
సాక్షి, అమరావతి: గత నాలుగు జన్మభూముల కంటే మరింత పటిష్టంగా అకౌంటబిలిటీనీ మరింత పెంచే విధంగా అయిదవ విడత జన్మభూమి కార్యక్రమా న్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములుగా చేస్తూ జనవరి 2 నుంచి జనవరి 11 వరకు ‘జన్మభూమి– మాఊరు’పేరుతో పదిరోజులు పాటు పండుగలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. జన్మభూమి కార్యక్రమ వివరాలను తెలియచేయడానికి శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సీఎం మాట్లాడుతూ రోజుకు ఒక అంశాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో దీనిపై చర్చించనున్నట్లు తెలిపారు.
మీడియాను కంట్రోల్ చేయాలి
రాష్ట్రంలో మీడియాను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివిధ సంస్థలకు, విద్యార్థులకు ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి బాబు వివరిస్తున్నప్పుడు మీడియాకూ ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా... మీడియా ఏది పడితే అదే రాయకుండా కంట్రోల్ చేయాల్సిన అవస రం ఉందన్నారు. రాష్ట్రంలో ఎటువంటి పోష కాలు లేని సన్న బియ్యాన్ని అధికంగా తిని షుగర్ వ్యాధి తెచ్చుకుంటున్నారని చెప్పారు.
గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం
బ్రిటిషర్లు కృష్ణానదిపై ఆనకట్ట కట్టడం, తర్వాత ప్రకాశం బ్యారేజ్ నిర్మించడంతో కృష్ణా డెల్టా సస్యశ్యామలమైందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ నిర్మించి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాత్రి దుర్గాఘాట్‌లో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఎక్కడ పడ్డ నీరు అక్కడే నిల్వ చేయాలనేది తన ఆశయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment