సాక్షి, అమరావతి: ఒక ప్రభుత్వ సంస్థకు కాంట్రాక్టు ఇస్తే ఎస్కలేషన్లు.. ఇష్టమొచ్చినరేట్లు కుదరవు. సర్కారు పెద్దల మాట చెల్లుబాటు కాదు. కమీషన్లు రావు.. అదే ఒక ప్రయివేటు సంస్థకు కాంట్రాక్టు ఇస్తే ఇష్టమొచ్చినట్లు రేట్లు వేసుకోవచ్చు. సర్కారు పెద్దలకు అనుకూలంగా ఆసంస్థ నడుచుకుంటుంది. కమీషన్లు దండుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం టెండర్ దక్కించుకున్న ‘ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం గమనిస్తే ఇది స్పష్టంగా అర్ధమౌతుంది. ఏఏఐ దక్కించుకున్న భోగాపురం టెండర్‌ను రద్దు చేస్తూ శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రూ. వేల కోట్ల పనులకు చెందిన టెండర్ల విషయంలో స్వయంగా సీఎం జోక్యం చేసుకోవడం, కావాల్సిన వారికి అనుగుణంగా నిబంధనలను రూపొందించాలని ఆదేశించడం, లేదంటే నామినేషన్, కొటేషన్లపై పనులు అప్పగించడం వంటివి చూసి అధికార యంత్రాంగం విస్తుపోతోంది. ఇపుడు ఏకంగా ఓ ప్రభుత్వ సంస్థ దక్కించుకున్న టెండర్‌ను చంద్రబాబు రద్దు చేయడం చూసి అధికారు లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కమీషన్లు రావనే రద్దు చేశారా..
ఏఏఐ టెండర్ విషయంలో సీఎం తీసుకున్న నిర్ణయం అనైతికమని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏఏఐ సంస్థ నుంచి ముడుపులు రావన్న ఉద్దేశంతోనే అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్‌ను రద్దు చేశారని విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అదే ప్రైవేట్ సంస్థకు టెండర్ ఇస్తే ‘ముఖ్య’ నేతకు ఆర్థికంగా భారీ ప్రయోజనం కలుగుతుందని, అందుకే అన్ని అర్హతలతో టెండర్ దక్కించుకున్న ఏఏఐకి కాంట్రాక్టు దక్కకుండా ఏకంగా టెండర్‌నే రద్దు చేశారని ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సింగిల్ టెండర్ మాత్రమే దాఖలైనా బావనపాడు పోర్టును అయిన వారికి అప్పగించేసిన సీఎం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్లలో జీఎంఆర్, ఏఏఐలు పాల్గొనగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా రెవెన్యూ వాటా ఇస్తానన్న ఏఏఐకి టెండర్ ఇవ్వకుండా ఎందుకు రద్దు చేశారో చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఇదీ విమానాశ్రయ స్వరూపం..
2703 ఎకరాల్లో నిర్మించే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రూ.2,461 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేట్ భూమి సేకరణకు హడ్కో రూ.840 కోట్ల రుణం కూడా మంజూరు చేసిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌గా భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 5311 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించారు. తొలుత రెండు దశల్లో నిర్మాణం చేపట్టాలని భావించినా ఆ తరువాత ఒకే దశలో 2703 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఎయిర్ పోర్టుకు 1733.66 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 592.69 ఎకరాలు, ఎయిర్ పోర్టుకు అప్రోచ్ రోడ్డుతో పాటు వాణిజ్య ప్రాంతానికి 175.70 ఎకరాలు, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్‌కు 201.21 ఎకరాలను కేటాయించారు.
ఏఏఐ టెండర్ దక్కించుకుందిలా..
అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి పీపీపీ విధానంలో 2016 జూన్‌లో టెండర్లను ఆహ్వానించారు. అయితే టెండర్ దాఖలుకు గడువును ‘ముఖ్య’ నేత సూచనల మేరకు 2017 జూలై 31వరకు పొడిగిస్తూ వచ్చారు. ఆ తేదీ నాటికి జీఎంఆర్ ఎయిర్ పోర్టు ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బిడ్లు దాఖలు చేశాయి. అదేరోజున టెక్నికల్ బిడ్లును తెరిచారు. రెండు బిడ్లు సక్రమంగానే ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటుచేసిన టెక్నికల్ కమిటీ తేల్చింది. అనంతరం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ సమక్షంలో 2017 ఆగస్టు 21న ఫైనాన్సియల్ బిడ్స్‌ను తెరిచారు. ఇందులో ఎయిర్ పోర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రెవెన్యూ వాటాగా 30.2 శాతం ఇస్తామని పేర్కొనగా జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రెవెన్యూ వాటాగా 21.6 శాతం ఇస్తామని పేర్కొంది. జీఎంఆర్ కన్నా ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తానని పేర్కొన్నందున ఏఏఐకే టెండర్‌ను ఇవ్వాలని అధికారులు సిఫార్సు చేశారు.
రద్దు వెనక ఉద్దేశాలు స్పష్టమే...
భూసేకరణ పూర్తి కాకపోవడం వల్లే భోగాపురం టెండర్ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అధికార యంత్రాంగమే పేర్కొంటోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా సైట్ క్లియరెన్స్ ఇచ్చిందని, అలాగే పర్యావరణ అనుమతిని కూడా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిందని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారమే టెండర్‌ను దక్కించుకున్నా, అధిక రెవెన్యూవాటాను ఇవ్వడానికి సిద్ధపడినా ఏఏఐ టెండర్‌పై నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి పక్కన పెడుతూ వచ్చారని అంటున్నారు. ఇప్పుడు హఠాత్తుగా భూ సేకరణ కాలేదంటూ అవాస్తవాలు చెబుతూ ఇంకా కొన్ని నిర్మాణాలు చేపట్టాలంటూ ఏఏఐకి వచ్చిన టెండర్‌ను ఇవ్వకుండా రద్దు చేయడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. పీపీపీలోనే టెండర్ పిలిచినప్పటికీ మళ్లీ పీపీపీలో టెండర్ పిలుస్తామనడం చూస్తుంటే ఎందుకనే విషయం తేలికగానే అర్థమవుతోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏఏఐ నిర్మించిందని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినందున జాప్యం లేకుండా నిర్మాణం పూర్తయ్యేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. టెండర్ దక్కించుకున్న ఏఏఐ సంస్థ ఇప్పుడు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ముడుపులివ్వని ఎయిర్‌పోర్టులు మనకేల తమ్ముడూ!
Published Mon, Jan 22 2018 1:06 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment