
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కుంభకోణానికి తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు ఒక వినతిపత్రం అందజేశారు. ‘‘నిరుపేదలకు నిత్యావసర వస్తువులను రాయితీతో అందించడం ద్వారా వారికి పోషకాహారాన్ని సమకూర్చడం, ధరల పెరుగుదల ప్రభావం వారిపై పడకుండా చూడడమన్నది పౌర సరఫరా వ్యవస్థ మౌలిక లక్ష్యం.
అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 28 వేల రేషన్ షాపుల్లో 6,500 షాపులను చంద్రన్న విలేజ్‌మాల్స్‌గా మార్చింది. డిసెంబర్ 12న గుంటూరు, విజయవాడలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించింది. సీఎం, ఆయన కుటుంబ సభ్యులకు వాటాలున్న రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ సంస్థలకు దాదాపు రూ.9,600 కోట్ల వ్యాపారాన్ని అప్పగించేందుకు పథకం సిద్ధం చేశారు. ఈ సంస్థలతో ఇప్పటికే ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది.
బ్రాండెడ్ ఉత్పత్తులను గరిష్ట చిల్లర ధరకంటే 35 శాతం తక్కువకే అందించేందుకు ఈ విలేజ్ మాల్స్ పెట్టామని సీఎం చంద్రబాబు చెప్పినప్పటికీ వాస్తవం వేరేవిధంగా ఉంది. మార్కెట్ ధరలకంటే కొన్ని వస్తువుల ధరలు రెట్టింపుగా ఉన్నాయి. ఇదొక స్కామ్. అందువల్ల మీరు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నిత్యావసరాలను బహిరంగ మార్కెట్ కంటే 35 శాతం తక్కువకే అమ్మేలా చర్యలు తీసుకోవాలి’’అని వైవీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment