిలుస్తారు. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి సంతానం కోసం స్వామిని సేవించుకుంటారు. రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం – ఏదులాబాద్‌సికింద్రాబాద్‌కి సుమారు 30 కి.మీ. దూరంలో ఘటకేసర్‌ మండల కేంద్రానికి 5 కి.మీ. దూరంలో ఏదులాబాద్‌ గ్రామంలో వెలసిన క్షేత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం. శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం ఎంతో శక్తిమంతమైన ప్రాచీన క్షేత్రం. అందమైన రాజ గోపురం, ఆ గోపురం పైన రక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అద్భుతమైన కట్టడాలు, చక్కని శిల్పకళా సంపదతో ఎంతో రమణీయంగా ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రాకారం ఇక్కడ పూజాకార్యక్రమాలు జరుగుతాయి.శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దేవాలయం – రామడుగుకరీంనగర్‌ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సుమారు 1200 వందల సంవత్సరాల పూర్వమే శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి 8 మంది భార్యలు మనకు దర్శనమిస్తారు. ఈ స్వామికి కూడా కల్యాణ వేణుగోపాలుడనీ, సంతాన వేణుగోపాలుడనీ పేరు. సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం, చీనూర్‌ గ్రామం, కామారెడ్డి జిల్లాఈ దేవాలయంలో వెలసిన వేణుగోపాలస్వామి సంతాన వేణు గోపాల స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. ఎవరైతే ఈ క్షేత్రంలో స్వామి వారిని మనసా వాచా నమ్మి పూజిస్తారో వాళ్ళకి ఆ స్వామివారు మంచి సంతానాన్ని ప్రసాదిస్తారని ప్రతీతి. ఈ ఆలయంలో వెలసిన మరో సుందర విగ్రహం శ్రీ సుదర్శన పెరుమాళ్‌ వారిది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ స్వామికి అభిషేకం, హోమం వంటి దివ్యమైన పూజలు జరిపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్య అయిన తొలగి పోతుందనీ, శత్రునాశనం జరుగుతందనీ నమ్మకం!జగన్నాథ స్వామి దేవాలయం– చెన్నూర్‌చెన్నూర్‌లో పూజలందుకుంటున్న అతి పురాతన జగన్నాథ స్వామి దేవాలయం ఇది. ఇక్కడ ప్రవహించే గోదావరిని ఉత్తరవాహిని అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం. ఇది. గోదావరి నది పుట్టిన చోట నుంచి సముద్రంలో కలిసే వరకు ఎక్కడ లేని ప్రత్యేకత ఈ ్ర΄ాంతంలో ఉంటుంది.ఆంధ్రప్రదేశ్‌లో... మొవ్వ వేణుగోపాల స్వామి ఆలయంకృష్ణాజిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది. ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు! ఆ స్వామి మహాత్మ్యమూ సామాన్యమైనది కాదు! వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. స్వామి వెనుక వున్న మకరతోరణంపై దశావతారాలు ఉన్నాయి. స్వామి పక్కన రుక్మిణీ సత్యభామలు దర్శనమిస్తారు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది. ఆ కారణంగా 2000 సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అయినా ఇప్పటికీపాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు.ఆలయ ప్రాంణంలో ఆంజనేయస్వామివారి ఉపాలయం కూడా ఉంది. మువ్వ పేరు వినగానే వేణుగోపాలస్వామి ఆలయమే కాదు, ఆ స్వామి మహత్తుతో అద్భుతమైన పదాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తుకు వస్తాడు. మొవ్వ వేణుగోపాలుడిని దర్శిస్తే ఎవరి జీవితమైనా తరించిపోతుందని చెప్పేందుకు క్షేత్రయ్య జీవితమే ఒక ఉదాహరణ. విజయవాడ నుంచి మొవ్వ కేవలం 50 కిలోమీటర్లే!హంసల దీవి శ్రీ వేణుగోపాల స్వామి వేయి సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం కృష్ణా జిల్లాలోని హంసలదీవిలో ఉంది. అద్భుతమైన శిల్పకళ, చక్కటి కట్టడాలతో నిర్మించిన ఈ ఆలయం సముద్రపు అటుపోటులను తట్టుకునేలా ప్రాకారాన్ని నిర్మించారు. తూర్పు ముఖాన అద్భుతమైన రాజగోపురం ఉంటుంది. ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ వున్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై చెక్కిన రామాయణ ఘట్టాలు తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ఆలయం చుట్టూ ఎన్నో అందమైన శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. ఈశాన్యంలో పురాతన కళ్యాణమండపం కన్పిస్తుంది. ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తుల విశ్వాసం. ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘఛాయ లో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.మార్గం: కృష్ణాజిల్లా కోడూరు నుంచి 15 కి.మీ దూరం లోనూ, మోపిదేవి నుండి 28 కి.మీ దూరం లోనూ బంగాళాఖాతం అంచున ఈ పుణ్యక్షేత్రం ఉంది.కుంతీ మాధవస్వామి ఆలయం, పిఠాపురంఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మహత్యా΄ాతకం నుంచి విముక్తి కోసం ఐదు ్ర΄ాంతాల్లో విష్ణ్వాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం. ఈ ఐదు క్షేత్రాల్లో మాధవ స్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం, ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం, పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి.మార్గం : పిఠాపురం రాజమండ్రికి 62 కిలో మీటర్లు, సామర్లకోటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధానమైన రైళ్లన్నీ పిఠాపురంలో ఆగుతాయి. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం ఉంది.వేణుగోపాల స్వామి దేవాలయం – మెళియాపుట్టిశ్రీకాకుళం జిల్లాలో వెలసిన పురాతన వేణుగోపాల స్వామి దేవాలయం మెళియాపుట్టి గ్రామంలో కొలువై ఉంది. టెక్కలికి 24 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలో గల ఆలయాన్ని గజపతిమహారాజు 1810 లో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆలయ నిర్మాణం, ఆలయంలో కొలువైన వేణుగో΄ాల స్వామి ఎంతో సుందరంగా దర్శనమిస్తారు. డోల పౌర్ణమి ఉత్సవాలు 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్ర ఖజురాహో అని కూడా పిలిచేవారట.. అక్కడ ఉన్న నిర్మాణ శైలి, గోడల పైన ఉన్న శిల్పాలు అలా ఉంటాయట.శ్రీ రాజగోపాల స్వామి దేవాలయం నరసపూర్‌నరసపూర్‌లో కొలువైన రాజగోపాలస్వామి దేవాలయం 18 వ శతాబ్దానికి చెందినదిగా శాసనాల ద్వారా తెలుస్తుంది. గోదావరి నదిలో విగ్రహం లభించగా దానిని తీసుకొని వచ్చి ప్రతిష్టించి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఆలయంలో కొలువైన కృష్ణుడిని కల్యాణ కృష్ణుడిగా పిలుస్తారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ రాజగోపాల స్వామిగా కొలువైనారు. ఈ దేవాలయంలో స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే పెళ్లిళ్లు త్వరగా అవుతాయని నమ్మకం. స్వామి అనుగ్రహంతో పెళ్లి కుదిరిన వారు దేవాలయ ఆవరణలోనే పెళ్లి చేసుకుంటారు. సమ్మోహన వేణుగోపాల స్వామి దేవాలయ–జూనం చుండూరు, గుంటూరుగుంటూరు జిల్లా జూనంచుండూరు గ్రామంలో వెలసిన సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో నల్లనిరూపుడైన స్వామి విగ్రహం సుమారు ఆరు అడుగులు పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో సుందర, సుమనోహరంగా దర్శమిస్తోంది. దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణమైనట్లు కథనం. దేవాలయంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంది. స్వామి వారి మూలవిరాట్‌ ప్రణవ స్వరూపంలో ఉండి ఆపై వేణుగోపాలునిగా స్వామి దర్శనమిస్తారు. దేశంలో మరెక్కడా ఇటువంటి భంగిమ ఉన్నటువంటి విగ్రహం ఉండదంటారు. ఆది ప్రణవ స్వరూపంలో చుట్టూ దశావతారాలు, సప్త్తరుషులు, వేణుగోపాలునికి ఇరుపక్కల రుక్మిణి, సత్యభామలు గోవులతో కొలువుదీరి ఉంటారు.ఈ స్వామిని సేవిస్తే కల్యాణం అవుతుందని, సంతాన, సౌభాగ్య సంపదలకు లోటుండదనీ ప్రతీతి.– డి.వి.ఆర్‌.భాస్కర్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement